Paruthiveeran
-
మళ్లీ గ్రామానికి పోయిన కార్తీ
తొలి చిత్రం పరుత్తివీరన్‌లో కార్తీ పక్కా పల్లెవాసిగా జీవించారు. ఆ తరువాత ఆయన నగర నేపథ్య కథా చిత్రాలపై మొగ్గుచూపుతూ వచ్చారు. ఇటీవల విడుదలైన మెడ్రాస్ చిత్రంలో కూడా ఉత్తర చెన్నై యువకుడిగా ఆ పాత్రలో లీనమై నటించి ఆ చిత్రాన్ని విజయతీరాలకు చేర్చారు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం కొంబన్. ఈ చిత్రం కోసం కార్తీ మరోసారి గ్రామీణ యువకుడిగా మారిపోయారు. కొంబన్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. చిత్ర వివరాలను హీరో కార్తీ తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. అదేమిటో ఆయన మాటల్లోనే... కొంబన్ చిత్రకథను దర్శకుడు ముత్తయ్య పూర్తిగా నన్ను మనసులో పెట్టుకునే రాశారు. కుట్టి పులి చిత్రం తరువాత ఆయన దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రం కొంబన్. అమ్మ పెంపకంలో పెరిగిన అబ్బారుుకి మామ సంరక్షణలో పెరిగిన అమ్మాయికి పెళ్లి జరుగుతుంది. ఆ కుటుంబం మధ్య ప్రేమానుబంధాలు ఉండవు. ఊరు విషయాలే చిత్ర కథ. గొర్రెల వ్యాపారి కొంబయ్య పాండియన్ అనే నాకు తల్లి ఎంత ముఖ్యమో నా ఊరు శ్రేయస్సు అంతేముఖ్యం. ఊరులో జరిగే విశేషాలకైనా పంచాయతీలకైనా ముందుడేది నేనే. ఊరికొక్కడు, ఊరి కోసం ఒక్కడు లాంటి కథ కొంభన్. ఇది మదురై, రామనాథపురం ప్రాంతాల మధ్య జరిగే కథ. దర్శకుడు కథ చెప్పినప్పుడే ఆ జిల్లాల మధ్య సంస్కృతి, సంప్రదాయాల విషయంలో అంత వ్యత్యాసం ఉంటుందా? అని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే చెన్నైలో ఉండి చూస్తే దక్షిణ తమిళనాడు అంతా మదురై మాదిరే తెలుస్తుంది. కొంబన్ చిత్రంలో సులక్షణ పాత్ర పోషిస్తున్నాను. ఎలాంటి అభ్యంతరకర దృశ్యాలు చోటు చేసుకోవు. గ్రామం, కుటుంబం, అనుబంధాలు ఇవే చిత్రంలో కనిపిస్తాయి. కొంచెం పగ, ప్రతీకారాలు ఉంటాయి. ముఖ్యంగా మామ, అల్లుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రం కొంబన్. హీరోయిన్గా లక్ష్మీమీనన్‌కు మినహా వేరెవరూ నటించినా ఈ చిత్రంలో పాత్ర అం తగా పండదు. అంతగా ఆమె ఆ పాత్రలో ఒదిగి పోయి నటిస్తున్నారు. మామగా రాజ్‌కిరణ్, అమ్మగా కోవై సరళ నటిస్తున్నార ని కార్తీ కొంబన్ వివరాలు వెల్లడించారు. -
పెళ్లికి సిద్ధమైన ప్రియమణి
ప్రియమణి పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం. పరుత్తివీరన్ చిత్రంలో ముత్తళని పాత్రలో జీవించిన నటి ప్రియమణి. తర్వాత మలైకోటై తదితర చిత్రాలలో నటించినా ఆశించిన విజయాలు దక్కలేదు. దీంతో టాలీవుడ్‌పై దృష్టి సారించింది. అక్కడ ప్రారంభంలో విజయాలు పలకరించాయి. తర్వాత అవకాశాలు ముఖం చాటేశాయి. మలయాళం, కన్నడంలోనూ అమ్మడి మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంది. అదే సమయంలో ప్రియమణి వయసు ఇరవై తొమ్మిదికి చేరింది. దీంతో ఆమెకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరుడి అన్వేషణలో వారు బిజీగా ఉన్నారట. డాక్టర్, ఇంజినీరు, వ్యాపారవేత్తలలో ఒకరిని ప్రియమణి జీవిత భాగస్వామి చేయాలని ఆశిస్తున్నారని తెలిసింది. అంతేకాదు అలాంటి వారి జాతకాలను తెప్పించుకుని చూస్తున్నా రు. సరైన వరుడు లభించగానే ప్రియమణి పెళ్లిపీట లెక్కడం ఖాయమంటున్నారు. వివాహానంతరం నటనకు ఫుల్స్టాప్ పెట్టాలని ప్రియమణి నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
ప్రియమణి విలనిజం
అందంతో పాటు అభినయం పుష్కలంగా ఉన్నా ప్రియమణికి అదృష్టం కలిసి రావటం లేదు. 'పరుత్తివీరన్' చిత్రంలో జాతీయ స్థాయిలోఉత్తమ నటన ప్రదర్శించినా ఆమె కెరీర్ మాత్రం ఆశించినంతగా లేదు. తెలుగులో అడపా దడపా చిత్రాల్లో నటిస్తున్నా ప్రియమణికి అవేమీ కలిసి రావటం లేదు. ఇటీవలి ఒకటి... రెండు చిత్రాల్లో ఐటం సాంగ్స్ కూడా చేసింది. అయినా అవి కూడా ఆమెకు అవకాశాలు తెచ్చి పెట్టలేకపోయాయి. దాంతో ప్రియమణి రూట్ మార్చుతోంది. ఇప్పుడు తనలో మరో కోణం కూడా ఉందని నిరూపించేందుకు తహతహలాడుతోంది. ప్రతినాయకి పాత్రలు చేసేందుకు సైతం రెడీ అంటోంది. జాతీయ అవార్డు సొంతం చేసుకున్న తర్వాత ప్రియమణికి అదే తరహా పాత్రేలే ఆమెకు వచ్చాయి. దాంతో ఆ ముద్ర నుంచి బయటపడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరకు ఎక్స్పోజింగ్కూ సై అని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని గ్లామర్ పాత్రలు పోషించినా అవకాశాలు ముఖం చాటేశాయి. దీంతో ఈ అమ్మడు తెలుగు చిత్రసీమపై కన్నేసింది. ఇక్కడ కూడా 'పెళ్లైన కొత్తలో' 'యమదొంగ' లాంటి కొన్ని హిట్ చిత్రాలను తన ఖాతాలో జమ చేసుకుంది. నితిన్ హీరోగా నటించిన 'ద్రోణ' చిత్రంలో ఈత దుస్తులతో కనిపించి అందాలను తెరపై ఆరబోసి ఔరా అనిపించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఫలితం లేకపోయింది. ఇటీవల హిందీ చిత్రం చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. ఈ అవకాశం ద్వారా బాలీవుడ్లో పాగా వేయాలని చూసిన ప్రియమణికి చుక్కెదురైందని చెప్పవచ్చు. ఐటమ్సాంగ్ల వరకు ఓకే... హీరోయిన్ పాత్రలు అడగవద్దనే సమాధానం ఆమెకు లభిస్తోందట. దీంతో ప్రియమణి కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. చాలెంజింగ్‌తో కూడిన ప్రతినాయకి పాత్రల్లో నటించడానికి సిద్ధమంటూ దర్శక,నిర్మాతలకు సంకేతాలు పంపుతోంది. మరోవైపు అతి త్వరలోనే మెగాఫోన్ పట్టుకునేందుకు తాను ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రియమణి చెబుతోంది. దర్శత్వం చేయాలన్నది తన కలని, ఆ కలను నెరవేర్చుకునేందుకు తాను ఎప్పటి నుంచో సన్నాహాలు చేసుకుంటున్నానని ప్రియమణి చెప్పుకొస్తున్నది. హీరోలు కూడా తమ మార్కెట్ తగ్గగానే ... విలన్ పాత్రలకు ఓకే చెబుతున్న విషయం తెలిసిందే. అదే రూట్లోనూ ప్రియమణి వెళుతోంది. మరి ఆమెకు దర్శక, నిర్మాతలు ఏమేరకు అవకాశాలు ఇస్తారో చూడాలి!