Panchaloha Idol
-
పంచలోహ విగ్రహాల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్
తాడిపత్రి: ఇత్తడి విగ్రహాలను పంచలోహ విగ్రహాలుగా నమ్మించి విక్రయాలు సాగిస్తున్న అంతర్ జిల్లా మోసగాళ్లను అరెస్ట్ చేసినట్లు తాడిపత్రి డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. వివరాలను బుధవారం స్థానిక పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. కర్నూలు జిల్లా మిడుతూరు మండలానికి చెందిన ముల్లా అక్బర్ బాషా, పాణ్యంకు చెందిన పిక్ అక్బర్, బనగానపల్లికి చెందిన షాలీబాషా ముఠాగా ఏర్పడి ఇత్తడితో తయారు చేసిన దేవతా మూర్తుల విగ్రహాలను పంచలోహ విగ్రహాలుగా నమ్మించి తాడిపత్రిలో మంగళవారం రాత్రి విక్రయించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న సీఐ కృష్ణారెడ్డి, ఎస్ఐ ధరణీబాబు అక్కడకు చేరుకుని ముగ్గురినీ అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరి నుంచి 12 ఇత్తడి విగ్రహాలతో పాటు రూ.5,800 స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టుబడ్డ మట్కా నిర్వాహకులు.. తాడిపత్రి మండలం సజ్జలదిన్నె సమీపంలో మట్కా నిర్వహిస్తున్న 14 మందిని అరెస్టు చేసి, రూ.5,76,000 నగదుతో పాటు 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు. పట్టుబడిన వారిలో ఓబులేసు, ఇమాంవలి, పీర్ల హాజీ ముస్తాఫాతో పాటు మరో 11 మంది ఉన్నారు. -
జాలరి వలలో పంచలోహ మీనాక్షి అమ్మన్ విగ్రహం
సాక్షి, చెన్నై(తిరువొత్తియూరు): తిరుచెందూరు సమీపంలో జాలరి విసిరిన వలలో మీనాక్షి అమ్మన్ విగ్రహం చిక్కింది. తిరుచెందూరు అమలినగర్ మాతా ఆలయానికి చెందిన జోషఫ్ కుమారుడు జయన్ (37). గత 15వ తేదీ రాత్రి సముద్రంలో చేపలు పడుతుండగా వలలో సుమారు అడుగు ఎత్తు కలిగిన మీనాక్షి అమ్మవారి పంచలోహ విగ్రహం చిక్కుకుంది. దీన్ని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు అప్పగించాడు. తిరుచెందూర్ తహసీల్దార్ స్వామినాథన్, శనివారం అమలినగర్‌కు వెళ్లి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే తిరుకుళకుండ్రంలో ప్రసిద్ధి పొందిన వేద గిరీశ్వరర్ ఆలయంలో శనివారం ఉదయం దేవాదాయశాఖ మంత్రి బి.కె.శేఖర్‌బాబు తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో వేదగిరీశ్వరర్ స్వామి ఆలయానికి రోప్‌కార్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చదవండి: (సీఎం స్టాలిన్ మరో కీలక నిర్ణయం.. సరికొత్త పథకానికి శ్రీకారం) -
చేపల వలలో పంచలోహ విగ్రహం
సాక్షి, అన్నానగర్(చెన్నై): మూడేళ్ల క్రితం చోరీకి గురైన 45 కిలోల పంచలోహ విగ్రహం జాలర్ల వలకు చిక్కింది. ఈ ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు..తిరువణ్ణామలై జిల్లా బోలూర్ అల్లినగర్కి చెందిన ముత్తుకుమరన్(32) జాలరి. ఇతను శుక్రవారం బోలైఊర్ కూల్ నదిలో చేపలు పట్టేందుకు నదిలో వల వేశాడు. అప్పుడు వల బరువుగా ఉండడంతో కష్టంగా పైకి లాగాడు. ఆ వలలో ఓ మూట వచ్చింది. మృతదేహం ఉందేమోనని భయపడి వెంటనే బోలూర్ పోలీసుస్టేషన్‌కి సమాచారం అందించాడు. ఇన్స్పెక్టర్ సురేష్‌బాబు, పోలీసులు అక్కడికి వచ్చి మూటను తెరచి చూశారు. అందులో 45 కిలోల బరువైన అమ్మవారి పంచలోహ విగ్రహం ఉంది. పోలీసులు ఆ విగ్రహాన్ని బోలూర్ తహసీల్దార్‌కు అప్పగించారు. ఈ విగ్రహం మూడేళ్ల క్రితం వసూర్ గ్రామంలోని చెల్లియమ్మన్ ఆలయం నుంచి చోరీ చేశారని పోలీసుల విచారణలో తెలిసింది. -
కలకలం రేపిన మకరతోరణం
ఉపాధిహామీ తవ్వకాల్లో బయటపడిన మకరతోరణం ముక్కలు పంచలోహ విగ్రహాలు మాయం చేశారంటూ వదంతులు బిట్రగుంట : బోగోలు మండలం విశ్వనాథరావుపేట పంచాయతీ కొత్తూరు నుంచి కొండబిట్రగుంట వెళ్లే మార్గంలో సమాధుల పక్కనే ఉపాధిహామీ తవ్వకాల్లో శుక్రవారం బయటపడిన మకరతోరణం ముక్కలు కలకలం రేపాయి. ఉపాధిహామీ పథకం కింద కూలీలు పనులు చేస్తుండగా పంచలోహ విగ్రహాలు, మకర తోరణం బయటపడిందని, విలువైన విగ్రహాలు మాయం చేసి మకరతోరణం మాత్రమే ఉంచారనే ప్రచారం జరగడంతో అధికారులు శనివారం ఉదయాన్నే ఆగమేఘాలమీద పరుగులు తీశారు. కేవలం మకరతోరణం ముక్కలు మాత్రమే బయటపడినట్లు కూలీలు స్పష్టం చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొత్తూరు -కొండబిట్రగుంట మధ్య శ్మశానవాటిక పక్కనే మూడు రోజుల నుంచి ఉపాధిహామీ పథకం కింద పశువులకు తాగునీటి గుంత తవ్వుతున్నారు. శుక్రవారం సుమారు 35 మంది కూలీలు తవ్వకాలు సాగిస్తుండగా అడుగున్నర లోతులో ఆలయాల్లో ఉత్సవ విగ్రహాలకు అలంకరించే మకరతోరణం బయటపడింది. మకరతోరణం ఆరు ముక్కలుగా ఉండటం, అంతగా ఖరీదైనది కాకపోవడంతో ముక్కలు పక్కన పడేసి కూలీలు యథావిధిగా పనులు చేసుకున్నారు. శనివారం ఉదయం స్థానికంగా పలు వదంతులు వ్యాపిం చాయి. పంచలోహ విగ్రహాలు, మకరతోరణం బయటపడిందని, విగ్రహాలు మాయం చేసి మకర తోరణం మాత్రమే అక్కడే పడేశారని పుకార్లు షికార్లు చేశాయి. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మకతోరణాన్ని పరిశీలించించారు. తహశీల్దార్ జయప్రకాష్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది మకరతోరణాన్ని స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు, పురావస్తుశాఖకు సమాచారం అందించారు. -
రంగనాయక స్వామి ఆలయంలో చోరీ
మహబూబ్‌నగర్ : మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురంలోని శ్రీరంగనాయక స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయంలోని స్వామివారి పంచలోహ విగ్రహాన్ని దుండగులు అపహరించుకు వెళ్లారు. విగ్రహం సుమారు 50కేజీల బరువు ఉంటుందని అంచనా. ఈరోజు తెల్లవారుజామున గస్తీకి వచ్చిన పోలీసులు చోరీ జరిగిన విషయాన్ని గమనించారు. కాగా దుండగులు ఆలయంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఈ చోరీకి పాల్పడ్డారు. గతంలోనూ ఈ ఆలయంలో చోరీ జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.