తప్పుడు పత్రాలతో ఆక్రమించారు
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, విజయరామపురం ఆగ్రహారంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తోడల్లుడు, జనసేన నాయకుడు పరుచూరి భాస్కరరావుకు చెందిన ప్రత్యూష రీసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. విజయరామపురం ఆగ్రహారం సర్వే నెంబర్ 13(పార్ట్)లో ఉన్న తన 4.84 ఎకరాల భూమి విషయంలో జోక్యం చేసుకోకుండా, తదుపరి చర్యలు తీసుకోకుండా రెవిన్యూ అధికారులను నియంత్రించాలంటూ ప్రత్యూష కంపెనీ అధీకృత అధికారి పరుచూరి వెంకయ్య ప్రభాకర్ ఆదివారం రాత్రి హైకోర్టులో హౌస్‌మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ అధికారులు ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఈ నెల 15న అకస్మాత్తుగా ప్రహరీ కూల్చేశారని తెలిపారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్ చెబుతున్న ఇనాం గ్రామంలో ఇప్పటి వరకు ఎలాంటి సర్వే నెంబర్లు లేవని, అలాంటప్పుడు వారిది సర్వే నెంబర్ 13(పార్ట్) అని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఇవన్నీ పిటిషనర్ సృష్టించిన తప్పుడు డాక్యుమెంట్లని కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ఈ భూమి విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రెవిన్యూ అధికారులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
ఫ్యూజన్ రెస్టారెంట్ కేసులోనూ స్టేటస్ కో...
భూమి లీజు గడువు ముగిసినా ఖాళీ చేయకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ అండ్ రెస్టారెంట్‌పై మహా విశాఖ ప్రాంతాభివృద్ధి సంస్థ చర్యలు తీసుకోవడంపై ఆ సంస్థ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. హౌస్‌మోషన్ రూపంలో దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. ఫ్యూజన్ ఫుడ్స్ లీజుకు తీసుకున్న భూమిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ భూమి విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.