panchayatraj minister
-
వరంగల్ మాస్టర్ ప్లాన్@2041
సాక్షి, వరంగల్ : వరంగల్ మహా నగరం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్‌ను సమగ్రాభివృద్ధి చేస్తూనే ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కొత్త మాస్టర్ ప్లాన్ ఉంటుందని చెప్పారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ – 2041 ఆమోదంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కూడా) చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, ‘కూడా’ వైస్ చైర్మన్ ఎన్.రవికిరణ్, పీఓ ఇ.అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలోనే కొత్త మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలపనుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా చెప్పారు. దీనికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్‌కు సూచించారు. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా... రాష్ట్రంలో వరంగల్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం వరంగల్. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా మహా నగరాన్ని అభివృద్ధి చేసేలా కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేసుకున్నామని మంత్రి దయాకర్‌రావు తెలిపారు. గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్–1971ను సరిచేస్తూ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వరంగల్ మాస్టర్ ప్లాన్ – 2041 తయారైందని చెప్పారు. వరంగల్ సమగ్రాభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలందించేలా మాస్టర్ ప్లాన్ ఉందని తెలిపారు. మూడు జిల్లాల్లోని 19 మండలాలు, 181 రెవెన్యూ గ్రామాలు మాస్టర్ ప్లాన్ పరిధిలో ఉన్నాయని, మొత్తం 1800 చదరపు కిలోమీటర్ల పరిధి ఉంటుందని చెప్పారు. గత మాస్టర్ ప్లాన్‌తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ విస్తీర్ణం ఉంటుందని వివరించారు. టెక్స్టైల్ పార్క్, టూరిజం హబ్... వంటి అన్ని అంశాలతో వరంగల్ ఎకనామిక్ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కొత్త ప్లాన్ తయారు చేశామని, ‘కూడా’ పరిధిలో ఉన్న 2 వేల చెరువులను పరిరక్షించేలా చూస్తున్నామని చెప్పారు. అలాగే, పార్కుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ఇన్నర్, ఔటర్, రీజినల్ రింగు రోడ్లు.. ఇలా ప్రజల అవసరాల ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలు అమలవుతాయని మంత్రి తెలిపారు. ప్రజల సూచనలకు ప్రాధాన్యత ఇచ్చి అవసరమైన మార్పులతో తుది ప్లాన్ సిద్ధం చేశామని, ఎన్జీవోలు, పౌరుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. మాస్టర్ ప్లాన్‌ను ఆమోదం కోసం ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వానికి పంపించిన నేపథ్యంలో త్వరగా ఆమోదం పొందేలా మున్సిపల్ శాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. మునిసిపల్ శాఖ పూర్తిగా సమీక్షించిన అనంతరం ప్రభుత్వం ఆమోదం తెలపనుందని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఈ సందర్భంగా బదులిచ్చారు. ఈ సమావేశానికి ముందు మంత్రి దయాకర్‌రావు ‘కూడా’ చైర్మ న్, అధికారులతో కూడా ఈ విషయమై సమీక్షించారు. -
లోన్ సురక్ష విస్తరణ సేవలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : లోన్ సురక్ష విస్తరణ కార్యక్రమం సేవలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం సచివాలయంలో ప్రారంభించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రుణాలు పొందిన మహిళలు దురదృష్టవశాత్తు మరణిస్తే బీమా సొమ్ము నుంచే చెల్లించేందుకు లోన్ సురక్ష ఉపయోగపడుతుందని తెలిపారు. దీంతో పాటు అత్యవసర సహాయం కింద మరణించిన మహిళ కుటుంబానికి రూ. 5వేల ఆర్థిక సాయం అందుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా స్త్రీ నిధి కరదీపిక, స్నేహ అవగాహన బ్రోచర్లతో పాటు ఉపాధిహామీ వార్షిక నివేదికను మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు. -
ఒంటరి మహిళలకూ పింఛన్లు!
త్వరలోనే సానుకూల నిర్ణయం: మంత్రి కేటీఆర్ ఈ నెలాఖర్లో అభయహస్తం పింఛన్ల పంపిణీ స్థానిక ప్రజాప్రతినిధుల వేతన పెంపు భారం ప్రభుత్వంపైనే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒంటరి మహిళలకు కూడా పింఛన్లు ఇవ్వాలనే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. దీనిపై సహచర మంత్రుల నుంచి కూడా డిమాండ్ వస్తోందని, త్వరలోనే ఈ విషయంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సోమవారం అసెంబ్లీలో పంచాయతీరాజ్‌శాఖ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పింఛన్ల పంపిణీపై సామాజిక తనిఖీ చేపట్టే యోచన ఉందన్నారు. మార్చి నెలాఖరులో అభయహస్తం పింఛన్లను పంపిణీ చేస్తామన్నారు. ఆరు నెలల అభయహస్తం పింఛన్లను విడుదల చేశామన్నారు. శిధిలావస్థలో ఉన్న జిల్లా, మండల, గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణం కోసం రూ. 78 కోట్లు కేటాయించినట్లుగా మంత్రి చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనట్లుగా రూ. 5,470 కోట్లతో పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోని రోడ్లకు రిపేర్లు, కొత్త రోడ్లు, మట్టి రోడ్లు నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయిచిందన్నారు. రోడ్ల నాణ్యత పరిశీలనకు జిల్లాకో క్వాలిటీ కంట్రోల్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే వేసవిలో నీటి కొరత నివారణకు రూ. 263 కోట్లు కేటాయించామన్నారు. మిషన్ కాకతీయలో చేపట్టకుండా మిగిలిపోయిన కుంటలను ఉపాధి హామీ పథకంలో చేపడతామని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధాన కార్యక్రమాలు ఎక్కువగా తీసుకుంటామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాల పెంపు వల్ల రూ. 102 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువగా భరిస్తుందని కేటీఆర్ వెల్లడించారు. గౌరవేతనాల పెంపు భారాన్ని 80-90 శాతం భారం రాష్ట్ర ప్రభుత్వమే మోస్తుందన్నారు. కోఆప్షన్ సభ్యులకూ వేతనాల పెంపు వర్తిస్తుందన్నారు. అయితే రాష్ట్రంలోని 87 వేల మంది వార్డు సభ్యులకు గౌరవ వేతనాల పెంపు సాధ్యంకాదని కేటీఆర్ స్పష్టం చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలనే నిర్ణయానికి ముందు ఎన్నో చర్చలు, ప్రతిపాదనలు వచ్చాయన్నారు. గ్రామ పంచాయతీల ఆర్థిక స్వావలంబన కోసమే కనీసం 500 జనాభాను ప్రాతిపదికగా చేసుకున్నామని వివరించారు. రోడ్ల విస్తరణకు భారీగా నిధులు: మంత్రి తుమ్మల రాష్ట్రంలో రోడ్ల విస్తరణకు గతంలో ఎన్నడూ లేనివిధంగా నిధులను ఖర్చు చేస్తున్నామని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు. ఏకకాలంలో 149 మండలాల్లో 1,996 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ. 2,580 కోట్లను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఆరు ప్రధాన నదులపై వంతెనలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. మెట్రో రైల్‌ను 2017కు ముందే ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపాలిటీల్లో నీటికొరతను తీర్చడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కరెంటు కోతలు లేవు... ఉండవు: మంత్రి జగదీశ్‌రెడ్డి రాష్ట్రంలో ఇప్పటికే కరెంటు కోతలు లేవని, భవిష్యత్తులోనూ ఉండవని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ విడిపోతే కరెంటు ఉండదని, పంటలు ఎండిపోతాయని, పరిశ్రమలు తరలిపోతాయని, విద్యార్థులు చీకట్లో నలిగిపోతారని బ్లాక్మెయిల్ చేసినవారు ఇప్పుడు ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు. గతంలో జనవరి నుంచే కరెంటు కోతలు ఉండేవని గుర్తుచేశారు. సబ్స్టేషన్ల కోసం స్థలం దానం చేసిన వారికి అర్హతలుంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.