కొడుక్కి నీళ్లిచ్చి.. ప్రాణాలొదిలిన అమ్మ, నాన్న
వాళ్లంతా ఎడారిలో చిక్కుకుపోయారు. విపరీతమైన దాహం.. వాళ్ల దగ్గర నీళ్ల బాటిళ్లు కొద్దిగానే ఉన్నాయి. భార్య, భర్త, కొడుకు.. ముగ్గురూ ఉన్నారు. దాంతో, ఆ తల్లిదండ్రులు తమ కొడుకు కోసం త్యాగం చేశారు. తమ దాహాన్ని పక్కన పెట్టి.. కన్న కొడుకుకు నీళ్లిచ్చి.. అతడి ప్రాణాన్ని నిలబెట్టారు. చివరకు తాము ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదఘటన న్యూ మెక్సికో ప్రాంతంలో జరిగింది. వాళ్ల మృతదేహాలను స్వస్థలమైన ఫ్రాన్సుకు తరలించారు.
ఎంజో అనే తొమ్మిదేళ్ల ఆ పిల్లాడు ప్యారిస్‌లోని చార్లెస్ డిగాల్ విమానాశ్రయంలో తన నాయనమ్మతో కలిసి దిగాడు. న్యూమెక్సికో ప్రాంతంలో పర్యటించేందుకు వెళ్లిన ఆ కుటుంబంలో తండ్రి శవం దగ్గర ఒళ్లు బాగా డీహైడ్రేట్ అయిపోయిన స్థితిలో ఎంజో కనిపించాడు. అయితే అతడిలో కొంతమేర స్పందనలు కనిపించడంతో అధికారులు వెంటనే అక్కడినుంచి ఆస్పత్రికి తరలించారు. ఆ దేహాలకు సమీపంలో అరలీటరు చొప్పున ఉన్న వాటర్ బాటిళ్లు పడి ఉన్నాయి. తల్లిదండ్రులిద్దరూ ఒక బాటిల్ నీళ్లు తాగితే.. కొడుక్కు మాత్రం రెండు బాటిళ్లు ఇచ్చేవారని తెలిసింది. చిన్నవాడు కావడంతో ఆ కొద్దిపాటి నీళ్లు అతడికి సరిపోయాయని, కానీ వాళ్లిద్దరూ దాహార్తి తట్టుకోలేక మరణించారని అధికారులు చెప్పారు.