ఈ-పాస్ మిషన్ వాడాల్సిందే!
అనంతపురం అర్బన్ : ప్రజాపంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడానికి ఏర్పాటైన ఈ-పాస్ మిషన్ల వ్యవస్థను మరింత బలోపేతం చేద్దామని, మరోదారి లేదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. శనివారం అనంతపురంలోని లలిత కళాపరిషత్‌లో చౌక డిపో డీలర్లకు ఈ-పాస్ మిషన్లపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్ట పరచడానికి ప్రభుత్వం ఈ-పాస్ మిషన్ల ద్వారా కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో వస్తున్న అవినీతి ఆరోపణలకు అడ్డుకట్టు వేయడానికి ఈ విధానాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న 22 వేల చౌక డిపోలకు గాను, 6 వేల చౌక డిపోల్లో ఈ-పాస్ మిషన్లను అమర్చినట్లు వెల్లడించారు.
ప్రతి చోట ఈ-పాస్మిషన్ల ద్వారానే చౌక బియ్యాన్ని పేద ప్రజలకు పంపిణీ చేయాలని మంత్రి సూచించారు. కొన్నిచోట్ల సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో ఇబ్బందులను కాదనలేమన్నారు. అందరం సమష్టిగా వాటిని అదిగమిద్దామని డీలర్లను కోరారు. జిల్లాలో 504 చౌక డిపోల కేంద్రాలో ఇ-పాస్ మిషన్లను అమర్చగా 60 శాతానికి పైగా విజయవంతం అయ్యాయని మంత్రి తెలిపారు. జిల్లాలో ఇ-పాస్ మిషన్ల ద్వారానే బియ్యం పంపిణీ విధానంలో బత్తలపల్లి మండలం మొదటి స్థానంలో నిలిచగా.. కనగానపల్లి, రామగిరి మండలాల్లో రెండు మూడు స్థానాల్లో నిలిచాయన్నారు. అందుకు ఆ మండలాల డీలర్లను, రెవిన్యూ అధికారులను మంత్రి అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్వర్ ఇబ్బందుల విషయం వాస్తవమేనని, అయితే అనంతపురం నగరంలో ఇ-పాస్ మిషన్లకు సర్వర్లు పనిచేయలేదని డీలర్లు పదే పదే చెప్పడం బాధకరమన్నారు. మీరు ఇ-పాస్ మిషన్ల ద్వారా బియ్యం పంపిణీ చేయకూడదనుకున్నారా..? అంటూ మంత్రి అసహనానికి గురయ్యారు. ఈ జిల్లా మంత్రిగా ఉండి కూడా జిల్లాలోని ఇ-పాస్ మిషన్ల పనితీరును మెరుగుపరచకపోతే.. పరిస్థితి ఏలా ఉంటుందో.. ఒక్కసారి ఆలోచించండి అని డీలర్లకు సూచించారు.
అనంతరం మంత్రి డీలర్ల సమస్యలపై ముఖాముఖి చర్చించారు. ఏవైన సమస్యలుంటే.. తన దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జేసీ బి. లక్ష్మీకాంతం మాట్లాడుతూ అర్హులకు న్యాయం జరగాలి..అనర్హులను తొలగించాలి.. ఇదే ఇ-పాస్ మిషన్ పనితీరు అని జేసీ తెలిపారు. ఈ సదస్సులో పౌరసరఫరాలశాఖ డీఎం జి వెంకటేశం, ఇన్చార్జ్ డీఎస్ఓ సౌభాగ్య లక్ష్మి, ఆర్డీఓలు రామారావు, నాగరాజ, రాంమూర్తి,, రాజశేఖర్, తహశీల్దార్లు, పౌరసరఫరాలశాఖ డిప్యూటీ తహశీల్దార్లు, డీలర్లు పాల్గొన్నారు.