Parampara movie
-
పరంపర సీజన్-2 వచ్చేసింది, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
పరంపర..గతేడాది నెటిజన్లను విపరీతంగా ఆకర్షించిన వెబ్‌సిరీస్‌లలో ఇది ఒకటి. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్‌సిరీస్ మొదటి సీజన్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ సీజన్‌కు కొనసాగింపుగా రెండవ సీజన్ రాబోతుంది. పరంపర-2గా వస్తున్న వెబ్‌సిరీస్ జులై21 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. యంగ్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్‌సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది. దీంతో సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు.నాయుడు, గోపి మధ్య మొదలైన యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో ఊహించని మజిలీలతో ఆసక్తి రేపుతున్న "పరంపర సీజన్ 2" ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఎవరికోసమో మొదలుపెట్టిన యుద్ధం.. దేనికోసం అనే ప్రశ్న దగ్గర ఆగితే.. దానికి అసలైన సమాధానమే "పరంపర" సీజన్ 2. పాయింట్ బ్లాంక్ కి భయపడకుండా, ఎదురువెళ్ళి తెగబడే ఓ యువకుడి ధైర్యం ప్రపంచానికి వినిపించిన ఒక కొత్త స్వరం ఈ సీజన్-2. ప్రేమ, ప్రతీకారాల మధ్య నమ్మిన సిద్ధాంతం ఎవరిని ఎటు నడిపించిందో.. ఏ బంధాన్ని ఏ తీరానికి చేర్చిందో తెలుసుకోవాలంటే "పరంపర" సీజన్ 2 చూడాల్సిందే. సో డోంట్ మిస్. పరంపర సీజన్-2ని డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://bit.ly/3cue9Vc -
ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..
ప్రతివారం బాక్సాఫీసు వద్ద కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అయితే సమ్మర్లో పెద్ద సినిమాలు, పాన్ ఇండియా చిత్రాలు సందడి చేయగా.. ఇప్పుడు చిన్న సినిమాలు వరుసగా థియేటర్లోకి వస్తున్నాయి. ఇక బిగ్స్క్రీన్పై వచ్చిన పలు పెద్ద సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. అలా ఈ వారం థియేటర్లో, ఓటీటీలో సందడి చేసే చిత్రాలేంటో చూద్దాం రండి! ఈ వారం థియేటర్లో సందడి చేసే చిత్రాలివే: ‘థ్యాంక్యూ’ చేప్పేందుకు వస్తున్న నాగ చైతన్య అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చై విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనసూయా ‘దర్జా’ సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో పీఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి నిర్మించారు. ఈ నెల 22న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ‘షంషేరా’గా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న రణ్‌బీర్ కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, వాణీ కపూర్ జంటగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘షంషేరా’. యశ్ రాజ్ ఫిలింస్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న హిందీ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. ‘మహ’గా వస్తున్న హన్సిక హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రంలో హన్సిక నటించిన తొలి చిత్రం మహా. మదియళగన్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ సంస్థ, మాలిక్ స్ట్రీమింగ్ కార్పొరేషన్ అధినేత డత్తో అబ్దుల్ మాలిక్ నిర్మించిన ఈ చిత్రానికి జమీల్ దర్శకుడు. శింబు కీలక పాత్ర పోషిస్తుండగా శ్రీకాంత్, కరుణాకరన్, తంబి రామయ్య ముఖ్యపాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం జూలై 22వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ‘హై ఫైవ్’ అమ్మ రాజశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'హై ఫైవ్'. మన్నార చోప్రా, సుధీర్, అమ్మ రాజశేఖర్, సమీర్ తదితరులు నటించిన ఈ చిత్రం జూలై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. మీలో ఒకడు శ్రీమతి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ''మీలో ఒకడు''. సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నటులు కృష్ణ భగవాన్, సమీర్, అశోక్ కుమార్, బస్టాప్ కోటేశ్వరరావు, గబ్బర్ సింగ్ బ్యాచ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం జూలై 22న థియేటర్లోకి రాబోతోంది. జగన్నాటకం మనిషి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘జగన్నా టకం’. ఆరజ్ అల్తాడ దర్శకత్వంలో పార్వతీశం, కుమారస్వామి, స్వాతి మండల్ అర్ఫితా లోహి ప్రధానా పాత్రలు పోషించారు. ఈ మూవీ జులై 22 ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. వి. కిరణ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటంటే... ట్రిబుల్ ఫన్‌తో వస్తున్న ‘ఎఫ్ 3’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన చిత్రం ఎఫ్3. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, అలీ, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 22న ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, సోనిలివ్‌లో ఈ చిత్రం జూలై 22న నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ ప్రిడెటర్ హిందీ సిరీస్ - జూలై 20 ద గ్రే మ్యాన్(తెలుగు డబ్బింగ్) - జూలై 22 యూత్ ఆఫ్ మే (కొరియన్ సిరీస్) - జూలై 22 అమెజాన్ ప్రైం కమెండెడ్ ఫర్ యూ షార్ట్‌ఫిల్మ్ విడుదల - జూలై 20 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పరంపర 2 తెలుగు సిరీస్ జూలై 21న హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆహా తొలి తెలుగు ఓటీటీలో బిగ్‌బాస్ ఫేం షణ్ముక్ జశ్వంత్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ తెలుగు సిరీస్ జూలై 22న విడుదల కానుంది. సోనీ లివ్ డాక్టర్ అరోరా(హిందీ సిరీస్) - జూలై 22 మీమ్ బాయ్స్ (తమిళ సిరీస్) - జూలై 22 ఎఫ్ 2 మూవీ - జూలై 22 -
పరంపర 2 టీజర్ చూశారా?
హాట్‌స్టార్‌లో హిట్ అయిన వెబ్ సిరీస్‌లో పరంపర ఒకటి. గతేడాది రిలీజైన ఈ సిరీస్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా దీనికి సీక్వెల్‌గా వస్తోంది పరంపర సీజన్ 2. జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు హరి యేలేటి కథ అందించాడు. హరి యేలేటితో పాటు కృష్ణ విజయ్, విశ్వనాథ్ ఆరిగెళ్ల దర్శకత్వం వహించారు. గురువారం ఈ సిరీస్ నుంచి టీజర్ రిలీజైంది. 'నా ఉద్దేశం నాయుడిని చంపడం కాదు సర్, వాడి అహాన్ని దెబ్బకొట్టాలి' అంటూ నవీన్ చంద్ర చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. జూలై 21న ఈ సిరీస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: మేజర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సైబర్ పోలీసులకు సీనియర్ నటి ఫిర్యాదు -
క్రిస్మస్కి ఓటీటీ, థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే!
కరోనా తగ్గుముఖం పట్టాక ఇండస్ట్రీ సినిమా రిలీజ్‌ల మీద దృష్టిపెట్టింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్ వరకు కదిలి వస్తారని అఖండ, పుష్ప సినిమాలు నిరూపించడంతో చిన్న చిత్రాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో దూకుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం పెద్దపెద్ద సినిమాలు కూడా రిలీజవుతున్నాయి. అటు థియేటర్‌తో పాటు ఓటీటీలో కూడా పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. అవేంటో చూద్దాం.. క్రిస్మస్కు థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే! నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా గతంలో నాని నటించిన టక్ జగదీశ్ ఓటీటీలో విడుదల కావడంతో ఆయన అభిమానులు నిరాశపడ్డారు. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’ థియేటర్లోనే విడుదలవుతుండటంతో అతడి ఫ్యాన్స్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘83’. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, జీవా, తాహీర్ రాజ్ భాసీన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. టిమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌గా రూపొందిన ఈ చిత్ర రణ్వీర్ సింగ్ లీడ్ రోల్ పోషిస్తుండగా దీపికా ఆయన భార్య రోమి భాటియాగా నటిస్తోంది. కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, దీపిక పదుకొనె, సాజిద్ నడియాడ్వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24 దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూడు పుఠాణి’. పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, కటారి రమేష్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ థ్రిల్లర్ డిసెంబరు 25న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రఘు కుంచె ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందించిన ఈ చిత్రం ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుందని ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. పూర్ణ ప్రధాన పాత్రలో కర్రి బాలాజీ తెరకెక్కించిన చిత్రం ‘బ్యాక్‌డోర్’. బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మాత. ప్రణవ్ స్వరాలందించారు. ఈ సినిమాని డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘వైవిధ్యభరితమైన కథాంశంతో.. చక్కటి సందేశమిస్తూ సినిమాని రూపొందించాం. పూర్ణ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని నిర్మాత తెలియజేశారు. యాక్షన్ ప్రియులను విశేషంగా అలరించిన చిత్రం ‘ది మ్యాట్రిక్’. 1999లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘ది మ్యాట్రిక్స్ రీలోడెడ్’, ‘ది మ్యాట్రిక్స్ రెవెల్యూషన్స్’ చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు 13ఏళ్ల తర్వాత ఈ సిరీస్‌లో వస్తున్న చిత్రం ‘ది మ్యాట్రిక్స్ రీసర్కషన్స్’ లానా వచౌస్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీనూ రీవ్స్, క్యారీ అన్నె మోస్‌లతో పాటు, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తుస్తోంది. ఈ చిత్రంలో ఆమె సతి అనే సాహసోపేతమైన పాత్ర పోషిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఆనంద్ చంద్ర తెరకెక్కించిన చిత్రం ‘ఆశ ఎన్కౌంటర్’. 2010లో యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాద్ గ్యాంగ్‌రేప్‌ను ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. హైదరాబాద్ నగరశివారులోని చటాన్‌పల్లి వద్ద ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెను అతి క్రూరంగా హత్య చేశారు. ఇదే కథను నేపథ్యంగా చేసుకుని ఆనంద్ చంద్ర ‘ఆశ ఎన్కౌంటర్’ తెరకెక్కించాడు. డిసెంబరు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్జీవీ సమర్పణలో అనురాగ్ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్చే చిత్రాలు ఇవే డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు) ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు)'. తొలిసారిగా కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోని లివ్', డిసెంబర్ 24న స్ట్రీమింగ్ కానుంది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో రామంత క్రియేషన్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు. ‘వరుడు కావలెను’ నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ప్రేమ, కుటుంబం, అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అతరంగీ రే బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్, కోలీవుడ్ నటుడు ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రం ‘అతరంగీ రే’. సారా అలీఖాన్ కథానాయిక. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడు. ఈ సినిమా ఓటీటీ ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్కానుంది. ఇంద్రజాలికుడిగా అక్షయ్‌కుమార్, ప్రేమికులుగా ధనుష్, సారా అలీఖాన్ కనిపించనున్నారు. సత్యమేవ జయతే జాన్ అబ్రహం కథానాయకుడిగా తెరకెక్కి విజయం సాధించిన చిత్రం ‘సత్యమేవ జయతే’. దానికి కొనసాగింపుగా ‘సత్యమేవ జయతే 2’ వచ్చిన సంగతి తెలిసిందే. మిలాప్ జవేరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యా కోస్లా కుమార్ ఓ కీలక పాత్రలో నటించింది. యాక్షన్ సన్నివేశాలకు ఇందులో పెద్ద పీట వేశారు. కాగా, డిసెంబరు 24వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. పరంపర మూవీ సరిగ్గా ఉండడానికి, మంచిగా ఉండడానికి మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడైనా స్పష్టమైన విజేత ఉంటాడా? కుటుంబ సంబంధాలలో చెడు వారసత్వాన్ని ఉంచడం దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందా?లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందా? వంటి విషయాలకు సమాధానం కావాలంటే ‘పరంపర’ చూడాల్సిందే అంటున్నారు ‘బాహుబలి’ నిర్మాతలు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. హరి యెల్లేటి కథను అందించారు. డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ‘పరంపర’ స్ట్రీమింగ్ కానుంది. మానాడు తమిళ నటుడు శింబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మానాడు’. గత నెలలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ‘లూప్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైం లూప్ అనే వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో పాత్రతోపాటు పోలీసు ఆఫీసర్ ‘డీసీపీ ధనుష్కోటి’ పాత్ర కూడా ఎంతో కీలకం. ఈ పాత్రను నటుడు, దర్శకుడు ఎస్.జె సూర్య పోషించారు. కాగా, ఇప్పుడు ఈ చిత్రం డిసెంబరు 24న ప్రముఖ ఓటీటీ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
సినిమా రివ్యూ : పరంపర
పిల్లలను ఎలా పెంచాలి? దీన్ని ఒకప్పటి తరాలు పెద్ద విషయంగా తీసుకోలేదేమో కానీ, ఇవాళ ఆకాంక్షలు, అవకాశాలు పెరిగి, పిల్లల భవితవ్యంపై పెద్దల నిర్ణయాల ఒత్తిడి పెరిగిపోతున్న సందర్భంలో కీలకంగా మారింది. పిల్లలకు ఆసక్తి ఉన్న అంశాన్ని వదిలేసి, వారి మీద పెద్దలు మరేదో బలవంతాన రుద్దితే.. తలెత్తే విపరిణామాలు చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంలో మూడు తరాల కథగా, ప్రకృతి నేపథ్యంలో పిల్లల వికాసానికి తల్లితండ్రుల ప్రోత్సాహం ఎంత అవసరమో చెప్పడానికి చేసిన చిరు ప్రయత్నం - ‘పరంపర’. కథ ఏమిటంటే.: అనగనగా ఒక పట్నం అబ్బాయి. అతని పేరు - పవన్ (మాస్టర్ సాయితేజ). స్కూలులో చదువుకుంటూ, షటిల్ బ్యాడ్మింటన్ అంటే పిచ్చి ప్రేమతో ఉంటాడా అబ్బాయి. అతని తండ్రి రాఘవ (నరేశ్). బ్యాడ్మింటన్ పట్ల కొడుకుకున్న ఆసక్తిని మాత్రం ప్రోత్సహించడు. ఆ అబ్బాయి తాత పరంధామయ్య (రావి కొండలరావు). పల్లెటూళ్ళో ఉంటాడు. పరంధామయ్య తన కొడుకు రాఘవను కవిత్వానికి దూరం చేయడంతో, రచనాసక్తిని చంపుకొని, ఇలా చిరు ప్రభుత్వోద్యోగం చేస్తుంటాడు. రాఘవ కుటుంబం చాలా కాలం తరువాత దీపావళికి పల్లెటూరుకు వెళుతుంది. అక్కడ తన తండ్రికి చిన్నప్పటి నుంచి ఉన్న కవితాసక్తి పవన్‌కి తెలుస్తుంది. పిల్లాడిలోని బ్యాడ్మింటన్ ప్రేమ తండ్రికర్థమవుతుంది. అక్కడ మలుపు తిరిగే కథతో సాగుతుంది ‘పరంపర’. ఎలా నటించారంటే: సీనియర్ నటుడు నరేశ్‌లోని భావప్రకటన సామర్థ్యాన్ని ఈ చిత్రంలో మరోసారి చూడవచ్చు. పరిశ్రమ సరైన పద్ధతిలో వినియోగించుకుంటే, తెలుగు సినిమాకు మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత లేదనడానికి ఇందులోని సన్నివేశాలే నిదర్శనం. నరేశ్ భార్య పాత్రలో ఆమని పరిధి మేరకు నటించారు. అయిదు దశాబ్దాల పైగా సినీ నటనానుభవమున్న రావి కొండలరావు తాతయ్య పాత్రలో సెంటిమెంట్ పండించారు. చిన్ననాటి పవన్‌గా బాలనటుడు మాస్టర్ సాయితేజ బాగున్నాడు. పెద్ద పవన్ పాత్రను సంతోష్ సమ్రాట్ ధరించారు. ఎలా ఉందంటే: ఇంజనీరింగ్ చదువుల సంతలో మారుపడిపోతున్న సమయంలో తండ్రీ బిడ్డల మధ్య ఉండే అనుబంధాన్నీ, పిల్లలకున్న నిజమైన ఆసక్తి పట్ల పెద్దలకు ఉండాల్సిన అక్కరనూ గుర్తు చేసే కథాంశమిది. ఒక తరం ప్రేక్షకులను తమ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళి, అక్కడ కాసేపు వదిలేసి, ఆగి ఆలోచింపజేస్తుంది.కొడుకు ఆసక్తిని గమనించకుండా గుమాస్తా గిరిలోకి నెట్టేసిన ఒక తండ్రి, పిల్లాడిలోని ప్రతిభకు నారుపెట్టి నీరుపోయకుండా నిర్లిప్తతలోకి జారిపోయిన కొడుకు, మనవడిలోనైనా కొడుకు విజయాన్ని చూసుకోవాలనుకొనే ఒక తాత - ఈ పాత్రలన్నీ జీవితంలో నుంచి తెరపైకొచ్చినవే. నరేశ్ పాత్ర పరిధి ఎక్కువుండే ఫస్టాఫ్ కొన్నిచోట్ల మనసును తడి చేస్తుంది. సినిమాటోగ్రాఫర్‌గా అనుభవం, పేరు సంపాదించుకున్న మధు మహంకాళి తొలిసారిగా మెగాఫోన్ పట్టిన చిత్రమిది. దర్శక - నిర్మాతగా తొలి అడుగు కావడం, పరిమిత వనరుల ప్రయత్నం అవ్వడం వల్ల... స్క్రిప్టులో, చిత్రీకరణలో నెరుసులున్నాయి. అయినా లక్షలు వెచ్చించి చేసిన ఈ సాహసాన్నీ, యూనిట్ చిత్తశుద్ధినీ శంకించలేం. పిల్లల ఆసక్తిని గమనించి భుజం తడితే, ఎంచుకున్న రంగంలో వారు ఉన్నతంగా ఎదుగుతారని ఈ ఆధునిక తరం తల్లితండ్రులకు సున్నితంగా గుర్తు చేస్తుందీ సినిమా. అందమైన, ఆకుపచ్చ జ్ఞాపకాల పల్లెటూరు, కలువలు పూచే చెరువు, డొంకబాటలు, కల్మషం లేని ఆటపాటలు - అన్నిటినీ ప్యాన్ చేసుకుంటూ, కెమేరా కన్ను తన వెంట ప్రేక్షకుల్ని తీసుకువెళుతుంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఇదొక రిఫ్రెషింగ్ అనుభవం. అలాగే, నేపథ్య సంగీతం కొన్ని ఘట్టాల్లో ఆర్ద్రతను పెంచింది. నేపథ్యంలో వచ్చే పాటలూ, కొన్నిచోట్ల కవితాత్మకమైన సంభాషణలూ సినిమాలో ఉన్నాయి. మరి, లోటుపాట్లు లేవా అంటే ఎందుకు లేవూ...ఉన్నాయి. అయితే, రొటీన్ చిత్రాలకు భిన్నంగా, జీవితంలోని సెన్సిబులిటీస్‌తో ఇలాంటి ప్రయత్నాలు తెలుగు తెరపై జరగడమే అరుదైపోయిన రోజులివి. ఆ నేపథ్యంలో చిన్న బడ్జెట్ ప్రయత్నాలకుండే అనివార్యమైన బలహీనతలను సానుభూతితో అర్థం చేసుకుంటూనే ఈ ‘పరంపర’ను చూడాలి. ఆ దృష్టితో చూస్తే, మంచి సినిమాలను ఆశించే వారు కొరుకొనేది - తెలుగులో ఇలాంటి ప్రయత్నాల ‘పరంపర’ కొనసాగాలని! బలాలు: * ఛాయాగ్రహణం * రీరికార్డింగ్ * జీవితాన్ని ప్రతిఫలించే సన్నివేశాలు * ఎంచుకున్న లొకేషన్లు సహజ నటన బలహీనతలు: * రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలలా లేకపోవడం ఫైట్స్, ఐటమ్ సాంగ్స్ లేకపోవడం * కామెడీ ట్రాక్‌లంటూ పెట్టకపోవడం