బాబు చేత బ్రష్ చేయించడం ఎలా?
మా బాబు వయసు ఐదు సంవత్సరాలు. పళ్లు సరిగ్గా తోముకోడు. పేస్ట్ తినేస్తుంటాడు. పొద్దున్నే చాక్లెట్లు తింటాడు. నేను దంతసమస్యలతో ఎంతో బాధపడ్డాను. వాడికి కూడా అలాగే అవుతుందేమోనని కంగారుగా ఉంది. ఏం చేయాలో తగిన సలహా ఇవ్వండి.
- పి. అనిత, గూడూరు
చిన్నపిల్లలతో బ్రష్ చేయించటం, చాక్లెట్లు మానిపించటం అంత సులభం కాదు. క్రమపద్ధతిలో నేర్పితే తప్ప చిన్నప్పటినుంచి మంచి అలవాట్లు రావు. మీరు చెబుతున్న సమస్య డెబ్భై శాతం మంది పిల్లల్లో ఉండేదే. చిన్నప్పటి నుంచే... మార్కెట్లో దొరికే బేబీ బ్రష్‌లతో తల్లిదండ్రులే పిల్లలకు బ్రష్ చేయిస్తుండాలి. మొదట్లో మారాం చేసినా, తర్వాత అలవాటవుతుంది. బ్రష్ చేసుకునేటప్పుడు పిల్లలు ఆ పేస్ట్ మింగటం, అదేపనిగా పేస్ట్ తినటం సాధారణమే. దీనివల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతినదు. ఎందుకంటే అంత హానికరమైన రసాయనాలేమీ టూత్ పేస్ట్‌లో ఉండవు.
పిల్లలెవరైనా పళ్లు తోముకోవటానికి పేచీపెడుతున్నారంటే అందుకు కారణం... బ్రషింగ్ చేసే విధానం వల్ల అసౌకర్యం ఉండటమో, పంటిలో రంధ్రాలుండటమో, చిగుళ్ల ఇన్ఫెక్షన్లు లాంటి సమస్యలుండటమో కారణం అయి ఉండాలి. అందుకే మూడు సంవత్సరాల వయసు నుంచి పిల్లల్ని క్రమం తప్పకుండా, ఆరు నెలలకోసారి డెంటిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి, చెకప్ చేయిస్తుండాలి. సరైన సమయంలో సమస్యను గుర్తిస్తే చికిత్స అవసరం లేకుండానే సరిచేయించవచ్చు. చక్కటి నోటి ఆరోగ్యానికీ, అందమైన చిరునవ్వుకూ ఈ వయసులోనే బీజం పడుతుంది. అందుకే పన్నెండేళ్ల లోపు తీసుకునే జాగ్రత్తలే కీలకం.
ఎత్తుపళ్లు, వంకరపళ్లు, పిప్పిపళ్లు, చిగుళ్లకు సంబంధించిన సమస్యలు... వీటన్నిటిపైనా వంశపారంపర్య ప్రభావం ఉంటుంది. ఆహారపు అలవాట్లు, తల్లిదండ్రులనుసరించే దంత సంరక్షణ పద్ధతులు... ఇవన్నీ నోటి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలెప్పుడూ తల్లిదండ్రులనే రోల్‌మోడల్స్‌గా తీసుకుంటారు. పెద్దవాళ్లు సరిగా బ్రష్చేసుకోకుంటే పిల్లలు కూడా అలానే అలవాటు పడతారు. పిల్లలకు చాక్లెట్లు ఎక్కువగా తినడం నేర్పించేది నిజానికి పెద్దవాళ్లే. మనం అనుభవించిన సమస్యలు పిల్లలు అనుభవించకూడదనుకుంటే మొదట పెద్దవాళ్లు మారాలి. వాళ్లను చూసి పిల్లలు నేర్చుకుంటారు.
ఆధునిక దంతవైద్యంలో దంతసమస్యలు రాకుండా చేయగలిగే చికిత్సాపద్ధతులు ఉన్నాయి. ఫ్లోరైడ్ అప్లికేషన్స్, ఫిజర్ సీలెంట్స్ లాంటి చికిత్సల ద్వారా పిల్లల్లో పిప్పిపళ్లు రాకుండా నివారించవచ్చు. అలాగే ఎత్తుపళ్లు, వంకరపళ్లులాంటి సమస్యలు వస్తాయని ముందుగా పసిగట్టగలిగితే, చిన్న చిన్న చికిత్సలతోనే నయం చేయవచ్చు. అందమైన చిరునవ్వు ఎలా పొందవచ్చో తెలియచేయవచ్చు.
డాక్టర్ పార్థసారథి,
కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్