Pandit Deen Dayal
-
ఇక దీన్ దయాల్ చికెన్....!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని ముఘల్సరాయ్ రైల్వే స్టేషన్‌ను మంగళవారం నాడు అధికారికంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ రైల్వే స్టేషన్‌గా మార్చారు. ఈ పేరు మార్చే ప్రక్రియను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితమే చేపట్టింది. ఈ స్టేషన్‌కు ఆయన పేరు పెట్టడానికి కారణం ఈ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని పట్టాలపైనే 1968, ఫిబ్రవరి 11వ తేదీన దీన్‌దయాల్ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. ఆయన ఆరెస్సెస్ సభ్యుడే కాకుండా భారతీయ జన్ సంఘ్ సహ వ్యవస్థాపకులు. ఇలా పేర్లు మార్చడం పట్ల పలువురు ట్వీట్లు పేలుస్తున్నారు. చికిన్ ముఘ్లాయిని ఇక చికెన్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ అని, బెంగాల్ ముఘ్లాయి పరోటాను, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పరోటా అని పిలవాలని సూచిస్తున్నారు. దీన్ దయాల్ బిర్యానీ, దీన్ దయాల్ టిక్నా, దీన్ దయాల్ కుర్మా, దీన్ దయాల్ చికెన్ టిక్కా... అంటూ పేర్లు పెడుతున్నారు. మెఘల్ ఏ ఆజమ్ సినిమా పేరును కూడా మార్చాలని కోరుతున్నారు. ఇంతకు ఈ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఎవరని, ఆయన దేశానికి చేసిన సేవలేమిటో చెప్పండంటూ కొందరు నిలదీస్తున్నారు. లాల్ బహదూర్ శాస్త్రీ ముఘల్‌సరాయ్‌లో పుట్టారని, ఆయన స్వాతంత్య్ర యోధుడని, ఆయన దేశానికి రెండో ప్రధాన మంత్రి అని, రైలు ప్రమాదం జరిగినందుకు ఆయన తన రైల్వే శాఖకు రాజీనామా చేశారని, పెడితే అలాంటి గొప్పవ్యక్తి పేరు పెట్టాలని, ఆయన దీన్ దయాల్ లాగా రైలు పట్టాలపై చనిపోకపోవడమే ఆయన తప్పా? ట్విటర్లో పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు పేరు మార్చడం వల్ల ఒరిగేది ఏముందని, మౌలిక సౌకర్యాలను మెరగుపర్చాలని కొందరు సూచిస్తున్నారు. రైళ్లు సక్రమంగా వచ్చేలా, సవ్యంగా నడిచేలా చూడాలని, స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు. యోగి ఆధిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్రంలో ఆయన పలు పేర్లను మారుస్తున్నారు. ఆయన గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్నప్పటి నుంచే గోరఖ్‌పూర్‌లోని ఉర్దూ బజార్‌ను హిందీ బజార్‌గా, అలీ నగర్‌ను ఆర్య నగర్‌గా, మియా బజార్‌ను మాయా బజార్‌గా, ఇస్లామ్పూర్ను ఈశ్వర్పూర్గా, హుమాయున్ నగర్‌ను హనుమాన్ నగర్‌గా మార్చారు. తాజ్ మహల్‌ను తాను రామ్ మహల్ అని పేరు మార్చడానికి కూడా తాను వెనకాడనని యోగి ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇండియాను హిందుస్థాన్‌గా మారుస్తూ కూడా రాజ్యాంగాన్ని సవరించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం ఔరంగాజేబ్ రోడ్డును అబ్దుల్ కలామ్ రోడ్డని, అక్బర్ ఫోర్ట్‌ను అజ్మీర్ ఫోర్ట్‌ని కూడా మార్చింది. పేర్లు మార్చినప్పటికీ ప్రజలు మాత్రం పాతపేర్లనే ఇప్పటికీ ఉచ్ఛరిస్తున్నారు. -
బీజేపీ నాలుగు నెలల కార్యాచరణ
- క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు ప్రణాళిక - 50 లక్షల కుటుంబాలను కలిసేలా వ్యూహం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడానికి నాలుగు నెలల కార్యాచరణ ప్రణాళికను బీజేపీ విడుదల చేసింది. పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతిని పురస్కరించుకుని పోలింగ్ బూత్ స్థాయి వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రణాళికలో భాగంగా సైద్ధాంతిక అంశాలు, పార్టీ బలోపేతం, సమస్యలపై పరిశీలన, కిందిస్థాయి వరకు కేంద్ర పథకాల అమలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, పార్టీ శ్రేణులకు శిక్షణ వంటివి విస్తృతంగా చేపట్టనుంది. ఈ దిశలో సెప్టెంబర్ 25 వరకు రాష్ట్రంలోని 50 లక్షల కుటుంబాలను పార్టీ కార్యకర్తలు స్వయంగా కలుసుకుని క్షేత్రస్థాయిలో ఆయా అంశాల పరిశీలనకు చర్యలు తీసుకోనున్నారు. సెప్టెంబర్ 25 తర్వాత రాష్ట్రంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని, రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుందని బీజేపీ ఉపాధ్యక్షుడు, దీన్‌దయాళ్ సంచాలన సమితి ఇన్చార్జ్ టి.రాజేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ నాయకులు కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్‌రెడ్డి, సుధాకర శర్మతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తమకు ఎదురులేదనే టీఆర్ఎస్ అహంకార ధోరణి, కేసీఆర్ కుటుంబపాలనకు చెక్ పెట్టి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ కార్యాచరణను రూపొందించిందని చెప్పారు. ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రతిపక్షాలను ఉద్యమాలు చేయొద్దనడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అధికార అహంకారంతో వ్యవహరిస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పార్టీ కార్యక్రమాల్లో భాగంగా దీన్‌దయాళ్ ఆదర్శ జీవితం, రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలు, కేంద్రం రాష్ట్రానికి అందించిన సహాయం, తదితర వివరాలను బ్రోచర్ల ద్వారా 50 లక్షల కుటుంబాలకు తెలియజేస్తామన్నారు. కార్యవిస్తారక్ యోజనలో భాగంగా ఈనెల 29 నుంచి జూన్ 12 వరకు రాష్ట్రంలోని 32 పోలింగ్‌బూత్‌లలో 10 వేల మంది విస్తారక్‌లు పర్యటిస్తారని ఈ కార్యక్రమ ఇన్చార్జి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. తెలంగాణలో పార్టీ సంస్థాగత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి మొదలుకుని కిందిస్థాయి వరకు 15 రోజుల పాటు తమకు కేటాయించిన జిల్లాల్లో పనిచేస్తారన్నారు.