సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి చిక్కులు తప్పేలా కనిపించటం లేదు. పార్లమెంట్ పానెల్ ముందు సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి, దర్శకుడు భన్సాలీ హాజరై తమ వాదనలు వినిపించారు. చిత్రం కల్పితమని భన్సాలీ చెబుతున్నప్పటికీ.. చరిత్రకారులు చిత్రాన్ని చూసి క్లియరెన్స్ ఇస్తేనే తాము ముందుకు వెళ్తామని ప్రసూన్ జోషి స్పష్టం చేస్తున్నారు.
దర్శకుడిగా సతీ ఆచారం చూపించటం.. సీబీఎఫ్‌సీ కంటే ముందే ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులకే సినిమా చూపించటం వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలని పానెల్ సభ్యులు అడిగిన ప్రశ్నకు భన్సాలీ తటపటాయించినట్లు తెలుస్తోంది. ఇక పానెల్ ఎదుట భన్సాలీ, సెన్సార్ సభ్యులు, కమిటీ సభ్యుల మధ్య సంభాషణలు ఇలా ఉన్నాయి... చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు లేవని నిరూపించేందుకు తన దగ్గర వేరేదారి లేదని భన్సాలీ సమాధానం ఇవ్వగా.. అలాంటప్పుడు తమ ముందు ఎందుకు హాజరయ్యారంటూ పానెల్ సభ్యులు ఆయనకు చురకలంటిచారు. చిత్ర విడుదలలో జాప్యం మూలంగా తాను నష్టపోతున్నానని భన్సాలీ వివరణ ఇస్తుండగా.. ఎమోషనల్ అంశంతో వ్యాపారం చేయాలని చూస్తున్నారా? అంటూ సభ్యులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇంతలో జోక్యం చేసుకున్న సీబీఎఫ్‌సీ సభ్యులు... సినిమా పూర్తి కల్పితం అని చెబుతున్నప్పుడు.. అసలు పేర్లను ఉపయోగించాల్సిన అవసరం ఏంటని భన్సాలీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు సినిమా సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో కూడా ఆ విషయాన్ని తెలియజేయలేదని వాదించారు. అయితే అలాంటప్పుడు ట్రైలర్‌కు అనుమతి ఎలా ఇచ్చారని పానెల్ కమిటీ సభ్యుడు, సీనియర్‌నేత ఎల్ కే అద్వానీ సెన్సార్‌బోర్డును తిరిగి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చిత్ర విషయంలో తమకన్నా.. సెన్సార్‌బోర్డు కలగజేసుకోవటమే ఉత్తమమన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేసినట్లు సమాచారం. చివరకు రెండు గంటలపాటు ఇరుపక్షాల వాదనలు విన్న అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో కమిటీ నివేదికను త్వరలో కేంద్రానికి అందజేస్తామని ప్రకటించింది. ‘‘సినిమా అనేది వినోదాలకు అందించేందిగా ఉండాలే తప్ప.. వివాదాలకు కేంద్ర బిందువు కాకూడదు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేది అసలు సినిమా ఎలా అవుతుంది?. ఇది చాలా సున్నితమైన అంశం అని ఠాకూర్ ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment