ముంపు ముంచుకొస్తోంది!
ఈ ఫొటోలో కనిపిస్తున్నది కోల్‌కతా మహానగరం తాలూకూ రెండు మ్యాప్‌లు. రెంటికీ మధ్య తేడా ఏమిటో తెలుసా? నీలిరంగు ఎక్కువగా ఉన్నదేమో నగరం సగం సముద్రంలో మునిగిపోతే ఎలా ఉంటుందో చూపుతుంది. బూడిదరంగు ఎక్కువగా ఉన్నదేమో అక్కడక్కడా నీటమునిగితే ఏమవుతుందో చెబుతుంది. కోల్‌కతా నగరం సముద్రంలో మునిగిపోయేంత ప్రమాదం ఇప్పుడు ఏమొచ్చిందబ్బా అని అనుకోవద్దు. మనం ఇప్పటిలానే విచ్చలవిడిగా పెట్రోలు, డీజిల్ మండించేస్తూ... అడవులను కొట్టేస్తూ పోతే భూమి సగటు ఉష్ణోగ్రత పెరిగిపోతుందని వింటూనే ఉన్నాం కదా... దాని పర్యవసానం ఇలా ఉండబోతుందని అమెరికాలోని క్లైమెట్ సెంట్రల్ అనే స్వచ్ఛంద సంస్థ తన తాజా నివేదికలో హెచ్చరించింది.
భూతాపం నాలుగు డిగ్రీల వరకూ పెరిగితే సముద్రతీరాల్లో ఉన్న అనేకానేక మహా నగరాలు ముంపు బారిన పడక తప్పదని ఈ నివేదిక స్పష్టం చేసింది. అమెరికా న్యూయార్క్ మహానగరంతోపాటు దక్షిణ అమెరికాలోని రియో డి జెనీరో, యూరప్‌లోని లండన్, ఆసియాలోని ముంబై, కోల్‌కతా, షాంఘై, దక్షిణాఫ్రికాలోని డర్బన్, ఆస్ట్రేలియాలోని సిడ్నీలతోపాటు ఇతర నగరాల్లో దాదాపు 47 నుంచి 76 కోట్ల మందిని నిర్వాసితులను చేస్తుందని హెచ్చరించింది ఈ నివేదిక. ఈ నెల 30న ప్రారంభం కానున్న ప్యారిస్ వాతావరణ సదస్సు తరువాతైనా ప్రపంచదేశాలు ఒక్కతాటిపైకి వచ్చి కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తే... భూతాపోన్నతిని రెండు డిగ్రీలకు పరిమితం చేయగలిగితే ప్రమాద తీవ్రతను కొంతవరకూ తగ్గించవచ్చునని సూచించింది. ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీలకు పరిమితమైనా కనీసం 13 కోట్ల మంది నిర్వాసితులవుతారని అంచనా.