రిలయన్స్‌ను డిఫాల్టర్‌గా ప్రకటించాలి
రిలయన్స్‌ను డిఫాల్టర్‌గా ప్రకటించాలి
Published Wed, Dec 11 2013 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
న్యూఢిల్లీ: కేజీ-డీ6లో ఒప్పందాలమేరకు క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక(ఎఫ్‌డీపీ)లను అమలు చేయడంలో విఫలమైన రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)పై పార్లమెంటరీ కమిటీ ధ్వజమెత్తింది. కంపెనీ కాంట్రాక్టును ఉల్లంఘించినట్టు(డీఫాల్టర్)గా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ‘కాంట్రాక్టులో వాగ్దానం చేసినట్లుగా 50 బావులను కేజీ-డీ6 బ్లాక్‌లో తవ్వకపోవడంవల్లే గడిచిన మూడేళ్లలో ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి పాతాళానికి పడిపోయేందుకు దారితీసింది. కేంద్రం ఆమోదించిన ఎఫ్‌డీపీను అమలుచేయకపోవడాన్ని వైఫల్యంగా కాకుండా డిఫాల్ట్‌గానే పరిగణించాలి. దీనిపై చమురు శాఖ తప్పకుండా చర్యలు చేపట్టాల్సిందే’ అని పెట్రోలియం, సహజవాయువులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం మంగళవారం పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. కాగా, కేజీ-డీ6లో ఉత్పత్తి పెంచేందుకు తగిన చర్యలను అన్వేషించాలని కూడా కమిటీ చమురు శాఖకు సూచించింది.
2010-11లో సగటున రోజుకు 55.89 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ) స్థాయిలో కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి జరగగా... 2011-12లో ఇది 26.18 ఎంఎంఎస్‌సీఎండీలకు దిగజారింది. తాజాగా ఇక్కడి గ్యాస్ ఉత్పత్తి ఆల్‌టైమ్ కనిష్టమైన 12 ఎంఎంఎస్‌సీఎండీలకు క్షీణించింది. అయితే, బావుల్లోకి నీరు, ఇసుక చేరడం ఇతరత్రా భౌగోళిక కారణాలే గ్యాస్ ఉత్పత్తి పడిపోవడానికి కారణమని రిలయన్స్ వాదిస్తుండగా... తగినన్ని బావులను తవ్వకపోవడమే కారణమంటూ నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) పదేపదే చెబుతూవస్తోంది. డీజీహెచ్ నియమించిన నిపుణుల కమిటీ కూడా కేజీ-డీ6లో గ్యాస్ నిల్వలు అంచనాల మేరకు(10 ట్రిలియన్ ఘనపుటడుగులు) ఉన్నాయని, పరిష్కార చర్యలు చేపడితే ఉత్పత్తి పెరుగుతుందని స్పష్టం చేసింది కూడా. అయితే, రిలయన్స్ ఎలాంటి దిద్దుబాటు చర్యలూ చేపట్టలేదని కమిటీ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం.
Advertisement
Advertisement