బాంబులకు 200 మీటర్ల దూరంలో ఆగిన రైలు!
స్థలం.. పరమానంద్ రైల్వే స్టేషన్
రాష్ట్రం.. పంజాబ్
ఘటన.. రైలు పట్టాలపై బాంబులు
సందర్భం.. దీనానగర్ పోలీసు స్టేషన్‌పై ఉగ్రదాడి
హీరోలు.. పరమానంద్ గ్రామస్థులు
అమృతసర్- పఠాన్‌కోట్ మార్గంలో పరమానంద్ అనేది ఓ చిన్న రైల్వేస్టేషన్. అయితే అది ప్రధానమార్గం కావడంతో అటువైపుగా చాలా రైళ్లు వెళ్తుంటాయి. సోమవారం ఉదయం కూడా ఓ ప్యాసింజర్ రైలు అటువైపుగా వెళ్తోంది. మరికొద్ది సెకన్లు దాటితే ఆ రైలు బ్రిడ్జి మీదకు వెళ్లేది.. బాంబులు పేలి రైలు తునాతునకలు అయిపోయేది, అనేక ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేవి. కానీ గ్రామస్థులు అప్రమత్తంగా వ్యవహరించి, బాంబులను గుర్తించారు. దాంతో సరిగ్గా బాంబులకు 200 మీటర్ల దూరంలో రైలు ఆగిపోయింది. అందులో ఉన్నవాళ్లంతా సురక్షితంగా ఉన్నారు. రైలు ఎందుకు ఆగిందో తెలియని వాళ్లు.. ఆ తర్వాత విషయం తెలిసి ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.
పరమానంద్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న రైలు బ్రిడ్జి మీద ఉగ్రవాదులు 5 బాంబులను అమర్చారు. వాటిని గ్రామస్థులు గుర్తించి వెంటనే అధికారులను అప్రమత్తం చేయడంతో.. బాంబులకు కొద్ది దూరంలో రైలు ఆగిపోయింది. ఆ మార్గంలో వెళ్లాల్సిన అన్ని రైళ్లను అధికారులు ఎక్కడికక్కడే ఆపేశారు. పంజాబ్ సాయుధ పోలీసు బలగంలోని బాంబు నిర్వీర్య దళాలు వచ్చి ఆ బాంబులను డిఫ్యూజ్ చేశాయి. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.