చంద్రబాబును అరెస్టు చేయాల్సిందే
జోగిపేట: ‘ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడు ప్రధాన పాత్ర పోషించినా అరెస్టు చేయరా?’ అని వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నర్ర భిక్షపతి ప్రశ్నించారు. గురువారం అందోలు గెస్ట్‌హౌస్‌లో రంగారెడ్డి జిల్లాలో నిర్వహించే షర్మిల పరామర్శ యాత్రకు సంబంధించి వాల్‌పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించినా ఆయనపై కేసు నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఒకవేళ టీఆర్‌ఎస్, తెలుగుదేశం పార్టీలు కేంద్రం సూచన మేరకు కుమ్మక్కయితే భవిష్యత్తులో టీఆర్‌ఎస్ పార్టీకి పుట్టగతులుండవన్నారు. కాగా రంగారెడ్డి జిల్లాలో ఈనెల 29వ నుంచి షర్మిలమ్మ నిర్వహించే పరామర్శయాత్రను జిల్లా ముఖ్యనాయకులు పాల్గొని విజయవంతం చేయాలని నర్ర భిక్షపతి కోరారు.
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పచ్చచొక్కాలకే పథకాలకు ప్రాధాన్యతను ఇచ్చేవారని, ఇప్పుడు గులాబీ చొక్కాలకు ఇస్తున్నారని వైఎస్సార్ సీపీ అందోలు నియోజకవర్గ ఇన్‌చార్జి బీ.సంజీవరావు ఆరోపించారు. తాము ప్రజలకు అండగా ఉండి అవసరమైతే పార్టీ తరపున పోరాడతామని ఆయన తెలిపారు. వైఎస్సార్‌సీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు డీజీ మల్లయ్య యాదవ్, సిద్దిపేట వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి జగదీష్ గుప్త, నాయకులు పరిపూర్ణ, పాండు, ఏసు సమావేశంలో పాల్గొన్నారు.