రిలయన్స్‌పై రూ. 5 వేల కోట్ల వడ్డింపు!
రిలయన్స్‌పై రూ. 5 వేల కోట్ల వడ్డింపు!
Published Fri, Sep 13 2013 1:05 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)పై మరో భారీ జరిమానా వడ్డనకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. కేజీ-డీ6 క్షేత్రాల్లో ముందుగా చెప్పినదానికంటే 2012-13లో చాలా తక్కువ గ్యాస్‌ను ఉత్పత్తిచేసినందుకుగాను... 78.1 కోట్ల డాలర్ల(దాదాపు రూ.5 వేల కోట్లు) అదనపు జరిమానా విధించాలని నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై న్యాయ మంత్రిత్వ శాఖ సలహా కోరినట్లు చమురు శాఖ కార్యదర్శి వివేక్ రే గురువారం ఇక్కడ విలేకరులతో చెప్పారు. ‘2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరాల్లో కూడా గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోయినందుకుగాను ఆర్‌ఐఎల్‌కు 100.5 కోట్ల డాలర్ల(సుమారు రూ.6,500 కోట్లు) జరిమానా విధిస్తూ చమురు శాఖ నోటీసు జారీచేసింది. అయితే, ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వం) చర్యలు చేపట్టడం జరిగాయి. తాజా కేసులో అదనపు జరిమానా విధించాలని డీజీహెచ్ జూలైలో చేసిన సూచనలపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న దానిపైనే న్యాయ సలహా కోరాం’ అని వివేక్ వెల్లడించారు.
పాతాళానికి గ్యాస్ ఉత్పత్తి...
కేజీ-డీ6లో 2012-13కు సంబంధించి రోజుకు 86.73 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంసీఎండీ) గ్యాస్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. ఆర్‌ఐఎల్ సగటును 26.07 ఎంసీఎండీలను మాత్రమే ఉత్పత్తి చేసింది. ఇందుకుగాను ఆర్‌ఐఎల్ వెచ్చించిన పెట్టుబడి వ్యయంలో 78.1 కోట్ల డాలర్లను రికవరీ చేసుకోనీయకుండా జరిమానాగా విధించాలనేది డీజీహెచ్ వాదన. అయితే, ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తి ఘోరంగా పడిపోయి 14 ఎంసీఎండీలకే పరిమితమవుతోంది. కంపెనీ ముందస్తు ప్రణాళికలో చెప్పినవిధంగా తగినన్ని గ్యాస్ బావులు తవ్వకపోవడం వల్లే ఉత్పత్తి దిగజారిందని డీజీహెచ్ చాన్నాళ్లుగా చెబుతోంది.
క్యాబినెట్ ముందుకు వివాదం....
కేజీడీ6లోని డీ1,డీ3 క్షేత్రాల్లో రిలయన్స్ ఉత్పత్తి చేసే గ్యాస్ రేటు వివాదం కేంద్ర క్యాబినెట్ ముందుకు రానుంది. ఉత్పత్తి తగ్గినందుకు కారణాలు తేలే వరకూ అధిక రేటునివ్వరాదంటున్న చమురు శాఖ.. ఈ విషయాన్ని క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లనుంది. ఈ క్షేత్రాల్లో గ్యాస్‌కి కొత్త రేటు వర్తింపచేయడానికి ముందుగా సాంకేతికపరమైన అంశాలు పరిష్కారం కావాల్సి ఉందని వివేక్ తెలిపారు. నిల్వలు నిజంగానే అంచనా వేసిన దానికన్నా తక్కువగా ఉన్నాయా లేక ఎక్కువ బావులు తవ్వకపోవడం వల్లే ఉత్పత్తి తగ్గిందా అన్నది డీజీహెచ్ సారథ్యంలోని మేనేజ్‌మెంట్ కమిటీ పరిశీలిస్తుందన్నారు. అవసరమైతే అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయాలూ తీసుకుంటామని చెప్పారు.
Advertisement
Advertisement