వలలో చిక్కిన చిరుత
వేలూరు: వేలూరు జిల్లా పేర్నంబట్టు సమీపంలోని అడవి పందుల కోసం ఉంచిన వలలో చిరుత పడడంతో చిరుతను పట్టుకునేందుకు చెన్నై వం డలూరు జూ నుంచి ప్రత్యేక బృందా న్ని రప్పించారు. పేర్నంబట్టు సమీపంలోని అరవట్ల కొండ వద్ద పాస్మార్క్ బెండ అడవిలో ఎరుకంబట్టు, రంగంపేట, మోర్ధాన, పళ్లాకుప్పం వంటి గ్రామాలున్నాయి.
ఈ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా చిరుత పులి తిరుగుతున్నట్లు, మేకలను సైతం తినేస్తున్నట్లు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అటవీశాఖ అధికారులు వీటిపై నిఘా ఉంచినప్పటికీ చిరుత కనిపించలేదని నిర్లక్ష్యం గా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం జింకలగుట్ట వద్ద అడవి పందులను వేటాడేందుకు ఉంచిన ఇనుప కమ్మీల వలలో చిరుత కాళ్లు తగులుకొని బుసలు కొడుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు భయాందోళన చెందారు.
వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారి కృష్ణమూర్తి అధ్యక్షతన సిబ్బంది అడవి వద్దకు చేరుకొని చిరుతను పట్టుకునేందుకు చెన్నైలో వండలూరు జూలోని ప్రత్యేక బృందం ద్వారా చర్యలు చేపట్టారు. సాయంత్రానికి పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి వండలూరు జూకు తరలించారు.