మన చలనచిత్రాలనూ, డాక్యుమెంటరీలనూ చూసి అవి ఆమోదయోగ్యమో కాదో తేల్చడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ) ఉంది. అది గీసే సవాలక్ష ‘లక్ష్మణరేఖల’పైనా, కత్తిరింపులపైనా విమర్శలు వెల్లువెత్తుతున్న తరు ణంలో ఆ పనుల్ని అంతకంటే మూర్ఖంగా, మొరటుగా చేయడానికి దేశంలో ఎక్కడి కక్కడ మూకలు పుట్టుకొస్తున్నాయి. సినిమాల్లో కథలెలా ఉండాలో, సంభాషణలెలా సాగాలో, పాటల్లో ఏం పదాలుండాలో ఇవి నిర్ణయిస్తున్నాయి. వాటిని అమలు చేస్తారా చస్తారా అని బెదిరింపులకు దిగుతున్నాయి. ‘పద్మావతి’ చిత్రం ఇప్పుడు అలాంటి మూకల బారిన పడింది.
సృజనాత్మకత కలిగిన దర్శకుడిగా పేరు ప్రఖ్యా తులున్న సంజయ్‌లీలా భన్సాలీ నిర్మించిన ‘పద్మావతి’కి షూటింగ్ మొదలైనప్పటి నుంచే కష్టాలు చుట్టుముట్టాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో వేసిన సెట్‌లోకి చొరబడి ఆ సెట్‌నూ, విలువైన పరికరాలనూ ధ్వంసం చేయడంతోపాటు భన్సాలీపై దౌర్జన్యం చేశారు. ఆ తర్వాత షూటింగ్‌ను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు మార్చు కుంటే అక్కడ సైతం సెట్‌కు నిప్పు పెట్టారు. షూటింగ్ ప్రారంభించడానికి చాలా ముందే నిరుడు నవంబర్‌లోనే భన్సాలీ తన సినిమా ఇతివృత్తం గురించి వచ్చిన కథనాల తర్వాత ఏర్పడ్డ అపోహలను తొలగించడానికి ప్రయత్నించారు. పద్మావతి పాత్రను కించపరిచే ఉద్దేశం తనకు లేదని, ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రకూ, ఆ పాత్రకూ మధ్య ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలూ ఉండబోవని ఆయన వివరించాడు. చిత్రం పేరు సైతం ముందనుకున్నట్టు ‘రాణి పద్మిని’ అనికాక ‘పద్మా వతి’ అని మార్చాడు. కానీ నిరసనలకు దిగేవారికి ఇదంతా పట్టలేదు. వారి బాణీలో బెదిరింపులు, హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే ముక్కు కోస్తామని ఒకరు... భన్సాలీ, దీపికల తలలు తెచ్చిస్తే రూ. 5 కోట్ల బహు మతి ఇస్తామని మరొకరు రెచ్చిపోయి ప్రకటనలు చేస్తున్నారు. కావాలంటే క్షత్రి యుల శౌర్యపరాక్రమాలు చూపుతూ సినిమాలు తీసుకోమని సలహాలిస్తున్నారు. వచ్చే నెల 1న చిత్రం విడుదల చేయాలని సన్నాహాలు చేసుకుంటుంటే దాన్ని అడ్డు కోవడానికి ఈ బృందాలు సర్వవిధాలా ప్రయత్నిస్తున్నాయి.
ఇంత వివాదానికి కారణమైన చిత్రం ఇతివృత్తానికి ఆధారం చరిత్రలో చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని ఆధారం చేసుకుని పుట్టుకొచ్చిన కాల్పనిక గాథేనని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. 1250లో బెంగాల్‌లోని బీర్‌భూం జిల్లాలో పుట్టి 1316లో మరణించిన ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ రాజస్థాన్‌లోని చిత్తోర్ రాజ్యంపై దండెత్తడం, దాని పాలకుడు రాణా రతన్‌సింగ్ ఓటమిపాలవడం, రాజ్యం ఖిల్జీ వశం కావడం చరిత్ర. కాలగర్భంలో కలిసిపోయిన ఆ చరిత్రకు జవ జీవాలు పోసిందీ... దాని చుట్టూ కమనీయమైన కాల్పనికతను అల్లి మహత్తర కావ్యంగా తీర్చిదిద్దిందీ మాలిక్ మహమ్మద్ జయాసి అనే ఒక ముస్లిం సూఫీ కవి. 1540లో... అంటే యుద్ధం జరిగిన 224 ఏళ్లకు ఆయన ఈ కావ్య రచనకు ఉప క్రమించాడు. మొదటిసారిగా అందులో రాణా రతన్‌సింగ్ భార్య పద్మావతి ప్రస్తా వన వచ్చింది. అంతకుముందు లిఖిత, అలిఖిత చరిత్రలో ఎక్కడా పద్మావతికి సంబంధించిన ఆధారాలు లేవు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థాన కవి అమీర్‌ఖుస్రో చిత్తోర్ కోట ముట్టడి గురించిన రాసిన పత్రాల్లో ఎక్కడా పద్మావతి గురించిన ప్రస్తావన లేదు. రాజస్థాన్ నుంచి బెంగాల్ వరకూ దాదాపు అయిదువందల సంవత్సరాల వ్యవధిలో మాలిక్ కావ్యానికి ఉర్దూ, పర్షియన్ భాషల్లో అనేక అనువాదాలొచ్చాయి. అనువదించే కవుల సృజనాత్మక శక్తి మేరకు ఆ కావ్యంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదేమీ కొత్తగాదు. రామాయణ గాథ ఎన్ని దేశాల్లో ఎన్నెన్ని విధా లుగా ఉన్నదో... అందులోని పాత్రలు, వాటి మధ్య సంబంధాలు ఎలా మార్పు చెందాయో వివరిస్తూ సుప్రసిద్ధ కవి ఆరుద్ర ‘రాముడికి సీత ఏమవుతుంది?’ పేరుతో చాన్నాళ్లక్రితం పుస్తకం రాశారు.
ఇప్పుడు ‘పద్మావతి’ సినిమాపై నిప్పులు చెరుగుతున్న సంఘ్ పరివార్ పెద్దలు, రాజ్‌పుట్ కులానికి చెందిన కర్ణి సేన సభ్యులు పద్మావతి సృష్టికర్త ఒక ముస్లిం సూఫీ కవి అన్న సంగతిని మరుస్తున్నారు. రాజస్థాన్ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మంత్రులు చేసిన ప్రకటనల సంగతలా ఉంచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ సైతం బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. తమ రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినే అవకాశం ఉన్నందున చిత్రం విడుదలను వాయిదా వేయాలని యోగి కేంద్రాన్ని కోరు తున్నారు. గడ్కరి అయితే సినిమాలు నిర్మించేవారు స్వేచ్ఛ నిరపేక్షమైనదేమీ కాదని, దానికి కూడా హద్దులుంటాయని తెలుసుకోవాలని హితవు చెబుతున్నారు. అకారణంగా నోరు పారేసుకోవడానికి, బెదిరింపులకు దిగడానికి ఎలాంటి హద్దులూ ఉండవు కాబోలు!
‘పద్మావతి’పై ఇంత పెద్దయెత్తున వివాదం చెల రేగుతున్న వేళ సుప్రీంకోర్టు వేరే కేసులో చేసిన వ్యాఖ్యలు గమనించదగ్గవి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నిర్మించిన ‘యాన్ ఇన్‌సిగ్నిఫికెంట్ మాన్’ పేరిట నిర్మించిన డాక్యుమెంటరీ విడుదల కాకుండా స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేస్తూ ఏ రకమైన సృజనాత్మక వ్యక్తీకరణలకైనా అడ్డుతగిలే ప్రయత్నం చేయరాదని సుప్రీంకోర్టు కింది కోర్టులకు సూచించింది. భావప్రకటనా స్వేచ్ఛ అత్యంత పవిత్రమైనదని, ఆ హక్కులో ఆషామాషీ జోక్యం తగదని పిటిష నర్‌కు స్పష్టం చేసింది. చట్టపరిధిలో ఏ కళాకారుడైనా తనకు నచ్చిన రూపంలో తన భావాలను వ్యక్తపరచవచ్చునని తెలిపింది. సుప్రీంకోర్టు, కొన్ని హైకోర్టులు ఇంత స్పష్టంగా చెప్పడం ఇది మొదటిసారేమీ కాదు. అయినా వీధుల్లో ఛోటా నేతల వీరంగం ఆగడం లేదు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న నాయకులకు జ్ఞానోద యమూ కలగటం లేదు. ఇప్పుడు ‘పద్మావతి’ విషయంలో కేంద్రం స్పందన ఎలా ఉంటుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. విజ్ఞతతో వ్యవహరించి ఈ అనవసర వివాదానికి ముగింపు పలకాల్సిన బాధ్యత తమపై ఉన్నదని పాలకులు గ్రహించాలి.
Comments
Please login to add a commentAdd a comment