రామాచార్యులుకు చికాగోలో ఘననివాళి
సమాజ సేవకుడు, రాజకీయవేత్త పప్పూరు రామాచార్యుల జయంతి సందర్భంగా ఆయనకు చికాగోలో ఘనంగా నివాళులు అర్పించినట్లు చికాగో సాహితీ మిత్రుల సంఘం ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చికాగోలోని పర్విల్ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన సాహితీ సభకు డాక్టర్ విశ్వనాథరెడ్డి అధ్యక్షత వహించారు. రామాచార్యులు గురించి ఆయన ముని మనవడు ధర్మవరం శ్రీనివాస కిరణ్ వివరించారు. రామాచార్యుల సంపాదకీయంలో వచ్చిన పలు పత్రికల గురించి 'సప్నా' అధ్యక్షురాలు శొంఠి శారదాపూర్ణ తెలిపారు.
"రామయ్య పదాలు" పేరుతో రామాచార్యులు రాసిన ఆటవెలది పద్యాలను జయదేవ్ మెట్టుపల్లి పరిచయం చేశారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలను రామాచర్యులు ఆ రోజుల్లోనే గమనించి.. శ్రీబాగ్ ఒడంబడిక కోసం కృషి చేశారని డాక్టర్ విశ్వనాథ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా.. తిమ్మాపురం ప్రకాష్, డాక్టర్ రవి రెడ్డి, సుందర్ దిట్టకవి, భీమారెడ్డి తదితరులు రామాచార్యుల సాహితీ సేవలను వివరించారు. సభ ఏర్పాటుకు సహకరించిన యత్తపు శరత్, లింగారెడ్డిగారి వెంకటరెడ్డి, చిలమకూరు కృష్ణమోహన్లకు సాహితీమిత్రులు కృతఙ్ఞతలు తెలిపారు.