Parliament panel
-
ఐఐటీల్లో హిందీ, స్థానిక భాషల్లో బోధించండి
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ఉన్నత విద్యా సంస్థలుసహా టెక్నికల్, నాన్–టెక్నికల్ విద్యా సంస్థల్లో హిందీ, స్థానిక భాషల్లో బోధించాలని అధికార భాషా పార్లమెంట్ కమిటీ సిఫార్సు చేసింది. ఇంగ్లిష్ భాష వాడకాన్ని కాస్త తగ్గించి భారతీయ భాషలకు తగిన ప్రాధాన్యతను కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ కమిటీ సిఫార్సులు పంపింది. ఇంగ్లిష్‌ను ఐచ్ఛికంగా వాడాలని హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ తన 11వ నివేదికను ఇటీవలే రాష్ట్రపతికి సమర్పించింది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం అధికారిక లేదా ప్రాంతీయ భాషలనే వాడాలన్న సూచన మేరకు ఈ సిఫార్సులు చేసినట్లు కమిటీ ఉపాధ్యక్షుడు, బీజేడీ నేత భర్తృహరి మహతాబ్ చెప్పారు. ‘ఐక్యరాజ్యసమితి అధికారిక భాషల్లో హిందీని చేర్చాలి. ఏ–కేటగిరీ రాష్ట్రాల్లో హిందీకి ‘100 శాతం’ ప్రాధాన్యత ఇవ్వాలి. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాల యాలు, కేంద్రీయ విద్యాలయాల్లో హిందీలోనే బోధించాలి. వేరే రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో అక్కడి స్థానిక భాషల్లో బోధించాలి. వలస వాసనను వదిలించుకుంటూ విదేశీ భాష ఇంగ్లిష్‌ను కాస్త పక్కనబెట్టాలి’ అని కమిటీ సిఫార్సు చేసింది. ‘ హిందీ ఎక్కువగా మాట్లాడే ప్రాంతాల్లో ఉన్న బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ వర్సిటీ, జమియా మిలియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం వర్సిటీలలో పూర్తిగా హిందీలోనే బోధిస్తే మేలు. ఇక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీస్‌లు, మంత్రిత్వ శాఖల మధ్య లేఖలు, ఫ్యాక్స్‌లు ఈ–మెయిల్లలో హిందీ లేదా స్థానిక భాషలను వాడాలి. అధికారిక కార్యక్రమాల్లో, ప్రసంగాల్లో, ఆహ్వాన పత్రాల్లో సులభంగా ఉండే హిందీ/స్థానిక భాషలనే వాడాలి’ అని సూచించింది. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హరియాణా, హిమాచల్, రాజస్థాన్, ఢిల్లీ ఏ–కేటగిరీలో ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ బి–కేటగిరీలో ఉన్నాయి. మిగతావి సి –కేటగిరీలో ఉన్నాయి. -
ఆ తల్లులకు క్షమాపణలు చెప్పాల్సిందే : మానవహక్కుల ప్యానెల్
UK Owes Apology For Forced Adoptions: అధికారికంగా తల్లి బిడ్డలను వేరుచేసే దారుణానికి పాల్పడిన బ్రిటన్ ప్రభుత్వం సదరు బాధిత మహిళలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని మానవ హక్కుల ప్యానెల్ పేర్కొంది. ఈ మేరకు బ్రిటన్ అధికారికంగా పెళ్లికానీ తల్లుల నుంచి తమ పిల్లలను బలవంతంగా దత్తత ఇచ్చేలా చేసినందుకు గానూ వారికి క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది. 1949, 1976 మధ్యకాలంలో ఇంగ్లండ్, వేల్స్ నుంచి దాదాపు లక్ష మందికి పైగా పిల్లలు బలవంతంగా దత్తతకు వెళ్లారని మానవ హక్కులకు సంబంధించిన పార్లమెంట్ సంయుక్త కమిటీ నివేదికలో పేర్కొంది. అత్యంత దారుణంగా తల్లి బిడ్డలను వేరు చేసే పాశవిక చర్యకు బ్రిటన్ ప్రభుత్వం పాల్పడిందని కమిటీ అధ్యక్షురాలు లేబర్ ఎంపీ హ్యారియోట్ హర్మాన్ అన్నారు. అంతేకాదు ఆ తల్లుల చేసిన ఏకైక నేరం పెళ్లి కాకుండా గర్భవతి కావడమేనని చెప్పారు. ఇది బ్రిటన్ చేసిన ఘోరమైన తప్పుగా కమిటీ పరిగణించింది. స్వయంగా ప్రభుత్వమే ఆ తల్లుల పట్ల అనుచితంగా ప్రవర్తించిందన్నారు. ఇప్పుడైనా వారికి న్యాయం జరగాలని, వారు గౌరవింపబడేలా చేసేందుకైన బ్రిటన్ క్షమాపణలు చెప్పాలని అన్నారు. గతంలో ఆస్ట్రేలియ ప్రభుత్వం, ఐర్లాండ్ ఇలానే చేశాయని, అందుకు క్షమాపణలు కూడా చెప్పాయని తెలిపారు. 1963లో ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్లలో అబార్షన్ని చట్టబద్దం చేసినప్పటికీ మహిళలు ఈ సమస్యలను ఎదుర్కోవల్సి వచ్చిందన్నారు. పెళ్లికాకుండా తల్లికావడాన్ని ఘోరంగా చూడటం వల్లే ఈ పరిస్థితి వాటిల్లందని అన్నారు. ఐతే పార్లమెంట్ సంయుక్త కమిటీ నివేదిక బాధిత వ్యక్తుల కోసం ప్రత్యేక కౌన్సెలింగ్‌ను అందించడమే కాకుండా మరియు తల్లి లేదా బిడ్డను కనుగొనడానికి ప్రయత్నిస్తున్న వారికి ప్రభుత్వం సాయం చేయాలని కోరింది. ఈ క్రమంలో ఒక బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి స్పందిస్తూ...ఈ చారిత్రత్మక తప్పిదం వల్ల ప్రభావితమైన వారందరికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. గతాన్ని మార్చలేకపోయినప్పటికీ ఈ ఘటనలు పునరావృతం కాకుండా బలోపేతమైన చట్టాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం. సదరు బాధిత మహిళలకు మెరుగైన సంరక్షణను అందస్తామని చెప్పారు. (చదవండి: ఈయూ ఆంక్షాల మోత...టెన్షన్లో రష్యా!) -
‘ఎంపీలు ఢిల్లీ కాలుష్యాన్ని పెద్దగా పట్టించుకోరు’
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నవంబర్ 15న జరిగిన పార్లమెంట్ ప్యానెల్ సమావేశానికి పలువురు ఎంపీలు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. ఆ లిస్టులో నటి హేమమాలిని కూడా ఉన్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు హేమమాలిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో నివసించని ఎంపీలే సమావేశానికి హాజరు కాలేదన్నారు. ఎందుకంటే ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో నివసించేవారికి వాయు కాలుష్య నివారణపై శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. కానీ కాలుష్య తీవ్రత తక్కువగా ఉండే ముంబై వంటి నగరాల్లో నివసించేవారికి ఢిల్లీ కాలుష్యం గురించి పెద్దగా ఆసక్తి ఉండదన్నారు. అందుకే వారు సమావేశానికి హాజరు కాలేదని పేర్కొన్నారు. బాధ్యత గల ఎంపీగా ఉండి ఢిల్లీ కాలుష్య నియంత్రణ సమావేశానికి గైర్హాజరవడమే కాక పట్టింపు లేనట్లుగా మాట్లాడటంపై ఢిల్లీవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే సమావేశానికి గైర్హాజరైన తూర్పు ఢిల్లీ ఎంపీ, క్రికెటర్ గౌతమ్ గంభీర్ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం హేమమాలిని ఇంతటి తీవ్రమైన సమస్యను తేలికగా తీసిపారేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘గౌతమ్ గంభీర్ కనిపించడం లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై పిలుపునిచ్చిన సమావేశానికి హాజరుకానందున తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో ఆదివారం ఉదయమే ‘గౌతమ్ గంభీర్ అదృశ్యం’ అని పోస్టర్లను వెలిశాయి. ‘మీరు ఈ వ్యక్తిని చూశారా? చివరిసారిగా ఇండోర్‌లో స్నేహితులతో కలిసి జిలేబీలు తింటూ కనిపించాడు. ఢిల్లీ మొత్తం అతని కోసం వెతుకుతోంది’ అని రాసి ఉన్న పోస్టర్లు, బ్యానర్లు రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఉంచారు. భారత్, బంగ్లాతో మ్యాచ్ సందర్భంగా గౌతమ్ ఇండోర్ వెళ్లాడు. శుక్రవారం.. వివిఎస్ లక్ష్మణ్, జతిన్ సప్రూ, గంభీర్ కలసి సరదాగా జిలేబీలు తీసుకుంటున్న ఫోటోను అయన ట్వీట్ చేశారు. దీని తరువాత, గంభీర్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆప్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు గంభీర్ ను విమర్శించాయి. కీలక సమావేశానికి గౌతమ్ డుమ్మా కొట్టడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘ప్రజలు నిన్ను గెలిపించినందుకు నువ్వు తగిన శాస్తి చేస్తున్నావు’ అంటూ విమర్శిస్తున్నారు. ‘ఇక్కడ ప్రజలు కాలుష్యంతో అల్లాడిపోతుంటే నువ్వు ఇండోర్‌లో జిలేబీలు తింటూ ఎంజాయ్ చేస్తున్నావా?’ అంటూ మరో నెటిజన్ అసహనం వ్యక్తం చేశాడు. -
కీలక సమావేశానికి గౌతమ్ గంభీర్ డుమ్మా
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పెరిగిన వాయు కాలుష్యంతో మాస్కులు లేనిదే బయట తిరగలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం అంశంపై పార్లమెంట్ ప్యానెల్ శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఎంపీ, ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్ డుమ్మా కొట్టారు. ఇతనితోపాటు మరికొంతమంది మంత్రులు, పలువురు అధికారులు గైర్హాజరయ్యారు. 29 మంది ఎంపీలకుగానూ కేవలం నలుగురు మాత్రమే హాజరు కావటంతో సమావేశం రద్దయింది. ఈ ఘటనపై పార్లమెంట్ ప్యానెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సమావేశానికి గైర్హాజరైనవారిపై చర్యలు తీసుకుంటామని పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ఇండోర్‌లో ఉన్నాడు. ఇండియా బంగ్లాదేశ్‌కు జరిగే మ్యాచ్‌లో కామెంట్రీ ఇస్తున్నాడు. ఇక కీలక సమావేశానికి గౌతమ్ డుమ్మా కొట్టడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. గతంలొ వాయు కాలుష్యంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన గౌతమ్‌పై తిరుగుదాడి చేసింది. గౌతమ్ ఇండోర్‌లో జిలేబీలు తింటున్న ఫొటో షేర్ చేస్తూ ‘ముందు మీరు ఎంజాయ్ చేయడం ఆపి వాయు కాలుష్యంపై జరిగే సమావేశాల్లో హాజరవండి’ అంటూ చురకలు అటించింది. మరోవైపు నెటిజన్లు కూడా గౌతమ్ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ‘ప్రజలు నిన్ను గెలిపించినందుకు నువ్వు తగిన శాస్తి చేస్తున్నావు’ అంటూ విమర్శిస్తున్నారు. ‘ఇక్కడ ప్రజలు కాలుష్యంతో అల్లాడిపోతుంటే నువ్వు ఇండోర్‌లో జిలేబీలు తింటూ ఎంజాయ్ చేస్తున్నావా?’ అంటూ మరో నెటిజన్ అసహనం వ్యక్తం చేశాడు. Instead of sitting in commentary box and enjoying... We challenge @GautamGambhir to stop playing blame games over pollution and ATTEND MEETINGS ON AIR POLLUTION which he skipped Contempt of Court! Strict action should be taken against all absentees!#ShameOnGautamGambhir https://t.co/KrA6NtoOQH pic.twitter.com/dXOycuaYSP — AAP (@AamAadmiParty) November 15, 2019 -
ట్విటర్‌కు పది రోజులు గడువు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్ మీడియా సంస్థలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై నియమించిన పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. సోమవారం (ఫిబ్రవరి 25)న ట్విట్ర్ అధికారులతో చర్చించిన కమిటీ రాబోయే పార్లమెంటు ఎన్నికలు విదేశీ సంస్థల చేత ప్రభావితం కావు అనే హామీ ఇవ్వాలని, ఇదే అంశంపై భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)తో మరింత సన్నిహితంగా చర్చలు జరపాలని కమిటీ చైర్మన్, ఎంపీ అనురాగ్ ఠాకూర్ కోరారు. ఈ అంశాలపై రాత పూర్వకంగా స్పందించేందుకు ట్విటర్ సీఈవో జాక్ డోర్సేతోపాటు ఇతర సీనియర్ అధికారులకు 10రోజులు గడువును ఇచ్చారు. అవసరమైతే ఇదే విషయంపై మరోసారి సమన్లు జారీ చేసే అవకాశం ఉందని కూడా ఆయన సూచించారు. సోషల్ మీడియా వేదికలపై 'పౌరుల హక్కులను పరిరక్షించడం' అనే అంశంపై వారి అభిప్రాయాలను తెలిపేందుకు వాట్సాప్‌తోపాటు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లక ప్రతినిధులకు కూడా సమన్లు జారీ చేసింది. మార్చి 6వ తేదీన ఆయా సంస్థలకు చెందిన సీనియర్లు కమిటీ ముందు హాజరుకావాలని కోరారు. రాబోయే లోక్ సభఎన్నికల్లో సోషల్ మీడియా సంస్థలు ఎటువంటి ప్రభావాలు చూపించకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అనురాగ్ ఠాకూర్ కోరారు. సోషల్ మీడియా సంస్థలు.. ఎన్నికల సమస్యలపై ఎన్నికల సంఘంతో కలిసి పనిచేయాలన్నారు. అంతకుముందు ట్విటర్ వైస్ ప్రెసిడెంట్,పబ్లిక్ పాలసీ హెడ్ కోలిన్ క్రోవెల్‌తో కమిటీ దాదాపు మూడున్నర గంటలపాటు చర్చించింది. ఈ సమావేశంలో సీఈవో జాక్ డోర్సీ రాసిన లేఖను అనురాగ్ ఠాకూర్ చదివి వినిపించినట్టు తెలుస్తోంది. కాగా సోషల్ మీడియాలో పౌరుల హక్కుల పరిరక్షణ కోసం బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో పార్లమెంటరీ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ నెల ఒకటవ తేదీన ట్విటర్ సంస్థకు ప్రభుత్వం సమన్లు కూడా జారీ చేసింది. సమయం తక్కువగా ఉందంటూ ట్విటర్ అధికారులు నిరాకరించడంతో, సమావేశం వాయిదా పడుతూ వచ్చింది. వాస్తవానికి ఈ మీటింగ్ తొలుత ఫిబ్రవరి7నుంచి 11వ తేదీకి వాయిదా పడింది. అనంతరం ట్విటర్ అధికారులు గైర్హాజరుకావడంతో పార్లమెంటరీ కమిటీ 15రోజుల్లో కమిటీ హాజరు కావాలంటూ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. Twitter will appear before the Parliamentary Commitee today 25th Feb. Facebook, WhatsApp, Instagram will appear on 6th March. https://t.co/0sIOhVZIdZ — Anurag Thakur (@ianuragthakur) February 25, 2019 -
కల్పితం అన్నప్పుడు ఆ పేర్లే ఎందుకు వాడావ్?
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి చిక్కులు తప్పేలా కనిపించటం లేదు. పార్లమెంట్ పానెల్ ముందు సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి, దర్శకుడు భన్సాలీ హాజరై తమ వాదనలు వినిపించారు. చిత్రం కల్పితమని భన్సాలీ చెబుతున్నప్పటికీ.. చరిత్రకారులు చిత్రాన్ని చూసి క్లియరెన్స్ ఇస్తేనే తాము ముందుకు వెళ్తామని ప్రసూన్ జోషి స్పష్టం చేస్తున్నారు. దర్శకుడిగా సతీ ఆచారం చూపించటం.. సీబీఎఫ్సీ కంటే ముందే ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులకే సినిమా చూపించటం వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలని పానెల్ సభ్యులు అడిగిన ప్రశ్నకు భన్సాలీ తటపటాయించినట్లు తెలుస్తోంది. ఇక పానెల్ ఎదుట భన్సాలీ, సెన్సార్ సభ్యులు, కమిటీ సభ్యుల మధ్య సంభాషణలు ఇలా ఉన్నాయి... చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు లేవని నిరూపించేందుకు తన దగ్గర వేరేదారి లేదని భన్సాలీ సమాధానం ఇవ్వగా.. అలాంటప్పుడు తమ ముందు ఎందుకు హాజరయ్యారంటూ పానెల్ సభ్యులు ఆయనకు చురకలంటిచారు. చిత్ర విడుదలలో జాప్యం మూలంగా తాను నష్టపోతున్నానని భన్సాలీ వివరణ ఇస్తుండగా.. ఎమోషనల్ అంశంతో వ్యాపారం చేయాలని చూస్తున్నారా? అంటూ సభ్యులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇంతలో జోక్యం చేసుకున్న సీబీఎఫ్సీ సభ్యులు... సినిమా పూర్తి కల్పితం అని చెబుతున్నప్పుడు.. అసలు పేర్లను ఉపయోగించాల్సిన అవసరం ఏంటని భన్సాలీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు సినిమా సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో కూడా ఆ విషయాన్ని తెలియజేయలేదని వాదించారు. అయితే అలాంటప్పుడు ట్రైలర్‌కు అనుమతి ఎలా ఇచ్చారని పానెల్ కమిటీ సభ్యుడు, సీనియర్‌నేత ఎల్ కే అద్వానీ సెన్సార్బోర్డును తిరిగి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చిత్ర విషయంలో తమకన్నా.. సెన్సార్‌బోర్డు కలగజేసుకోవటమే ఉత్తమమన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేసినట్లు సమాచారం. చివరకు రెండు గంటలపాటు ఇరుపక్షాల వాదనలు విన్న అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో కమిటీ నివేదికను త్వరలో కేంద్రానికి అందజేస్తామని ప్రకటించింది. ‘‘సినిమా అనేది వినోదాలకు అందించేందిగా ఉండాలే తప్ప.. వివాదాలకు కేంద్ర బిందువు కాకూడదు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేది అసలు సినిమా ఎలా అవుతుంది?. ఇది చాలా సున్నితమైన అంశం అని ఠాకూర్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నోట్ల లెక్క ఇంకా తేలలేదు
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ ముగిసి ఆరు నెలలకు పైగా కావొస్తున్నా ఇంకా ఆ నోట్ల లెక్క తేలలేదు. డీమానిటైజేషన్ తర్వాత పాత నోట్లు ఎన్ని డిపాజిట్ అయ్యాయో ఇంకా లెక్కిస్తూనే ఉన్నామని రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేడు పార్లమెంట్ ప్యానెల్‌కు తెలిపారు. స్పెషల్ టీమ్ ఈ నోట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతుందని, వారంలో ఆరు రోజులు పనిచేస్తూ కేవలం ఆదివారం మాత్రమే సెలవు తీసుకుంటున్నట్టు పటేల్ చెప్పారు. నోట్ల రద్దు చేపట్టినప్పటి నుంచీ ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎన్ని రద్దైన నోట్లు మళ్లీ సిస్టమ్‌లోకి వచ్చాయని సమాజ్‌వాదీ పార్టీ నేత నరేశ్ అగర్వాల్, తృణమూల్ ఎంపీ సాగాటో రాయ్‌లు ఆర్బీఐ గవర్నర్‌ను ప్రశ్నించగా... గతేడాది నవంబర్‌న రూ.17.7 లక్షల కోట్లు చలామణిలో ఉంటే, ప్రస్తుతం రూ.15.4 లక్షల కోట్లు చలామణిలో ఉన్నట్టు పటేల్ తెలిపారు. గతేడాది నవంబర్ 8 ప్రధాని హఠాత్తుగా పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రద్దు చేసిన అనంతరం పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి డిసెంబర్ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. అప్పటిలోగా దేశంలో ఉన్న పాత కరెన్సీ నోట్లన్నంటిన్నీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, వాటిని కొత్త కరెన్సీలోకి మార్చుకోవాలని ఆదేశించింది. రద్దయిన నోట్లు ఇంకా నేపాల్ దేశం నుంచి, కోపరేటివ్ బ్యాంకుల నుంచి వస్తున్నాయని పటేల్ చెప్పారు. అంతేకాక పోస్టు ఆఫీసులు ఇంకా పాత నోట్లను ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉందన్నారు. నోట్ల రద్దు విషయంలో పటేల్ రెండోసారి పార్లమెంట్ ప్యానల్ ముందు హాజరయ్యారు. ప్యానల్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. వచ్చే వర్షాకాల సమావేశాల్లో పెద్దనోట్ల రద్దు లెక్కలు పార్లమెంటులో ప్రవేశపెడతామని పటేల్ చెప్పినట్టు తెలిసింది. పార్లమెంట్ ప్యానల్‌కు అధినేతగా కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ ఉన్నారు. అంతకముందు రెండుసార్లు పటేల్‌కు ప్యానల్ సమన్లు జారీచేయగా.. ఆ కాలంలో ఆర్బీఐకు అత్యంత కీలకమైన ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఉన్నందున పటేల్ మినహాయింపు కోరారు. ఈ కమిటీ టాప్ ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులకు కూడా పెద్ద నోట్ల విషయంలో సమన్లు జారీచేసింది. దీని ప్రభావాన్ని తమ ముందు వెల్లడించాలని ఆదేశించింది. -
ఇంకాస్త టైమివ్వండి
న్యూఢిల్లీ: లోక్‌పాల్, లోకాయుక్త సవరణ బిల్లును పరిశీలించేందుకు ఇంకాస్త సమయం కావాలని దానికోసం ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ కేంద్రాన్ని కోరింది. గత ఏడాది డిసెంబర్ 8న ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. అయితే, దానిని పరిశీలించేందుకు ప్రత్యేక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఈ నెల 25నాటికి నివేదిక ఇవ్వాల్సి ఉండగా వారు ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో మరికొంచెం సమయం ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కమిటీలో వివిధశాఖలనుంచి మొత్తం 32 మంది సభ్యులు ఉన్నారు. -
రిలయన్స్‌ను డిఫాల్టర్‌గా ప్రకటించాలి
న్యూఢిల్లీ: కేజీ-డీ6లో ఒప్పందాలమేరకు క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక(ఎఫ్డీపీ)లను అమలు చేయడంలో విఫలమైన రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)పై పార్లమెంటరీ కమిటీ ధ్వజమెత్తింది. కంపెనీ కాంట్రాక్టును ఉల్లంఘించినట్టు(డీఫాల్టర్)గా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ‘కాంట్రాక్టులో వాగ్దానం చేసినట్లుగా 50 బావులను కేజీ-డీ6 బ్లాక్‌లో తవ్వకపోవడంవల్లే గడిచిన మూడేళ్లలో ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి పాతాళానికి పడిపోయేందుకు దారితీసింది. కేంద్రం ఆమోదించిన ఎఫ్డీపీను అమలుచేయకపోవడాన్ని వైఫల్యంగా కాకుండా డిఫాల్ట్‌గానే పరిగణించాలి. దీనిపై చమురు శాఖ తప్పకుండా చర్యలు చేపట్టాల్సిందే’ అని పెట్రోలియం, సహజవాయువులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం మంగళవారం పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. కాగా, కేజీ-డీ6లో ఉత్పత్తి పెంచేందుకు తగిన చర్యలను అన్వేషించాలని కూడా కమిటీ చమురు శాఖకు సూచించింది. 2010-11లో సగటున రోజుకు 55.89 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ) స్థాయిలో కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి జరగగా... 2011-12లో ఇది 26.18 ఎంఎంఎస్‌సీఎండీలకు దిగజారింది. తాజాగా ఇక్కడి గ్యాస్ ఉత్పత్తి ఆల్‌టైమ్ కనిష్టమైన 12 ఎంఎంఎస్‌సీఎండీలకు క్షీణించింది. అయితే, బావుల్లోకి నీరు, ఇసుక చేరడం ఇతరత్రా భౌగోళిక కారణాలే గ్యాస్ ఉత్పత్తి పడిపోవడానికి కారణమని రిలయన్స్ వాదిస్తుండగా... తగినన్ని బావులను తవ్వకపోవడమే కారణమంటూ నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) పదేపదే చెబుతూవస్తోంది. డీజీహెచ్ నియమించిన నిపుణుల కమిటీ కూడా కేజీ-డీ6లో గ్యాస్ నిల్వలు అంచనాల మేరకు(10 ట్రిలియన్ ఘనపుటడుగులు) ఉన్నాయని, పరిష్కార చర్యలు చేపడితే ఉత్పత్తి పెరుగుతుందని స్పష్టం చేసింది కూడా. అయితే, రిలయన్స్ ఎలాంటి దిద్దుబాటు చర్యలూ చేపట్టలేదని కమిటీ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం.