సాక్షి, హైదరాబాద్/గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకున్న నివాసాల వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్ పంచాయితీలతో పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా ఆ నివాసాల దగ్గర ఆందోళనకు దిగారు. విజ్ఞప్తి చేసేందుకు వస్తే తమను పార్టీ అధినేతను కలవనీయకుండా అడ్డుకుంటున్నారని నినాదాలు చేస్తున్నారు.
ఇటు జూబ్లీహిల్స్ నివాసం.. టీడీపీలో ఆలూరు నియోజకవర్గ టికెట్ పంచాయితీ రాష్ట్రం దాటి హైదరాబాద్‌కు చేరింది. మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇంఛార్జి కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నివాసానికి ఆమె అనుచరులు తరలి వచ్చారు. ఆలూరులో పాతికేళ్లుగా టీడీపీ అభ్యర్థులు ఓడిపోతూనే ఉన్నారని.. ఈసారైనా గెలిపించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తామని వాళ్లు అంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును కలిసి వినతి పత్రం ఇస్తామని చెప్పగా.. పోలీసులు అందుకు అనుమతించలేదు. దీంతో సుజాతమ్మకు అనుకూల నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
అటు ఉండవల్లి నివాసం వద్ద.. చంద్రబాబు నివాసం వద్ద కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ భాషా అనుచరుల ఆందోళనకు దిగారు. కదిరి టిక్కెట్ అత్తర్ చాంద్ భాషాకే ఇవ్వాలని పట్టుబట్టారు. ఈపాటికే కదిరి టికెట్‌ను టీడీపీ అధిష్టానం కందికుంట ప్రసాద్ సతీమణి యశోద దేవికి టీడీపీ కేటాయించింది. అయితే.. చాంద్‌భాషా ఐదేళ్లుగా నియోజకవర్గంలో కష్టపడుతున్నారని.. అన్యాయం చేయొద్దని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కదిరి టికెట్ కుదరని పక్షంలో.. హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని చెబుతున్నారు. అయితే టీడీపీ మాత్రం నో అంటోంది.
ఈ క్రమంలో.. ఇవాళ ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ను కదిరి టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చాంద్‌భాషాకి టికెట్ ఇస్తే టీడీపీ తప్పక గెలుస్తుందని లోకేష్‌తో కార్యకర్తలు చెప్పగా.. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఏం చేశారో మాకు తెలుసు. గొడవలొద్దు. అక్కడ టికెట్ గెలవాలి మీరు వెళ్లి పని చేయండని లోకేష్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కార్యకర్తలు తమ ఆందోళన కొనసాగిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment