సంచలన రేప్ కేసులో నిందితుడి అరెస్టు
దేశమంతా విస్తుపోయేలా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని పార్క్స్ట్రీట్లో జరిగిన దారుణ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిని నాలుగేళ్ల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఖాదర్ ఖాన్ అనే ఈ నిందితుడు అరెస్టయ్యాడు. అతడితో పాటు అతడి అనుచరుడు అలీఖాన్‌ను కూడా కోల్‌కతా పోలీసుల ప్రత్యేక బృందం ఢిల్లీ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టుచేసింది. ఘజియాబాద్‌లోని ఒక అపార్టుమెంటులో దాక్కుని ఉండగా వారిని పట్టుకున్నట్లు బృందంలోని ఒక అధికారి తెలిపారు. వాళ్లిద్దరినీ ట్రాన్సిట్ రిమాండ్ మీద తీసుకొచ్చి శనివారం నాడు కోల్‌కతా కోర్టులో ప్రవేశపెడతామన్నారు.
ఇద్దరు పిల్లల తల్లి అయిన బాధితురాలిపై 2012 ఫిబ్రవరి 6వ తేదీన కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్ ప్రాంతంలో సామూహిక అత్యాచారం జరిగింది. ఆమెను ఇంటివద్ద దింపుతామన్న ఐదుగురు వ్యక్తులు కారులో ఎక్కించుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కాదర్ ఖాన్ నాలుగేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అతడిపై విశ్వసనీయ సమాచారం అందడంతో.. అతడి మొబైల్ సిగ్నళ్లను ట్రాక్ చేసి పట్టుకున్నారు. తొలుత అతడు ఢిల్లీ సమీపంలో ఉన్నట్లు సెల్ సిగ్నళ్ల ద్వారా తెలిసింది. కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్ సూచనల మేరకు ప్రత్యేక బృందం అతడి వెంట పడింది. కొన్నాళ్ల పాటు బంగ్లాదేశ్‌లో తలదాచుకున్న కాదర్.. తర్వాత నేపాల్ మీదుగా ఢిల్లీకి వచ్చాడు. అతడి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడటంతో అతడి ఆనుపానులు తెలిశాయి.