ఆస్తుల కోసం ఇంతలా ఆరాటపడతారా? అది కూడా వందల కోట్లు పొందిన తరువాత మరింత కావాలని? అది కూడా సొదరుడు జైలుకెళ్లే ప్రమాదాన్ని పణంగా పెట్టిమరీ ఒక చెల్లి ఇలా ఆస్తి కోరుకుంటుందా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి షర్మిల తీరు అందరిని నివ్వెరపోయేలా చేస్తుంది. నిజంగానే ఆమెకు రావాల్సిన ఆస్తి ఏదైనా ఉంటే అడగడం తప్పు కాదు కానీ.. అడగాల్సిన అవసరమే లేకుండా అన్న జగన్ స్పష్టంగా సరస్వతి పవర్ లో వాటాలు రాసివ్వడానికి సిద్దపడినా, నానా రచ్చ చేయడంతో షర్మిల సాధించేది ఏమిటో ఆమెకే తెలియాలి. పేదరికంలో ఉన్నవారు కూడా సోదరుడి ఆస్తిలో వాటా కోసం ఇలా గుక్కపెట్టి రోదించరేమో!
ఏం తక్కువైందని షర్మిల ఇంతలా గొడవ చేస్తున్నారు. ప్రమాణాలు చేస్తానంటున్నారు? అయితే ఈ ప్రమాణాలకు, ప్రతిజ్ఞలకు విలువెంతో ఆమె చరిత్రే చెబుతుంది. తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుదిర్చి చేసిన పెళ్లినాటి ప్రమాణాలకే తిలోదకాలిచ్చిన విషయం షర్మిల మరచిపోయి ఉండవచ్చు.
అయితే అందులో తప్పు ఒప్పుల గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. కానీ అలాంటి నిర్ణయాలు ఒకరి వ్యక్తిత్వాన్ని సూచిస్తూంటాయి అని మాత్రం చెప్పక తప్పదు. తెలంగాణ బిడ్డనంటూ అక్కడ రాజకీయాలు మొదలుపెట్టి.. పాలేరు నియోజకవర్గంలో మట్టిపై ప్రమాణం చేసి ఇక్కడే ఉంటానని, పోటీచేస్తానని కూడా షర్మిల ప్రతిజ్ఞ చేసిన విషయం ఇక్కడ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అన్నకు పోటీగా రాజకీయాలు చేయనని చెప్పిన ఆమె తెలుగుదేశం ట్రాప్‌లో పడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎలా అడుగుపెట్టారు? సోదరుడు జగన్‌కు విరోధిగా ఎలా మారారు? ఒకప్పుడు తీవ్రంగా దూషించిన కాంగ్రెస్ పంచనే మళ్లీ ఎలా చేరారు? ఆ పార్టీని తానే ఉద్దరిస్తానని చెప్పుకుంటూ ఎలా తిరుగుతున్నారు? తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా రేవంత్‌ను ఉద్దేశించి షర్మిల అనుచితంగా దొంగ అని అన్ననోటితోనే ఆయన ముఖ్యమంత్రి కాగానే పొగిడారు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల ఆయనతో కార్యక్రమాలూ పెట్టించారు. తన సోదరుడు అంటే తనకు ప్రాణం అన్న స్వరంతోనే ఇప్పుడు విషనాగు అంటూ విషం చిమ్ముతున్నారు.
మీడియా సమావేశం పెట్టి షర్మిల ఏడుపులకు దిగడం ఏమిటో, సొంత బాబాయి వైవి సుబ్బారెడ్డిని పట్టుకుని జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నారని వ్యాఖ్యానించి అవమానించడం ఏమిటో! అంతేకాదు..ఆమె తల్లి ప్రస్తావన తెస్తూ, ఇలాంటి కొడుకును ఎందుకు కన్నానా? చిన్నప్పుడే చంపేస్తే బాగుండు అని తల్లి విజయమ్మ అనడం లేదంటూ చివరికి సోదరుడి మరణాన్ని కూడా పరోక్షంగా కోరుకుంటున్న వైనం బహుశా ఏ సోదరి ఇంత నీచంగా మాట్లాడదేమో! ఇలాంటివి చూడడానికే బతికి ఉన్నానా అని విజయమ్మ బాధ పడుతోందని ఆమె చెప్పారు.
నిజమే ఇంటిలో ఏ వివాదం వచ్చినా బాధపడేది అమ్మే. అయినా ఇప్పుడు షర్మిల మాటలు ఆమెకు ముల్లు మాదిరి గుచ్చుకుని ఉండాలి.అన్నంటే ప్రాణం అని చెప్పే వారేవరైనా ఇలా అరాచకంగా వ్యవహరిస్తారా? తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి, సోదరుడు జగన్ కు ప్రత్యర్దులైన చంద్రబాబు నాయుడు కళ్లలోను, పగబట్టినట్లు దారుణమైన అసత్య కథనాలు రాసే ఈనాడు, ఆంధ్రజ్యోతిల కళ్లలోను ఆనందం చూడడానికి అన్నట్లు షర్మిల వ్యవహరిస్తున్న తీరుతో ఎవరికి ఇలాంటి చెల్లి ఉండకూడదురా బాబు అనిపించదా! పోనీ ఇంత సానుభూతి నటిస్తున్న ఎల్లో మీడియా మరో వైపు జగన్‌వి అక్రమ ఆస్తులని ఎందుకు ప్రచారం చేస్తున్నాయి? ఇక్కడే వారి కుట్ర అర్ధం కావడం లేదా?
ఏ కుటుంబంలో అయినా గొడవలు వచ్చినప్పుడు ఎక్కడో చోట రాజీ కుదురుతుంది. ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం వహిస్తారు.
కానీ షర్మిల సరళి అంతా అన్ని దారులు మూసుకుపోవడానికే అన్నట్లుగా ఉంది. తండ్రి నుంచి వచ్చిన ఆస్తులు కాకుండా, జగన్ నుంచి 200 కోట్లు పొందిన మాట నిజమేనని ఒప్పుకుంటూ, అదేదో డివిడెండ్ అని చెబితే ఎలా కుదురుతుంది. ఆయా సంస్థలలో వాటాలు ఉంటేనే కదా డివిడెండ్ వచ్చేది. అదేమీ లేకుండానే షర్మిలకు అంత భారీ మొత్తం ఎలా ముట్టింది? చట్టం ప్రకరం ఆ డబ్బు కూడా ఇవ్వనవసరం లేదన్న సంగతి ఆమెకు తెలియదా! అయినా జగన్ ఇచ్చారంటే అది ఆమె మీద ఉన్న అభిమానం కాదా? తన తండ్రి జీవించి ఉన్నప్పుడు మనుమరాళ్లు, మనుమడు సమానం అని అన్నారని, కనుక తనకు జగన్ ఆస్తిలో వాటా రావాలనే ఎలా డిమాండ్ చేస్తున్నారు? సాక్షి, భారతి సిమెంట్ కంపెనీలలో తనకు వాటా ఉందని దబాయిస్తున్న తీరు చూస్తే దీని వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉందనిపిస్తుంది.
జగన్, భారతిలు ఈ కంపెనీల వృద్దికి విశేష కృషి చేశారు. వాటిని దెబ్బతీస్తే, జగన్ ఆర్థికంగా దెబ్బతింటారన్న కుట్ర ఉండి ఉండవచ్చు. రాజకీయంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదతర ఎల్లో మీడియా సాక్షి మీడియానాశనం అవ్వాలని కోరుకుంటుంది. అందుకోసం షర్మిలను రెచ్చగొడుతుంటారు.
అలాగే చంద్రబాబుకు సాక్షి తప్ప, మిగిలిన మీడియాలో అత్యధిక భాగం భజన చేసేవే. సాక్షి మీడియా లేకపోతే తన ప్రభుత్వంలో జరిగే అక్రమాలు ఏవీ బయటకు రావన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. ఈ నేపథ్యంలో షర్మిల వారికి ఒక ఆయుధంగా మారినట్లుగా ఉంది. షర్మిలను రాజకీయంగా ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు ఉపయోగించుకుని వదలివేస్తారు. అంతెందుకు! ఈనాడు మీడియా ఇదే సరస్వతి పవర్‌పై ఎన్ని దారుణమైన కథనాలు రాస్తోంది. ఆ కంపెనీ వాటాలన్నీ తనకే రావాలని కోరుతున్న షర్మిల ఈనాడు స్టోరీలను కనీసం ఖండించడం లేదేమి? తన తండ్రి పేరును పనిగట్టుకుని లాయర్ పొన్నవోలు సధాకరరెడ్డి ఛార్జిషీట్‌లో చేర్పించారని పిచ్చి ఆరోపణ చేశారు
ఒక లాయర్ కోరితే కోర్టులు వైఎస్ పేరును ఛార్జ్‌షీటులో చేర్చుతాయా? లేక దర్యాప్తు సంస్థ కోరితే చేర్చుతాయా? అసలు అన్నపై పెట్టింది అక్రమ కేసులేనని ఆమె చెప్పారు కదా? ఆ కేసులను పెట్టించింది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యేనని పలుమార్లు షర్మిలే చెప్పారు కదా? అన్న వదలిన బాణం అంటూ పాదయాత్ర చేశారు కదా? జగన్ కోరకపోయినా ఈమె పాదయాత్ర చేశారన్న వాదన కూడా ఉంది. ఇప్పుడు ఆమె చేస్తున్న కుట్రలు చూస్తుంటే జగన్ జైలులోనే ఉండాలని కోరుకున్నట్లుగా లేదా? జగన్ పై పెట్టిన కేసులు వంటి వాటిని మరెవరిపై పెట్టి ఉంటే, మూడు రోజులలో బెయిల్ వచ్చేదని ప్రముఖ న్యాయవాది ఎస్.రామచంద్రరావు అనేవారు. తన బెయిల్ రద్దు అవుతుందని తల్లి, చెల్లిపై కేసు పెడతారా అని అడగడంలోనే ఆమె విషపు ఆలోచనలు కనిపిస్తాయి. అంటే ఏమిటి దాని అర్థంఝ జగన్ జైలుకు వెళ్లినా ఫర్వాలేదు కాని, తనకు మాత్రం వందల కోట్ల ఆస్తి అప్పనంగా రావాలని కోరుకోవడమే కదా!
నిజానికి వారిపై జగన్ కేసే పెట్టలేదు. కేవలం తన వైపు వాదనను ఎన్.సి.ఎల్.టి కి తెలియచేశారు. గతంలో తానే బైబై బాబు అని నినాదం ఇచ్చానని చెప్పారు. బాగానే ఉంది.కాని ఇప్పుడు జైజై బాబు అన్నట్లుగా ఎలా మాట్లాడుతున్నారన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. చంద్రబాబు ఎలాగైతే డబుల్ టాక్ చేస్తారో, అచ్చం అలాగే షర్మిల కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. కొంతకాలం క్రితం వరకు జగన్ సోదరిగా షర్మిలపై ఎలాంటి విమర్శలు చేయడానికి అయినా వైసీపీ నేతలు వెనుకాడేవారు. ఎప్పుడైతే షర్మిల హద్దులు దాటారో, అప్పటి నుంచి వైసీపీ వారు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉదాహరణకు ఆమె వైవి సుబ్బారెడ్డిని ఉద్దేశించి జగన్ మోచేతి నీళ్లు తాగుతున్నారని, అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ,దానికి స్పందించిన మాజీ మంత్రి గుడివాడ అమరనాధ్, ఆమె చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారా అని ప్రశ్నించారు.ఆ పరిస్థితి తెచ్చుకోవడం దురదృష్టకరం.
ఇంకో విషయం చెప్పుకోవాలి. చట్టపరంగా షర్మిలకు ఈ ఆస్తులలో వాటా వచ్చే అవకాశం ఉంటే, ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉండేవారు కదా? అలా కాకుండా తండ్రి ఏదో అన్నారని చెబుతూ దానికి జగన్ బైండింగ్ కావాలని అనడం చట్టరీత్యా ఎలా కుదురుతుంది? అసలు తండ్రి ఏమన్నారో, ఏమి అనలేదో ఎవరికి తెలుసు. నిజంగానే వైఎస్ కు అలాంటి ఆలోనలు ఉంటే ఆమెను ఏదో కంపెనీలో డైరెక్టర్ గా చేసేవారు కదా అన్న ప్రశ్నకు బదులు దొరకదు.
ఇక్కడే షర్మిల వాదనలో బలహీనత కనిపిస్తుంది. షర్మిల తానేదో సోదరుడిని రచ్చ చేయగలిగానని సంతోషిస్తుండవచ్చు. చంద్రబాబో, ఎల్లో మీడియానో ఏదో సాయపడతారని ఆమె భ్రమపడుతుండవచ్చు.వాళ్ల లక్ష్యం జగనే తప్ప, షర్మిలకు ఉపయోగపడదామని కాదన్న సంగతి ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఈ పరిణామాలవల్ల జగన్ కు కొద్దికాలం చికాకు కలగవచ్చు. కాని షర్మిల తిరిగి కోలుకోలేని విధంగా పూర్తిగా ప్రతిష్టను కోల్పోయారు.
- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment