panchayatis
-
AP,TG: చంద్రబాబు ఇళ్ల వద్ద టీడీపీ శ్రేణుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్/గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకున్న నివాసాల వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్ పంచాయితీలతో పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా ఆ నివాసాల దగ్గర ఆందోళనకు దిగారు. విజ్ఞప్తి చేసేందుకు వస్తే తమను పార్టీ అధినేతను కలవనీయకుండా అడ్డుకుంటున్నారని నినాదాలు చేస్తున్నారు. ఇటు జూబ్లీహిల్స్ నివాసం.. టీడీపీలో ఆలూరు నియోజకవర్గ టికెట్ పంచాయితీ రాష్ట్రం దాటి హైదరాబాద్‌కు చేరింది. మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇంఛార్జి కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నివాసానికి ఆమె అనుచరులు తరలి వచ్చారు. ఆలూరులో పాతికేళ్లుగా టీడీపీ అభ్యర్థులు ఓడిపోతూనే ఉన్నారని.. ఈసారైనా గెలిపించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తామని వాళ్లు అంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును కలిసి వినతి పత్రం ఇస్తామని చెప్పగా.. పోలీసులు అందుకు అనుమతించలేదు. దీంతో సుజాతమ్మకు అనుకూల నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అటు ఉండవల్లి నివాసం వద్ద.. చంద్రబాబు నివాసం వద్ద కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ భాషా అనుచరుల ఆందోళనకు దిగారు. కదిరి టిక్కెట్ అత్తర్ చాంద్ భాషాకే ఇవ్వాలని పట్టుబట్టారు. ఈపాటికే కదిరి టికెట్‌ను టీడీపీ అధిష్టానం కందికుంట ప్రసాద్ సతీమణి యశోద దేవికి టీడీపీ కేటాయించింది. అయితే.. చాంద్‌భాషా ఐదేళ్లుగా నియోజకవర్గంలో కష్టపడుతున్నారని.. అన్యాయం చేయొద్దని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కదిరి టికెట్ కుదరని పక్షంలో.. హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని చెబుతున్నారు. అయితే టీడీపీ మాత్రం నో అంటోంది. ఈ క్రమంలో.. ఇవాళ ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను కదిరి టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చాంద్భాషాకి టికెట్ ఇస్తే టీడీపీ తప్పక గెలుస్తుందని లోకేష్‌తో కార్యకర్తలు చెప్పగా.. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఏం చేశారో మాకు తెలుసు. గొడవలొద్దు. అక్కడ టికెట్ గెలవాలి మీరు వెళ్లి పని చేయండని లోకేష్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కార్యకర్తలు తమ ఆందోళన కొనసాగిస్తున్నట్లు సమాచారం. -
‘సశక్తికరణ్’ అవార్డులపై కేటీఆర్ హర్షం
హైదరాబాద్: దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కారాల్లో భాగంగా రాష్ట్రానికి 12 జాతీయ అవార్డులు రావడం పట్ల మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్‌రావును ఆయన సన్మానించారు. రాష్ట్రానికి అవార్డులు వచ్చేలా కృషి చేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బందిని ఆయన అభినందించారు. గురువారం ప్రగతి భవన్లో ఎర్రబెల్లిని కలసిన సందర్భంగా రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేస్తూ, జాతీయస్థాయిలో రాష్ట్రానికి చెందిన 9 ఉత్తమ గ్రామ పంచాయతీలు, 2 మండలాలు, ఒక జిల్లా పరిషత్‌లకు అవార్డులు రావడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ వరుసగా అవార్డులు సాధించడం గొప్ప విషయమని, సీఎం కేసీఆర్ వినూత్నంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా నడుస్తున్న కారణంగానే గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రం ముందడుగు వేస్తోందని కేటీఆర్ అన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అసలైన గ్రామ స్వరాజ్య స్థాపన కేసీఆర్ హయాంలో జరుగుతోం దన్నారు. ఇదే తరహా పనితీరుని కొనసాగిస్తూ, రాష్ట్రానికి మరింత పేరు వచ్చే విధంగా పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. -
పంచాయతీల్లో ఈ-సేవలు
సంగారెడ్డి రూరల్: మండల పరిధిలోని అన్ని గ్రామాలను ఈ పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీడీఓ సంధ్య అన్నారు. గురువారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎర్ధనూర్, చిద్రుప్ప, తాళ్ళపల్లి, జుల్కల్ పంచాయతీలకు నాలుగు కంప్యూటర్లను ఆయా గ్రామాల సర్పంచులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో 27కు గాను ఇప్పటి వరకు 18 పంచాయతీలకు కంప్యూటర్లను అందజేశామన్నారు. ఆయా గ్రమాలను ఈ పంచాయతీలుగా మార్చినట్లు తెలిపారు. గ్రామపంచాయతీలకు సంబంధించిన ట్యాక్స్‌ల చెల్లింపులు, నిధుల వివరాలు, ఇళ్ల నిర్మాణల అనుమతులు, వివిధ రకాల ధ్రువీకరణపత్రాలను ప్రభుత్వ పథకాలకోసం వచ్చే దరఖాస్తులను కంప్యూటరీకరణ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ గోపాల్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చిల్వేరి ప్రభాకర్, నాయకులు అశోక్, రమేష్, ఎర్దనూర్, బ్యాతోల్ సర్పంచులు అనంతయ్య, శ్రీశైలం, పంచాయతీ కార్యదర్శులు శారద, శ్రీకాంత్, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. -
130 బార్లకు 2,100 దరఖాస్తులు
- ఒక్కో బార్ కోసం 5 నుంచి 10 పేర్లతో అప్లికేషన్లు - వచ్చే నెల 15 తరువాత డ్రా తీసే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన నగర పంచాయతీల్లో బార్ల ఏర్పాటుకు వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. జీహెచ్ఎంసీ, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లు సహా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కొత్తగా 130 బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్ జారీ చేయగా 2,100 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో గ్రేటర్ పరిధిలో ఏర్పాటు చేయనున్న 60 బార్లకు దాదాపు 200 దరఖాస్తులురాగా, మిగతా 70 బార్ల కోసం ఏకంగా 1,900 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తులను పరిశీలించి, అర్హతగల దరఖాస్తులను ఎంపిక చేసే పనిలో సిబ్బంది ఉన్నారు. రాష్ట్రంలో గత జూన్ వరకు 756 బార్లు ఉండగా జనాభా ప్రాతిపదికన బార్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి 13 వేల జనాభాకు, జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రతి 30 వేల జనాభాకు ఒక బార్ చొప్పున ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడున్న 497 బార్లకుగాను మరో 60 అదనంగా ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది. నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రస్తుతం 7 బార్లు ఉండగా కొత్తగా మరో 4 ఏర్పాటు కానున్నాయి. అలాగే రామగుండం కార్పొరేషన్లో ప్రస్తుతమున్న 6 బార్లను 8కి పెంచనున్నారు. 21 నగర పంచాయతీల్లో 30 బార్లు, 20 మున్సిపాలిటీల్లో కొత్తగా 29 బార్లు ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. నగర పంచాయతీలు, కొత్త మున్సిపాలిటీల్లో బార్లకు అవకాశం ఇవ్వడంతో స్థానికంగా ఉండే లాడ్జింగ్‌లు, రెస్టారెంట్లు, రిటైల్ మద్యం దుకాణాల యజమానులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఒక్కో బార్ కోసం ఒక్కొక్కరు వివిధ పేర్లతో 5 నుంచి 10 దరఖాస్తులు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. దరఖాస్తు ఫీజు కేవలం రూ. 5,000గా నిర్ణయించడంతో బార్ల కోసం బారులు తీరే పరిస్థితి ఏర్పడిందని ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. మరోవైపు బార్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ హైదరాబాద్‌లోని ఆబ్కారీ భవన్లో మొదలైంది. ప్రస్తుతం సెలవులు కావడంతో ఈ నెలాఖరు వరకు పరిశీలన, కంప్యూటరీకరణ పూర్తి చేయనున్నారు. వచ్చే నెల 15 తరువాత స్క్రూటినీలో మిగిలిన దరఖాస్తులను ఆయా ప్రాంతాల వారీగా డ్రా తీసే అవకాశం ఉంది. -
జిల్లాలో 76 పంచాయతీలు ఏకగ్రీవం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి, ప్రజల్లో ఐకమత్యం పెంపొందించడానికి ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుంది. ఏకగ్రీవమైన పంచాయతీలను ప్రోత్సహించడానికి నజరానాలు కూడా ఇస్తుంది. ఇటువంటి పంచాయతీలను రెండు కేటగిరీలుగా చేసి నిధులు మంజూరు చేస్తున్నారు. 15వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.7 లక్షలు, 15వేల కంటే అధికంగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. గత నెల 21, 23, 27 తేదీల్లో జిల్లాలోని 866 పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ముందు జిల్లావ్యాప్తంగా 84 పంచాయతీల్లో ప్రజలు సర్పంచ్‌లను ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు. ఇందులో 76 గ్రామాల్లో సర్పంచ్‌లతోపాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీటికి మాత్రమే పారితోషకం కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. ఏకగ్రీవమైన పంచాయతీలకు దాదాపు రూ.5 కోట్లకుపైగా నిధు లు వచ్చే అవకాశం ఉంది. కాగా 2006లో జిల్లాలోని 866 పంచాయతీలకు 49 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అప్పట్లో ఒక్కో ఏకగ్రీవ పంచాయతీకి రూ.5 లక్షలు చొప్పున పారితోషకం అందజేశారు. పారితోషికం ఖర్చులు ఇలా.. గ్రామంలో సర్పంచ్‌తోపాటు గ్రామాల్లో ఉన్న వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే దానిని ఎంటైర్‌బాడీ గుర్తిస్తారు. ఇలాంటి ఏకగ్రీవ పంచాయతీకి ప్రభుత్వం పారితోషకం ఇస్తుంది. ఈ నిధులను ఒక్కో పంచాయతీలో మొదటగా పర్మినెంట్‌గా ఉండే పంచాయతీ భవన నిర్మాణానికి, స్థలానికి, మురికివాడల్లో సమస్యలను పరి ష్కరించేందుకు, మురికికాలువలు శుభ్రం చేసేందుకు, గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టేందుకు, అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేయాలి. అందుబాటులో రూ.12 కోట్ల నిధులు జిల్లాలోని గ్రామ పంచాయతీల ఖాతాల్లో దాదాపు రూ.12 కోట్ల నిధుల వరకు అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల ప్రత్యేక పాలనలో ప్రతి మండలానికి జనరల్ ఫండ్స్ కింద రూ.16 కోట్ల నుంచి రూ.18 కోట్లు విడుదలైనట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో మండలంలో రూ.4 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉండవచ్చని అధికారుల అంచనా. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.12 కోట్లు ఉన్నట్లు అధికారుల ద్వారా సమాచారం. గ్రామాల్లో కొత్తగా కొలువుదీరిన సర్పంచ్‌లు చేపట్టే అభివృద్ధి పనులకు ఆ నిధులు ఉపయోగపడనున్నాయి. రెండేళ్ల ప్రత్యేక అధికారుల పాలన లో గ్రామీణులు నరకం చూశారు. నిధులున్నా ప్రత్యేకాధికారుల తీరు.. గ్రామాల అభివృద్ధిని కుంటుపడేలా చేసిం ది. అయితే ఖర్చుపెట్టని నిధులు ఇప్పుడు కొత్త సర్పంచ్‌లకు అందుబాటులోకి రానున్నాయి. పనులు చేయించిన గ్రామ పంచాయతీల్లో తక్కువగా, చేయని గ్రామాల్లో ఎక్కువగా, ఇలా చూస్తే ఒక్కో గ్రామ పంచాయతీల ఖాతాలో దాదాపు రూ.4 వేల నుంచి రూ.17 లక్షల వరకు నిధులు అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రస్తుతం నూ తనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లకు నిధుల కొరత లేకుండా పోయిందని అధికారులే చర్చించుకోవ డం గమనార్హం. అధికారికంగా చెక్‌పవర్ అందితే తాము హామీ ఇచ్చిన మేరకు సర్పంచ్‌లు అభివృద్ధి పనులు చేపట్టేందుకు సమాయత్తం కావాల్సి ఉంది. జీపీల ఖాతాల్లో ఉంటే ఉండొచ్చు.. - పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి రెండేళ్లుగా సర్పంచ్‌లు లేకుండా కొనసాగిన ప్రత్యేక అధికారుల పాలనలో మండలాల్లోని కొన్ని గ్రామాల్లో ఖర్చులు చేశారు. గ్రామాల్లోని ఆయా అవసరాలను బట్టి అధికారులు ఖర్చు చేసి ఉండొచ్చు. ఆ విధంగా జీపీల ఖాతాల్లో నిధులు జమ ఉంటాయి. అవసరాలను బట్టి నిధులను ఖర్చు చేస్తే కచ్చితంగా ఉండే ఉంటుంది. ఇప్పటి వరకు జీపీల ఖాతాల్లో జమ ఉన్నట్లు మాత్రం తెలియదు. ప్రస్తుతం గ్రామాల్లో పని చేసే సిబ్బందికి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.