parchuru
-
వెంకటగిరి, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్తలను నియమించిన వైఎస్సార్సీపీ
-
రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి, పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఆమంచి కృష్ణమోహన్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: (పచ్చమీడియా పైత్యపురాతలు.. గంటల కొద్దీ ఆలస్యానికి ముందే ప్రణాళికలు) -
గుండెపోటుతో పర్చూరు జెడ్పీటీసీ మృతి
సాక్షి, ప్రకాశం(పర్చూరు): గుండెపోటుతో పర్చూరు జెడ్పీటీసీ సభ్యురాలు కొల్లా గంగాభవాని (56) సోమవారం మృతి చెందారు. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో ఇంటి వద్దనే తుదిశ్వాస విడిచినట్లు భర్త మాజీ జెడ్పీటీసీ కొల్లా సుభాష్‌బాబు తెలిపారు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె నాగులపాలెం సర్పంచ్‌గా పనిచేశారు. భర్త కొల్లా సుభాష్‌బాబు సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేశారు. మామ కొల్లా రామయ్య పర్చూరు తొలి ఎమ్మెల్యేగా పనిచేశారు. కొల్లా సుభాష్‌బాబుకి స్వాతంత్య్ర సమరయోధులు మాజీ మంత్రి దివి కొండయ్య చౌదరి స్వయానా బావ కావడంతో వీరి కుటుంబానికి రాజకీయంగా ప్రాధాన్యత ఉంది. ఆమె మృతి పలువురు రాజకీయ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు నాయకులు విచారం వ్యక్తం చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మృతదేహాన్ని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త రావి రామనాథంబాబు సందర్శించి నివాళులర్పించారు. -
ఇంగ్లండ్ నారి.. సైకిల్ సవారీ
సాక్షి, పర్చూరు(ప్రకాశం): సైక్లింగ్‌లో ప్రపంచ రికార్డు సాధించడం కోసం ఇంగ్లండ్‌కు చెందిన ఇద్దరు మహిళలు భారీ సాహసానికి పూనుకున్నారు. ఇంగ్లండ్‌లోని జార్జియాకు చెందిన మహిళలు ఫ్లోకార్ట్, రేజ్ జూన్ 29న ఇంగ్లాండ్‌లో ఒకే సైకిల్‌పై యాత్ర ప్రారంభించారు. వీరు శుక్రవారం పర్చూరుకు చేరుకోగా స్థానికులు సాదర స్వాగతం పలికారు. ఇప్పటి వరకు 13 దేశాల్లో 6 వేల మైళ్లు సైకిల్ యాత్ర చేశామని పేర్కొన్నారు. గిన్నిస్ రికార్డు నెలకొల్పడం ద్వారా వచ్చిన నగదును ఆక్ఫామ్ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు అందజేస్తామని తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు బాగున్నాయన్నారు. ఇంగ్లండ్‌లో చట్టాల అమలు కఠినంగా ఉంటుందని, అక్కడ ట్రాఫిక్ నియంత్రణలోనే ఉంటుందని చెప్పారు. భారత్‌లో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదన్నారు. స్థానిక హ్యుమన్ రైట్స్ నాయకుడు ఎం.హరిప్రసాద్ ఇంట్లో సేద తీరిన ఇంగ్లండ్ మహిళలు ఆతిథ్య విందు స్వీకరించారు. తాము ముంబయికి వెళ్తున్నట్లు చెప్పారు. చదవండి : రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న చలానాలు.. -
పర్చూరు టీడీపీకి షాక్
సాక్షి, కారంచేడు (ప్రకాశం): టీడీపీ నాయకులు భయపడుతున్నట్టుగానే జరిగింది. అసమ్మతి నాయకులు కీలక సమయంలో జలక్ ఇచ్చారు. మాకొద్దీ ఎమ్మెల్యే అని ఎంత మొత్తుకున్నా వినకుండా తెలుగుదేశం పార్టీ అధినేత బలవంతంగా తమపై రుద్దిన ఏలూరి అభ్యర్థిత్వానికి వ్యతిరేకించారు. తాము ప్రకటించినట్లుగానే ఏలూరిని ఓడించేందుకు దగ్గుబాటి కుటీరంలో చేరుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో సుమారు 5500కి పైగా టీడీపీ కుటుంబాలు వైఎస్సార్ సీపీ కండువ కప్పుకున్నాయి. దగ్గుబాటి గతంలో చేసిన అభివృద్ధి, మాట తప్పని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీలు, మేనిఫెస్టోకు ఆకర్షితులై వైఎస్సార్ సీపీలోకి చేరుతున్నారు. ఈ చేరికల పరంపరతో పర్చూరులో దగ్గుబాటి విజయం నల్లేరుపై బండినకేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాము టీడీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో.. అక్కడి నేతల తీరుపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఓటమి ఎరుగని నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావుకు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై ఉన్న అసమ్మతి దగ్గుబాటి విజయాన్ని మరింత సులువు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది పర్చూరు రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. దగ్గుబాటి తనదైన శైలిలో తన ఎన్నికల ప్రచారంను నిర్వహిస్తున్నారు. ఏలూరిని వీడుతున్న అసమ్మతి నేతలు.. స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు అసమ్మతి నాయకులు కోలుకోలేని షాక్ ఇచ్చారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఉన్న ఆయన అసమ్మతి నేతలు ఆయనకు సీటు ఇస్తే కచ్చితంగా ఓడించి తీరతామని తీర్మానించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనతో అసమ్మతి నేతలు ఎమ్మెల్యేతో కలిసి సాగుతామని ఆయనతో చెప్పి బైటకు వచ్చారు. కానీ తమ మనసుకు వ్యతిరేకంగా ఏలూరితో కలిసి పనిచేయలేక ఆపార్టీని వీడి బైటకు వచ్చి డాక్టర్ దగ్గుబాటి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరతున్నారు. వీరితో పాటు వారి అనుచర వర్గాలు కూడా దగ్గుబాటి కుటీరానికి క్యూ కడుతున్నారు. 25 నుంచి 30 సంవత్సరాలుగా పార్టీ విజయానికి కృషి చేసిన తమను విస్మరించడం జీర్ణించుకోలేకనే టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ సీపీలో చేరుతున్నామని ప్రకటిస్తున్నారు. దీనికి తోడు గతంలో ఈ ప్రాంత అభివృద్ధికి డాక్టర్ దగ్గుబాటి చేసిన అనేక అభివృద్ధి, సంక్షేమ çపథకాలు మళ్లీ ఆయనతో కలిసి పనిచేసేలా చేస్తున్నాయని వారంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన అనేక సంక్షేమ పథకాలు, నవరత్నాలు పేద ప్రజలకు మేలు జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉండటం.. చేరికల పరంపరకు కారణమని స్థానిక ప్రజల్లో చర్చసాగుతోంది. మండలాల వారీగా టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కుటుంబాలు.. మండలం కుటుంబాలు (సుమారు) కారంచేడు 850 పర్చూరు 1050 మార్టూరు 1150 చినగంజాం 1230 ఇంకొల్లు 890 యద్దనపూడి 370 ఐదేళ్లుగా మా మాటకు విలువ లేదు 373 ఓట్ల మెజార్టీతో గెలిచాను. నా ప్రాంత ప్రజలకు కనీస అసవరాలు తీర్చడంలో విఫలమయ్యాను. అధికారంలో ఉండీ కూడా ఏ ఒక్క పనీ చేయించుకోలేకపోయాను. మండల సర్వసభ్య సమావేశంలో కూడా నేను నా గొంతు వినిపించుకొనే యోగ్యం లేదు. ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయాను. టీడీపీలో ఉండి లాభం లేదనుకున్నాను. టీడీపీని వదిలి వైసీపీలో చేరాను. – యార్లగడ్డ రజనీ, కారంచేడు–1 ఎంపీటీసీ సభ్యురాలు గ్రామానికి కనీసం రోడ్డు వేయించుకోలేకపోయాం ఇడుపులపాడు–కోనంకి రోడ్డును ఆర్ అండ్ బీ కింద మార్చాలని ఎమ్మెల్యేను అనేక మార్లు కోరాం. అయినా ఆయన పట్టించుకోలేదు. గ్రామాభివృద్ధికి ఎలాంటి పని చేయించుకోలేక పోయాం. పార్టీలో సముచిత న్యాయం జరగనప్పుడు అక్కడ ఉండి ఏమి ప్రయోజనం. అందుకే టీడీపీని వదిలి వైఎస్సార్ సీపీలో ఉన్న నాయకులపై నమ్మకంతో చేరాం. – పెంట్యాల సత్యన్నారాయణ, ఎంపీటీసీ సభ్యుడు, ద్రోణాదుల, మార్టూరు మండలం దగ్గుబాటిపై నమ్మకంతోనే వైఎస్సార్ సీపీలో చేరాం టీడీపీని అంటిపెట్టుకొని ఉన్నాం. పార్టీ కోసం పనిచేసాం. పార్టీ మాకేమీ ఇవ్వలేదు, అవమానాలు తప్ప. గ్రామానికి చెందిన డాక్టర్ మాకు అండగా ఉంటామన్నారు. ఆయనకు తెలుసు ఈ ప్రాంత ప్రజలకు ఏమి కావాలో. ఆయన నాయకత్వంలో మాకు మేలు జరగుతుందనే నమ్మకం మాకుంది. పార్టీ అధినాయకత్వం పైనా మాకు నమ్మకం ఉంది. అందుకే టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరాం. – యార్లగడ్డ శ్రీనివాసరావు, కారంచేడు -
పర్చూరులో వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు
-
పరుచూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి దగ్గుబాటి ప్రచారం
-
సమరానికి సై
సాక్షి, పర్చూరు (ప్రకాశం): ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి 2019 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఈసారి పర్చూరు అసెంబ్లీ బరికి బహుముఖ పోటీ నెలకొననుంది. ఓటమి ఎరుగని రాజకీయ ఉద్దండుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రస్తుతం పోటీలో నిలిచి మరో మారు విజయకేతనం ఎగురవేయాలని ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ తరపున ఏలూరి సాంబశివరావు, బీజేపీ తరపున చెరుకూరి రామయోగేశ్వరరావు, కాంగ్రెస్ తరపున పొన్నగంటి జానకీరామయ్య, జనసేన కూటమి తరపున బీఎస్పీ అభ్యర్థి పెదపూడి విజయ్‌కుమార్ పోటీ చేయనున్నట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. పలువురు స్వతంత్ర అభ్యర్థులు సైతం ఇప్పటికే తమ నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి: దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుట్టినతేదీ: 14–12–1953 విద్యార్హత: ఎం.బి.బి.ఎస్, పీజీ తల్లిదండ్రులు: రమాదేవి, చెంచురామయ్య సామాజిక వర్గం: ఓసీ కుటుంబం: భార్య పురందేశ్వరి కుమార్తె: నివేధిత కుమారుడు: హితేష్‌చెంచురామ్ స్వగ్రామం: కారంచేడు గ్రామం, కారంచేడు మండలం, ప్రకాశం జిల్లా టీడీపీ అభ్యర్థి: ఏలూరి సాంబశివరావు పుట్టినతేదీ: 26–01–1977 విద్యార్హత: ఎమ్మెస్సీ (హర్టీకల్చర్) తల్లిదండ్రులు: ఏలూరి నాగేశ్వరరావు, సుశీలమ్మ సామాజిక వర్గం: ఓసీ కుటుంబం: భార్య మాలతి కుమారులు: దివేశ్, మైనాంక్ తారక్ స్వస్థలం: కోనంకి గ్రామం, మార్టూరు మండలం బీజేపీ అభ్యర్థి: చెరుకూరి రామయోగేశ్వరరావు పుట్టినతేదీ: 30–07–1966 విద్యార్హత: 10వ తరగతి తల్లిదండ్రులు: వెంకట సుబ్బయ్య, అన్నపూర్ణమ్మ సామాజిక వర్గం: ఓసీ కుటుంబం: భార్య: రమాదేవి కుమారులు: వెంకటకృష్ణ, పవన్‌కుమార్ స్వస్థలం: గన్నవరం గ్రామం, యద్దనపూడి మండలం కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి: పొన్నగంటి జానకీరామారావు వయస్సు: 49 సం.లు విద్యార్హత: 7వ తరగతి తల్లిదండ్రులు: వెంకటేశ్వర్లు, శివనాగమల్లేశ్వరి సామాజిక వర్గం: ఓసీ కుటుంబం : భార్య: నాగరాజకుమారి కుమారులు: రామోజీరావు, లక్ష్మీనరేంద్రబాబు, తివిక్రమార్కుడు స్వస్థలం: ఇంకొల్లు గ్రామం, మండలం బీఎస్పీ అభ్యర్థి: పెదపూడి విజయ్‌కుమార్ పుట్టినతేదీ: 10–07–1989 విద్యార్హత: ఎం.ఏ., ఎం.ఫీల్ (పీహెచ్డీ) తల్లిదండ్రులు: పూర్ణ్ణచంద్రరావు, అక్కాయమ్మ సామాజిక వర్గం: ఎస్సీ కుటుంబం : భార్య: అనురాధాలక్ష్మీ కుమార్తె: సుజితావిజయ్ స్వస్థలం: ముప్పాళ్ల గ్రామం, నాగులుప్పలపాడు మండలం 25 న నామినేషన్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి చెరుకూరి రామయోగేశ్వరరావు, బీఎస్పీ తరపున పెదపూడి విజయ్‌కుమార్ కూడా ఈనెల 25వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు ఆయా పార్టీల అభ్యర్థులు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తరపున హరిబాబు, శ్రీకాంత్‌లు ఆర్ఓ సుధాకర్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పి. జానకీరామారావు కూడా నామినేషన్ వేశారు. -
చింతలపాలెంపై ఎమ్మెల్యే శీతకన్ను!
సాక్షి, చింతలపాలెం (ప్రకాశం): పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత చింతలపాలెం గ్రామానికి వర్తిస్తుంది. ఓట్ల పండగ వచ్చినప్పుడు మినహా మిగతా సమయంలో ప్రజాప్రతినిధులకు ఈ గ్రామం గుర్తుకు రాదు. సమస్యలతో నేడు ఆ గ్రామస్తులు సహవాసం చేస్తున్నారు. ఇంకొల్లు, పావులూరు రెండు గ్రామ పంచాయతీల పరిధిలో ఈ గ్రామం ఉంది. దీంతో సమస్యలను పరిష్కరించటంలో రెండు పంచాయతీలు శ్రద్ధ చూపటం లేదు. దీంతో గ్రామంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. గ్రామంలో రోడ్లు ప్రధాన సమస్యగా మారింది. రోడ్డు నిర్మాణం సగంలో ఆగిపోయింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి వెళ్లాలంటే ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా లేకుండా పోయింది. కనీసం విద్యార్థులు బడికి వెళ్లాలంటే మూడు కిలో మీటర్లు సైకిల్‌పై వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, ఒక అంగన్వాడీ కేంద్రం ఉన్నాయి. గ్రామం మొత్తం పశుపోషణపై ఆధార పడి జీవిస్తున్నారు. కనీసం పశువులకు ఏదైనా బాగోలేక పోతే ఇంకొల్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రక్షిత మంచి నీటి పథకం మూలన పడిపోయింది. గ్రామంలో పెద్ద చెరువు ఉన్నప్పటికీ రక్షిత నీరు గ్రామస్తులకు అందించిన పాపాన పోలేదు. కనీసం రేషన్ దుకాణానికి వెళ్లాలంటే ఇంకొల్లుకు వెళ్లి వేలిముద్ర వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో ఓటు వేయాలంటే ఇంకొల్లులోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామంలో రెండు సిమెంటు రోడ్లు వేశారు. కాలువలు ఏర్పాటు చేయలేదు. లింకు రోడ్లు ధ్వంసమయ్యాయి. డ్రైనేజి సమస్య తీవ్రంగా ఉండటంతో దోమలు కాటేస్తున్నాయి. గ్రామంలో రెండు తాగునీటి బావులు ఉన్నాయి. బావుల్లో ఫ్లోరిన్ శాతం అధికంగా ఉంటుందని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. గ్రామం చింతలపాలెం జనాభా 150 కుటుంబాలు 35 ఓటర్లు 130 ప్రాథమిక పాఠశాల 1 అంగన్వాడీ సెంటర్ 1 రేషన్ దుకాణాలు లేవు చెరువు విస్తీర్ణం 25 ఎకరాలు వ్యవసాయం చెరువు ఆయకట్టు - 400 ఎకరాలు ఎన్నికలప్పుడే ఓటర్లు గుర్తుకు వస్తారు గ్రామంలో ఎన్నికలప్పుడే ఓటర్లు గుర్తుకు వస్తున్నారు. చిన్న గ్రామంలో ఓటర్ల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామానికి రోడ్డు ప్రధాన సమస్యగా ఉంది. పశుపోషణపై గ్రామంలో ఆధారపడి జీవిస్తున్నారు. బయటకు వెళ్లి బతకాలంటే జరగని పరిస్థితి కాదు. – పులికం రామకృష్ణారెడ్డి, యువకుడు గ్రామంలో సమస్యలు అలానే తిష్టవేసి ఉన్నాయి గ్రామంలో సమస్యలు అలానే ఉన్నాయి. చెరువులో మట్టి కావాల్సిన వారు అనుమతులు లేకుండా తోలు కుంటున్నారు. దీంతో రోడ్లు గుల్ల అవుతున్నాయి. రెండు గ్రామ పంచాయతీలకు ఈ గ్రామం కావటమే మేము చేసుకున్న పాపం. అభివృద్ధిపై దృష్టి పెట్టి గ్రామ సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. – మాదాసు సాంబశివరావు, గ్రామస్తుడు -
ఇద్దరు చిన్నారుల ఉసురు తీసిన ఈత సరదా
పర్చూరు : ఈత సరదా ఇద్దరు పిల్లల ఉసురు తీసింది. ఈ సంఘటన పెద్దివారిపాలెంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన ఐదో తరగతి చదువుతున్న రావి మణిదీప్ (11), ఎనిమిదో తరగతి చదువుతున్న కొల్లా జయదీప్ (14)లు కుంటలో పడి మృతి చెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మణిదీప్, జయదీప్‌లు మరో ముగ్గురు పిల్లలతో కలిసి పెద్దివారిపాలెం శివారులోని నీటి కుంటకు ఈత కొట్టేందుకు వెళ్లారు. తొలుత మణిదీప్ నీటిలో దిగాడు. ఈత రాక మునిగిపోతుండటంతో రక్షించేందుకు జయదీప్ ప్రయత్నించాడు. ఇద్దరూ నీటిలో మునిగిపోతూ కేకలు వేస్తుండటంతో మిగిలిన పిల్లలు భయపడి కేకలు వేసుకుంటూ గ్రామంలోకి వెళ్లి పెద్దలకు చెప్పారు. గ్రామస్తులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని కుంటలో పడి ఉన్న ఇద్దరినీ బయటకు తీసి వెంటనే పర్చూరు సీహెచ్‌సీకి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మణిదీప్, జయదీప్‌లు మృతి చెందినట్లు నిర్ధారించారు. పిల్లల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. వీఆర్వో మణిక్యం పంచనామా నివేదికను తహసీల్దార్‌కు సమర్పించారు. -
మాన్యం భూముల కౌలు వేలంలో ఘర్షణ
పర్చూరు: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అడుసుమిల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక గౌరీశంకర్ దేవస్థానానికి చెందిన (మాన్యం) భూముల కౌలుకు సంబంధించి వేలం వేసేందుకు దేవాదాయ శాఖాధికారులు గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పాత కౌలుకు సంబంధించి లెక్కలు తేల్చిన తర్వాతే వేలం నిర్వహించాలంటూ రైతులు పట్టుబట్టారు. దీంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. -
ఆగని అన్నదాత మృత్యుఘోష
జిల్లాలో అన్నదాత ఆక్రందన ఆగడం లేదు. ప్రకృతి ప్రకోపంతో కొందరు, పాలకుల వైఖరితో మరికొందరు, బ్యాంకుల నోటీసుల అవమానాలతో ఇంకొందరు మనస్తాపానికి గురై నేలకొరుగుతున్నారు. బతకడానికి దారులు మూసుకుపోవడంతో చావులో ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో ఐదుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరో విషాదం: గిద్దలూరు మండలం బురుజుపల్లె గ్రామానికి చెందిన యరముల వెంకటరెడ్డి (50) పురుగుమందుకు బలైపోయాడు. వెంకటరెడ్డి తనకున్న పదమూడెకరాల పొలంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటల్ని సాగు చేశారు. బోర్లను నమ్ముకుని వ్యవసాయం చేశాడు. ప్రకృతి కరుణించడంతో ఇల్లు కూడా కట్టుకున్నాడు. పొలంలో వేసిన బోర్లలో నీరు తగ్గిపోవడం, పంటలు ఎండిపోతుండటం, మరోవైపు అప్పులు 30 లక్షలు దాటిపోవడంతో పొలానికి పిచికారీ చేసే పురుగుమందు తీసుకుని చనిపోయాడు. జనవరి17న: యద్దనపూడి గ్రామానికి చెందిన రైతు గొట్టిపాటి ఆదియ్య పురుగుమందు తాగి చనిపోయాడు. రైతు కాస్తా కౌలు రైతుగా మారిన ఆదియ్య వ్యవసాయంపై మక్కువ తీరక, వేరే ఉపాధి లేక ఆరెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తూ వచ్చాడు, గత ఏడాది శనగ సాగు చేసి గిట్టుబాటు ధర లేకపోవడంతో తక్కువ రేటుకు అమ్ముకుని నష్టపోయాడు. ఈ ఏడాది మళ్లీ పత్తి సాగు చేశాడు. దీని కోసం కుమార్టె బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు. ఈ ఏడాది పత్తి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, దిగుబడులు కూడా తగ్గడంతో ఆందోళనతో ఉన్న ఆదియ్య, రుణం చెల్లించాలని బ్యాంకు నోటీసులు రావడంతో పురుగుమందును ఆశ్రయించాడు. సెప్టెంబరు 23న: పర్చూరు నియోజకవర్గం మార్టూరు మండలం కోలలపూడి గ్రామానికి చెందిన దాసరి లక్ష్మీనారాయణ గత ఏడాది సెప్టెంబర్ 23న పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తనకు ఉన్న కొద్దిపాటి భూమితోపాటు కౌలు సాగు చేస్తుంటాడు. ఇతనికి సొంతపొలం ఎకరం 38 సెంట్లుండగా, నాలుగెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. తన సొంత భూమిలో రూ.20 పెట్టుబడితో గోరుచిక్కుడు సాగు చేయగా తెగుళ్లు సోకి పంట చేతికి రాలేదు. నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నా వర్షాలు లేకపోవడంతో ఎకరంన్నరలోనే వరి వేశాడు. కౌలు పొలంలో ఎకరంన్నర సాగు చేసిన వరి నీరు సకాలంలో అందక ఎండుముఖం పట్టింది. అప్పటికే 25 వేలు ఖర్చు చే శాడు. మిగిలిన రెండున్నర ఎకరాలలో వర్షాలు సక్రమంగా సాగు చేయలేదు. దీంతో గతంలో ఉన్న అప్పులతోపాటు సాగు సక్రమంగా లేక రైతు ఆత్యహత్య చేసుకున్నాడు. నవంబరు 28న: యద్దనపూడి మండలంలోని చిమటవారిపాలెం గ్రామానికి చెందిన రైతు గనిపిశెట్టి వెంకట్రావు(52) గత ఏడాది నవంబర్ నెల 28న పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. రుణమాఫీ అవుతుందో లేదో తెలియక బ్యాంకులో పాసు పుస్తకాలుపై తీసుకున్న అప్పు బ్యాంకులు నోటీసులివ్వడంతో ఒన్‌టైమ్ సైటిల్ మెంట్‌కు దరఖాస్తు చేశాడు. మొత్తం లక్షా 80 వేల వరకూ బకాయి ఉండగా 96 వేల రూపాయలు వన్‌టైమ్ సెటిల్మెంట్ చేసుకున్నాడు. అప్పు తెచ్చి రూ.95 వేలు బ్యాంకులో జమచేశాడు. డబ్బులు కట్టిన తర్వాత కూడా పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు తిప్పకున్నారు. పట్టాదారు పుస్తకాలు ఇవ్వాలని కోరినా బ్యాంకర్లు సకాలంలో ఇవ్వకపోవడంతో అవమానంగా భావించాడు. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటునట్లు లేఖరాసి ప్రాణాలు తీసుకున్నాడు. రుణమాఫీ కాకపోవడం, బ్యాంకు అధికారుల ఒత్తిడి ఫలితంగా పొన్నలూరు మండలం భోగనంపాడు గ్రామానికి చెందిన రైతు కరేటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందాడు. తన భార్య పేరుతో బంగారం తాకట్టు పెట్టి రెండు విడతలుగా రుణం తెచ్చుకున్నాడు. మొదటి విడత తెచ్చిన రుణం పూర్తిగా చెల్లించినా రెండో విడత రుణం కట్టమని బ్యాంకు అధికారులు నోటీసులు పంపించారు. డబ్బు చెల్లించకపోతే బంగారం వేలం వేస్తామని బ్యాంకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో మనస్థాపానికి గురై గుండెపోటుతో మరణించాడు. -
టీడీపీలోకి దగ్గుబాటికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు
ఒంగోలు : ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా పర్చూరులో ఫ్లెక్సీల రగడ నెలకొంది. సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరిగి టీడీపీలోకి రావాలంటూ వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. టీడీపీలోకి దగ్గుబాటికి తిరిగి స్వాగతం అంటూ ఆ ఫ్లెక్సీలు వెలిశాయి. కాగా అర్థరాత్రి దాటిన తర్వాత ఆ ఫెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. ఆ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారన్నది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. కాగా పర్చూరు నుంచి ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గొట్టిపాటి నరసయ్య కన్నుమూత
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి నరసయ్య (51) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న నరసయ్య ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. రేపు ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా యద్దనపూడిలో అంత్యక్రియలు జరుగుతాయి. నరసయ్య 1997 ఉపఎన్నికల్లో, 1999 ఎన్నికల్లో మార్టూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన తండ్రి గొట్టిపాటి హనుమంతరావు సీనియర్ రాజకీయవేత్తగా, మంత్రిగా పనిచేశారు. తండ్రి మరణానంతరం 97 ఉపఎన్నికల్లో నరసయ్య గెలుపొందారు. -
విషజ్వరాలకు ఇద్దరు చిన్నారుల బలి
పర్చూరు, న్యూస్‌లైన్ : విషజ్వరాల కారణంగా రెండు రోజుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. స్థానిక ఇందిరాకాలనీకి చెందిన ఆరు నెలల చిన్నారి కప్పిరి లాస్య, మూడేళ్ల బాలుడు రాపూరి గణేశ్‌లు విషజ్వరాల బారిన పడి మృతి చెందారు. లాస్యకు వారం రోజుల క్రితం జ్వరంతో పాటు శరీరంపై దద్దుర్లు రావడంతో స్థానిక ఆర్ఎంపీకి చూపించారు. అనంతరం చిలకలూరిపేట, గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించారు. పరిస్థితి విషమించడంతో గుంటూరు జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ 26వ తేదీ మధ్యాహ్నం మృతి చెందినట్లు మృతురాలి తల్లిదండ్రులు సీతారామస్వామి, శ్రావణి పేర్కొన్నారు. పాప మృతి చెందిన ఆవేదనలో వైద్య నివేదికలు అక్కడే పడేసి వచ్చినట్లు తెలిపారు. లాస్య విషజ్వరంతో మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. అదే కాలనీకి చెందిన కావూరి గణే శ్ అనే మూడేళ్ల బాలుడు కూడా సోమవారం రాత్రి మృతి చెందాడు. వారం రోజులుగా గణేశ్ జ్వరంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు బాపట్ల ప్రభుత్వాస్పత్రిలో చూపించారు. ప్రయోజనం లేకపోవడంతో చీరాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు గుంటూరు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి బాలుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పేదరికంలో ఉన్నా * 50 వేలకు పైగా ఖర్చు చేశామని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విషజ్వరంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. -
‘నీలం’పై నీలినీడలు
పర్చూరు,న్యూస్‌లైన్: జిల్లా రైతాంగాన్ని నీలం తుపాను అతలాకుతలం చేసి రెండేళ్లయింది. నాటి విలయంలో వేలాది హెక్టార్లు నీట మునిగి రైతులు గుండెలవిసేలా రోదించారు. ఆ తర్వాత రెండు సార్లు అల్పపీడన ప్రభావంతో వరదలు.. తాజాగా పై-లీన్ కూడా బీభత్సం చేసింది. అయితే ప్రభుత్వానికి.. నీలం తుపాను నష్టపరిహారం పంపిణీ చేసేందుకు ఇప్పటికి గానీ తీరిక దొరకలేదు. పోనీ అదైనా సక్రమంగా పంపిణీ చేస్తున్నారా అంటే అదీ లేదు. కచ్చితంగా బ్యాంకు అకౌంట్లుండాలనే నిబంధనతో వందలాదిమంది రైతులు అయోమయంలో పడ్డారు. అకౌంట్ లేకుంటే పరిహారం అందదని అధికారులు తేల్చి చెప్పడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాకు *11 కోట్ల పరిహారం అందాల్సి ఉండగా కేవలం *6 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. 20 శాతం మంది ఇలా.. జిల్లాలో మొత్తం 11456 మంది రైతులకు నీలం తుపాను నష్ట పరిహారం అందజేయాల్సి ఉంది. అయితే 20 శాతానికిపైగా రైతుల బ్యాంకు అకౌంటు ఖాతాలు.. జాబితాలోకి రాలేదు. అవగాహనలేక కొంతమంది.. ఇతర జిల్లాల అకౌంట్లు ఇచ్చినవారు మరికొంతమంది..వినియోగంలో లేని ఖాతాలు కొన్ని.. ఇలా దాదాపు 1500 మంది రైతులు పరిహారానికి అర్హత పొందలేకపోతున్నారు. బ్యాంకు ఖాతాలు లేకపోతే చెక్కుల రూపంలోనైనా పరిహారం అందించే ఏర్పాట్లు న్నా.. సర్కారు ఈ విషయాన్ని మరచిపోయిట్లుందో.. లేక నటిస్తుందో అర్థం కావడంలేదు. గతంలో ఈ రకంగా నష్టపరిహారం అందజేసిన చరిత్ర ఉన్నా.. అధికారులు ఎందుకు ఆ దిశగా ఆలోచించడంలేదని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నష్టపోయిన రైతాంగంలో కౌలుదారులు కూడా ఉన్నారు. వీరికి కూడా శఠగోపం పెట్టేందుకే ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇంటి పేరుతో తిప్పలు ఇదిలా ఉంటే కొంతమంది మహిళా రైతులు బ్యాంకు ఖాతాలు అందజేసినా పరిహారం అందించేందుకు బ్యాంకర్లు కొర్రీలు వేస్తున్నారు. దీనికి ఇంటిపేరు సాకుగా చూపిస్తున్నారు. సాధారణంగా మహిళల పెళ్లికి ముందు ఇంటి పేరు వేరుగా ఉంటుంది. పెళ్లైన తర్వాత భర్త ఇంటిపేరును తమ పేరుముందు చేర్చుతారు. అయితే ధ్రువీకరణ పత్రాలు పరిశీలించేటప్పుడు ఇంటి పేరు ఒకలా.. బ్యాంకు అకౌంటులో మరోలా ఉండడంపై బ్యాంకు అధికారులు పేచీలు పెడుతున్నారు. దీనిపై ఎలాంటి అడ్డంకులు విధించకూడదంటూ ప్రభుత్వం ఆదేశిస్తున్నా పెడచెవిన పెట్టడం సాధారణంగా మారింది. ఇప్పటికైనా ఖాతాలు తెరవాలి: ఎస్.దొరసాని: జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు బ్యాంకు ఖాతాలు తెరవకుంటే నీలం పరిహారం అందించలేం. గతంలోనే రైతుల పాస్‌పుస్తకాల నంబర్లు సేకరించాం. ఇప్పుడు ఆ ఖాతాల్లోనే పరిహారం వేస్తాం. డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించినా బ్యాంకు ఖాతాలు తెరవలేదు. తాజా వర్షాల వల్ల పంటనష్టపోయిన రైతులందరూ తప్పని సరిగా బ్యాంక్ పాసు పుస్తకం జెరాక్స్, ఆధార్ జెరాక్స్, పట్టాదారు పాస్‌పుస్తం జెరాక్స్ కాపీలను వీఆర్వోలకు వెంటనే అందజేయాలి. బ్యాంక్‌ఖాతా జిల్లా పరిధిలో ఉండడంతో పాటు వినియోగంలో ఉండాలి. -
పింఛన్లేవీ..
పర్చూరు, న్యూస్‌లైన్: పింఛన్ల పంపిణీలో యంత్రాంగం అలసత్వాన్ని వీడటం లేదు. జిల్లాలో ఆగస్టు నెలలో పంపిణీ చేయాల్సిన పింఛన్లు నేటికీ ఇవ్వలేదు. జూలై వరకు ఫినోకంపెనీ తరఫున గ్రామాల్లో సీఎస్పీల ద్వారా పింఛను సొమ్ము పంపిణీ చేశారు. సంబంధిత శాఖల సిబ్బందితో వారు కుమ్మక్కై చేతివాటం ప్రదర్శిస్తుండటంతో ఈ ప్రక్రియను నిలిపేశారు. దీంతో ఆగస్టు నెలలో పింఛను సొమ్మును పంచాయతీ కార్యదర్శుల ద్వారా పంపిణీ చేసేందుకు జిల్లా డీఆర్డీఏ అధికారులు ఎంపీడీఓల ఖాతాలకు నగదు జమ చేశారు. పంపిణీ ప్రారంభించక ముందే పాతపద్ధతిలో పోస్టాఫీసుల ద్వారా నగదు పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎంపీడీఓలు తమ ఖాతాలో ఉన్న సొమ్మును డీఆర్డీఏ ఖాతాకు బదలాయించారు. కానీ నేటికీ ఆగస్టు నెల పింఛన్ల పంపిణీకి జిల్లా డీఆర్డీఏ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో జిల్లాలో పింఛను కోసం 2,84,620 మంది ఎదురుచూస్తున్నారు. వీరిలో వృద్ధాప్య పింఛను అందుకునేవారు 1,61,139 మంది, చేనేత పింఛన్లు 6646 మంది, వికలాంగ పింఛన్లు 28,930 మంది, వితంతు పింఛన్లు 70,120 మంది, అభయహస్తం పింఛన్లు అందుకునేవారు 17,450 మంది ఉన్నారు. పింఛను సొమ్ము కోసం ఎంపీడీఓ కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు, పోస్టాఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఎప్పుడిస్తారనేది స్థానిక అధికారులకు కూడా తెలియని పరిస్థితి. దీంతో పింఛనుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని వెంటనే పింఛన్లు అందజేయాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. సమ్మె కారణంగానే ఆలస్యం డీఆర్డీఏ ఏపీడీ: తేళ్ల రవికుమార్ ఆగస్టు నెలలో పింఛన్ల పంపిణీ కోసం సొమ్మును ఎంపీడీఓల ఖాతాలో జమచేశాం. ఎంపీడీఓలు సమ్మెలో ఉన్న కారణంగా పంపిణీ ఆలస్యమైంది. దీంతో వారి ఖాతాలోని సొమ్మును తిరిగి జిల్లా డీఆర్డీఏ ఖాతాకు జమచేశారు. ఈ ప్రక్రియ వల్ల పంపిణీ ఆలస్యమైంది. వెంటనే నగదు అందించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.