
సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై పిలుపునిచ్చిన సమావేశానికి హాజరుకానందున తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో ఆదివారం ఉదయమే ‘గౌతమ్ గంభీర్ అదృశ్యం’ అని పోస్టర్లను వెలిశాయి. ‘మీరు ఈ వ్యక్తిని చూశారా? చివరిసారిగా ఇండోర్‌లో స్నేహితులతో కలిసి జిలేబీలు తింటూ కనిపించాడు. ఢిల్లీ మొత్తం అతని కోసం వెతుకుతోంది’ అని రాసి ఉన్న పోస్టర్లు, బ్యానర్లు రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఉంచారు.
భారత్, బంగ్లాతో మ్యాచ్ సందర్భంగా గౌతమ్ ఇండోర్ వెళ్లాడు. శుక్రవారం.. వివిఎస్ లక్ష్మణ్, జతిన్ సప్రూ, గంభీర్ కలసి సరదాగా జిలేబీలు తీసుకుంటున్న ఫోటోను అయన ట్వీట్ చేశారు. దీని తరువాత, గంభీర్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆప్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు గంభీర్ ను విమర్శించాయి. కీలక సమావేశానికి గౌతమ్ డుమ్మా కొట్టడంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘ప్రజలు నిన్ను గెలిపించినందుకు నువ్వు తగిన శాస్తి చేస్తున్నావు’ అంటూ విమర్శిస్తున్నారు. ‘ఇక్కడ ప్రజలు కాలుష్యంతో అల్లాడిపోతుంటే నువ్వు ఇండోర్‌లో జిలేబీలు తింటూ ఎంజాయ్ చేస్తున్నావా?’ అంటూ మరో నెటిజన్ అసహనం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment