చిక్కు తీస్తున్నామా? వేస్తున్నామా?
ఆధ్యాత్మిక ప్రేమను, విశ్వజనీన ప్రేమను, ఇంకా మనకు అర్థంకాని ఎన్నో అలౌకిక ప్రేమలను అంగీకరిస్తున్నాం. కాని, అమ్మాయి, అబ్బాయి ప్రేమ అనేటప్పటికి ఉలిక్కిపడి, దేవుడి పటం పక్కనే గోడకు తగిలించి ఉంచిన కొరడాను చేతికి అందుకుంటున్నాం. ఎందుకు?
ఒకప్పుడు మనమూ ప్రేమలో పడినవాళ్లమే. పెద్దవాళ్లం అయ్యాక మన జీవితంలోకి పిల్లలు వచ్చి, పేరెంట్ మీటింగులు వచ్చి, ఎల్లయిసీ ఏజెంట్లు వచ్చి, ఈఎమ్మయి నోటీసులు వచ్చి ప్రేమకు చోటు లేకుండాపోయింది. పోతే పోయింది, మన పిల్లలు ఎక్కడ ప్రేమ మలినాన్ని అంటించుకుని వస్తారోనని రోజూ ఎందుకింత బిక్క చచ్చిపోతున్నాం? ప్రేమలో పడిన ఇరుగింటి, పొరుగింటి పిల్లలకు మన పిల్లల్ని ఎందుకు దూరంగా ఉంచుతున్నాం?
అసలు ప్రేమ లేని సంస్కృతి ప్రపంచంలో ఉంటుందా? ఇవన్నీ నిలబడే తర్కాలు కాదు. ప్రేమలు... పిల్లల్ని, వాళ్ల చదువుల్ని, జీవితాల్ని పాడుచేస్తాయన్న నమ్మకమొక్కటే చివరికి నిలబడుతుంది. ఆ నమ్మకం మేరకే మనం నడుస్తున్నాం, మన పిల్లల్ని నడిపిస్తున్నాం. అయితే మనం ఒక్కరమే మన పిల్లల్ని నడిపిస్తున్నామా? లేదు. ఇంకా చాలామందే నడిపిస్తున్నారు.
ఎవరినీ ప్రేమించకుండా ఎవరూ ఉండలేరన్నది ఓషో ఫిలాసఫీ. ప్రేమను ఇవ్వడంగానీ పొందడంగానీ మనసుకు కూడా తెలియకుండా జరిగిపోతుందట! అమ్మాయి అబ్బాయి మధ్య మొదలయ్యే ప్రాథమికస్థాయి ప్రేమను, గౌతమ బుద్ధుడు పంచిన విశ్వ జనీన ప్రేమను ఆయన సమంగా గౌరవించారు. పరిణామక్రమంలో... దిగువన ఉన్న ప్రేమే ఎగువకు ఎదుగుతుంది కనుక ఏ స్థాయి ప్రేమకు ఆ స్థాయిలో ప్రాముఖ్యం ఇచ్చి తీరాలని ఆచార్య రజనీష్ అన్నారు.
పిల్లల ప్రేమకు విలువ ఇవ్వొద్దు. సరే, ఆ వయసులో కొత్తగా కలిగే భావాలు మనకు తెలియనివా? అందుకు పిల్లల్నెందుకు తప్పు పట్టడం? ప్రేమను ఎందుకు తప్పు పట్టడం? పసి గుండెల్లో దాచుకున్న తియ్యటి ప్రేమకు, స్నేహంగా చెయ్యి చాస్తే మనకూ కొంత ప్రేమ దక్కుతుంది కదా! మంచి ఫ్రెండ్స్ అయిపోతామేమో కూడా! అప్పుడు ఫ్రెండ్గా, ప్రేమగా మనమేం చెప్పినా వింటారు. ఎందుకంటే వారిలో వికసించే ప్రేమ భావాలు స్వచ్ఛమైనవి. మార్కెట్ల వల్ల, మాయమాటల్ల వల్ల అవి కలుషితం కాకుండా జాగ్రత్తపడాల్సిందే. అయితే చిక్కు తీయబోయి, చిక్కు వేస్తున్నామేమో మనం గమనించుకోవాలి.