బోయ్ఫ్రెండ్లు ఉన్నారని.. కూతుళ్లను కాలువలో తోసేశారు
తమ కూతుళ్లకు బోయ్ఫ్రెండ్లు ఉన్నారన్న కోపంతో పంజాబ్లోని లూథియానాకు చెందిన ఓ ఆటో డ్రైవర్, అతడి భార్య కలిసి కూతుళ్లకు డ్రగ్స్ ఇచ్చి, ఆ తర్వాత వాళ్లను కాలువలోకి తోసేశారు. ఇద్దరు కూతుళ్లలో 15 ఏళ్ల వయసున్న జ్యోతి మరణించగా, ఆమె సోదరి ప్రీతి మాత్రం ఎలాగోలా ప్రాణాలు దక్కించుకుంది. ఆటోడ్రైవర్ ఉదయ్ చంద్, అతడి భార్య లక్ష్మిలపై హత్య, హత్యాయత్నం కేసు నమోదుచేసిన పోలీసులు, ప్రస్తుతం ఇద్దరూ పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు.
అమ్మాయిలిద్దరూ పదో తరగతి చదువుతున్నారని, వాళ్లు మొన్న ఒకరోజు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారని, దాంతో వాళ్లకు బోయ్ఫ్రెండ్లు ఉన్నారని తల్లిదండ్రులు అనుమానించినట్లు ఎస్ఐ దేవీందర్ శర్మ తెలిపారు. వాళ్లను ఏమీ అడగకుండానే వాళ్ల ఆహారంలో డ్రగ్స్ కలిపారని, అమ్మాయిలిద్దరూ స్పృహ కోల్పోయాక వాళ్లను కాలువలో విసిరేశారని చెప్పారు. జ్యోతిని కాలువలోకి విసిరేసే ముందు దుపట్టాతో ఆమె పీక పిసికేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు.
ఒకరోజు తర్వాత ఇద్దరూ నీళ్లలో తేలుతూ కనిపించగా, లూథియానాలోని బరేవాల్ బ్రిడ్జి వద్ద అటువైపు వెళ్లేవాళ్లు చూసి వారిని బయటకు తీశారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే జ్యోతి మరణించింది. ప్రీతి పోలీసులకు ముందు అబద్ధాలు చెప్పింది. ఇద్దరం అనాథలమని, గుడివద్ద భిక్షాటన చేస్తామని, గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన ఆహారం తిని స్పృహ కోల్పోయామని తెలిపింది. అమ్మాయిలు భిక్షగత్తెల్లా అనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గట్టిగా అడిగితే అసలు విషయం మొత్తం వివరించింది.