passport centre
-
ఈ పాస్‌పోర్ట్ కేంద్రాల్లో శనివారం స్పెషల్ డ్రైవ్.. ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాల పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఈనెల 26న శనివారం సేవలు కొనసాగనున్నాయి. ఈనెల 22వ తేదీన సాంకేతిక సమస్య తలెత్తటం వల్ల పలువురి అపాయింట్మెట్ రీషెడ్యూల్ చేశారు. అలాంటి వారికి ఈ రెండు జిల్లాల్లోని కేంద్రాల్లో శనివారం ప్రత్యేకంగా సేవలందించనున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటన చేశారు. రీషెడ్యూల్ చేసిన వారికి మొబైల్ ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందించామని తెలిపారు. ‘22-11-2022(మంగళవారం) రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సాంకేతిక సమస్యలు తలెత్తటం వల్ల హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని 5 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఎస్‌కేఎస్), 14 పోస్ట్ ఆఫీస్ పాస్ట్‌పోర్ట్ సేవా కేంద్రాలు(పీఓపీఎస్కేఎస్) సేవలు నిలిచిపోయాయి. ఆ సమయంలో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందించాం. అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసి సమాచారం ఇస్తామని తెలిపాం. అందులో భాగంగా 22న మంగళవారం ఎవరి దరఖాస్తులు నిలిచిపోయాయో వారికి ప్రత్యేకంగా శనివారం సేవలందించాలని నిర్ణయించాం. నల్లగొండ, ఖమ్మంలోని 5 పీఎస్‌కేఎస్, 2 పీఓపీఎస్కేఎస్లలో ఈ సేవలు కొనసాగనున్నాయి. అపాయింట్మెంట్ రీషెడ్యూల్ చేసి ఎస్ఎంఎస్ పంపించాం.’ అని తెలిపారు దాసరి బాలయ్య. ఎస్ఎంఎస్లు అందిన దరఖాస్తుదారులు వారికి కేటాయించిన పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలకు షెడ్యూల్ టైమ్ ప్రకారం హాజరుకావాలని కోరారు. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు హైకోర్టు జడ్డిలు బదిలీ -
విమానం ఎక్కేందుకు రెడీ! 2021లో 4.42 లక్షల పాస్‌పోర్టుల జారీ
తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉపాధి, ఉన్నత విద్య, తమ కుటుంబ సభ్యులను చూసేందుకు పాస్‌పోర్టు ఆఫీసులకు ప్రజలు పోటెత్తుతున్నారు. కరోనా ఎఫెక్ట్ కరోనా సంక్షోభం చుట్టుముట్టిన తర్వాత ప్రపంచం ఎక్కడిక్కడ స్థంభించిపోయిందా అనే పరిస్థితులు తలెత్తాయి. విద్యాసంస్థలు మూత పడ్డాయి, విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు వచ్చాయి. ఉన్న ఉద్యోగాలే ఊడిపోగా.. చాలా చోట్ల వర్క్ ఫ్రం హోం రెగ్యులర్ పనిగా మారింది. అయితే వ్యాక్సినేషన్ పెరిగిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. రికార్డు స్థాయిలో పాస్‌పోర్ట్ ప్రాంతీయ కేంద్రం, హైదరాబాద్ తాజాగా జారీ చేసిన వివరాల ప్రకారం 2021 ఏడాదిలో 4.42 లక్షల పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. గతేడాది అంటే కరోనా సంక్షోభం బయట పడిన 2020లో ఈ సంఖ్య కేవలం 2.93వేలుగానే ఉంది. కిందటి ఏడాదితో పోల్చితే 2021లో సుమారు లక్షన్నర పాస్‌పోర్టులు అధికంగా జారీ అయ్యాయి. పాస్‌పోర్ట్‌లో కేంద్రాల్లో పరిమితంగానే సేవలు అందించినా భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. డిమాండ్ వ్యాక్సినేషన్ మొదలైన తర్వాత క్రమంగా విదేశాల్లో విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. గల్ఫ్ దేశాల్లో కార్మికులు కావాలంటూ కంపెనీలు కబురు పంపుతున్నాయి. దీంతో విదేశీ ప్రయాణాలకు డిమాండ్ పెరిగింది. చదవండి:ఎన్ఆర్ఐలకు హైదరాబాద్ పోలీసుల వార్నింగ్ -
అన్ని పార్లమెంటు స్థానాల్లోనూ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు
న్యూయార్క్: దేశంలోని మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో ఆయన ‘పాస్‌పోర్ట్ సేవా’ కార్యక్రమాన్ని ప్రారంభించాక మాట్లాడారు. పౌరులకు పాస్‌పోర్టు సేవలను సులభతరం చేసే లక్ష్యంతో వచ్చే మార్చి కల్లా పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. దీని వల్ల ప్రతి ఒక్కరికీ 50–60 కిలోమీటర్ల దూరంలోనే పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 365 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయన్నారు. వచ్చే నాలుగు నెలల్లో తమ మంత్రిత్వ శాఖ వివిధ దేశాల్లో ఉన్న భారత పౌరుల కోసం అక్కడి రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలోనూ పాస్‌పోర్ట్ సేవా పథకాన్ని ప్రారంభించనుందని తెలిపారు. విదేశాల్లో భారతీయులు పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. -
పాస్‌పోర్ట్ ఇక మరింత సులభం
సాక్షి, న్యూఢిల్లీ : పాస్‌పోర్ట్ సేవలు మరింత సరళతరం కానున్నాయి. పాస్‌పోర్ట్ సేవా యాప్‌ను విదేశాంగ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం ప్రారంభించడంతో పాస్‌పోర్ట్ పొందడం మరింత సులభతరం కానుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాజా యాప్ ద్వారా పాస్‌పోర్ట్ దరఖాస్తును దేశంలో ఎక్కడి నుంచైనా పొందవచ్చని, మొబైల్ ఫోన్ల నుంచే పాస్‌పోర్ట్ దరఖాస్తును నింపవచ్చని చెప్పారు. నూతన పథకాల ద్వారా పాస్‌పోర్ట్ విప్లవం చోటుచేసుకుందని మంత్రి అభివర్ణించారు. హజ్ యాత్రకు వెళ్లే వందలాది భారత పౌరులకు సరళీకరించిన నూతన పాస్‌పోర్ట్ దరఖాస్తు సులభతరంగా ఉంటుందని అన్నారు. దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల సంఖ్యను పెంచామని, ఇవన్నీ ఇప్పుడు పనిచేస్తున్నాయని చెప్పారు. మరో 38 అదనపు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 260 పాస్‌పోర్ట్ కేంద్రాలు పనిచేస్తుండగా, త్వరలో వాటిని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకూ ప్రభుత్వం విస్తరిస్తుందన్నారు. -
'మీరు ఊహించని ప్రాంతాలకు పాస్‌పోర్టు సెంటర్'
కోల్కత్తా : పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకోడానికి సామాన్యుడికి భారం కాకూడదని ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పాస్‌పోర్టు సెంటర్‌ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ విజన్ కోసం ప్రభుత్వం ఎంతో కృతనిశ్చయంతో పనిచేస్తుందని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎంజే అక్బర్ చెప్పారు. ''పాస్‌పోర్టు అనేది హక్కు. ఇది బహుమతి కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం'' అని ఉత్తర కోల్‌కత్తాలో బీడాన్ స్ట్రీట్ పోస్టు ఆఫీసులో పోస్టు ఆఫీసు పాస్‌పోర్టు సేవాకేంద్రా(పీఓపీఎస్‌కే) ప్రారంభోత్సవ కార్యక్రమంలో చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఎంఈఏ మంత్రి సుష్మాస్వరాజ్ విజన్, సామాన్యుడికి సైతం పాస్‌పోర్టు సౌకర్యాన్ని అందించడమని, భవిష్యత్తులో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పాస్‌పోర్టు సెంటర్ వస్తుందని చెప్పారు. ఇదే సమయంలో నాదియా జిల్లా కిషనానగర్లో మరో పీఓపీఎస్‌కేను కూడా మంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. గతంలో మీరు ఊహించని ప్రాంతాలకు కూడా పాస్‌పోర్టు ఆఫీసులు వస్తాయన్నారు. ఒకటిన్నర సంవత్సరం క్రితం ఈ ప్రాజెక్టును ప్రారంభించామని, ప్రస్తుతం ఇది శరవేగంగా దూసుకెళ్తుందని, వచ్చే రోజుల్లో ఈ కార్యక్రమంపై విశేష పెరుగుదల చూస్తారని మంత్రి చెప్పారు. గతంలో పాస్‌పోర్టు కోసం ప్రజలు అన్వేసించేవారని, కానీ భవిష్యత్తులో పాస్‌పోర్టు ఆఫీసులే ప్రజల కోసం అన్వేసించేలా చేయాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. అప్పర్ క్లాస్ సేవా నుంచి గరీవ్ సేవాను ఇవ్వాలని తాము కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. ఇలాంటి ఆఫీసులోనే సిలిగురి, డార్జిలింగ్ వంటి ప్రాంతాల్లో కూడా ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు.