నేడు జిల్లాకు రాజన్న బిడ్డ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. వరుసగా నాలుగు రోజులపాటు ఆమె జిల్లాలో పర్యటిస్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. సోమవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి జిల్లెలగూడకు చేరుకుని అక్కడినుంచి ఆమె యాత్ర ప్రారంభించనున్నారు. ఇందు కోసం వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాట్లను పూర్తి చేశారు.
* నాలుగురోజులపాటు షర్మిల పర్యటన
* 590 కి.మీ. కొనసాగనున్న పరామర్శ యాత్ర
* వైఎస్సార్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక మరణి ంచిన
* వారి కుటుంబాలను కలుసుకోనున్న షర్మిల
* భారీగా ఏర్పాట్లు చేసిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి షర్మిల సోమవారం మధ్యాహ్నం మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్‌నగర్ మండలం జిల్లెలగూడలో మందమల్లమ్మ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తారు. అనంతరం జిల్లెలగూడలో వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన బి.అంజయ్య కుటుంబీకులను కలుసుకుంటారు.
అనంతరం మహేశ్వరం మండలం మంఖాల్‌లో ఎండల జోసెఫ్ కుటుంభసభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలోని పోకల్‌కార్ మహేశ్‌జీ కుటుంబసభ్యులను కలుసుకుంటారు. అనంతరం లోటస్‌పాండ్‌కు బయలుదేరుతారు. తొలిరోజు 177 కిలోమీటర్ల మేర పరామర్శ యాత్ర కొనసాగనుంది. రెండో రోజు 134 కిలోమీటర్లు, మూడో రోజు 153 కిలోమీటర్లు, నాలుగో రోజు 126 కిలోమీటర్ల చొప్పున మొత్తం 590 కిలోమీటర్ల మేర పరామర్శ యాత్ర కొనసాగుతుంది.
ఏర్పాట్లు పూర్తి చేసిన శ్రేణులు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. పరామర్శయాత్ర సాగే రహదారులు పార్టీ జెండాలతో నిండిపోయాయి. పరామర్శ యాత్రలో షర్మిలతోపాటు వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పాల్గొననున్నారు. పరామర్శ యాత్రతోపాటు పలుచోట్ల రోడ్‌షోల్లోనూ ఆమె పాల్గొననున్నట్లు పారీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన కూడళ్లు ఫ్లెక్సీలు, కటౌట్లతో నిండిపోయాయి. నాలుగురోజులపాటు యాత్ర జరుగుతున్నందున పార్టీ శ్రేణులు భారీగాపాల్గొననున్నాయి.
పరామర్శ యాత్రను విజయవంతం చేద్దాం
వైఎస్సార్ సీపీ నాయకురాలు షర్మిల పరామర్శ యాత్రను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి పిలుపు నిచ్చారు. సోమవారం మధ్యాహ్నం ప్రారంభం కానున్న పరామర్శ యాత్రలో వైఎస్సార్ అభిమానులు, నాయకులు పెద్దఎత్తున పాల్గొని తమ ప్రియతమ నాయకురాలికి స్వాగతం పలకాలని కోరారు. మందమల్లమ్మ చౌరస్తాలోని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి అంజయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని, అనంతరం అక్కడి నుంచి మహేశ్వరం మండలం మంఖాల్‌కు బయలు దేరనున్నట్లు పేర్కొన్నారు.
తొలి రోజు పర్యటన ఇలా
* సోమవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సరూర్‌నగర్ మండలం జిల్లెలగూడలో మందమల్లమ్మ చౌరస్తాకు చేరుకుంటారు.
* అక్కడ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం స్థానికంగా వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన బి.అంజయ్య ఇంటికి వెళ్లి ఆయన కుటుంబీకులను పరామర్శిస్తారు.
* అనంతరం మహేశ్వరం మండలం మంఖాల్‌లో ఎండల జోసెఫ్ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు.
* ఆ తర్వాత ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలోని పోకల్‌కార్ మహేశ్‌జీ కుటుంబీకులను పరామర్శిస్తారు.