Passport service center
-
పోస్టాఫీసుల్లో మరో 600 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు
న్యూఢిల్లీ: తపాలా శాఖల్లో 2028–29 నాటికి మరో 600 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుకు వీలుగా తపాలా శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ మధ్య ఒప్పందం కుదిరినట్టు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. ‘భారత ఆర్థిక సదస్సు 2024’ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. తపాలా శాఖకు దేశవ్యాప్తంగా 6,40,000 విక్రయ కేంద్రాలున్నాయని, ప్రపంచంలో మరే సంస్థకు ఈ స్థాయి నెట్వర్క్ లేదన్నారు. పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు 2017తో ప్రారంభం కాగా.. 1.52 కోట్ల మందికి పైగా సేవలు అందించడంలో ఇవి కీలకంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 442 పోస్టాఫీసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలున్నాయి. -
కమలంతో కయ్యం
► భీమవరంలో పాస్‌పోర్ట్ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి సుజాత దూరం ► టీడీపీ మంత్రుల పేర్లు లేకుండా శిలాఫలకం ► తమ్ముళ్ల తీరుకు ప్రతీకారమే అంటున్న విశ్లేషకులు ► ఆదినుంచీ తమను దూరం పెడుతున్నారంటున్న బీజేపీ నేతలు ► మిత్రపక్షాల మధ్య పెరుగుతున్న అగాధం సాక్షి ప్రతినిధి, ఏలూరు/భీమవరం : మిత్రపక్షాల మధ్య వైరం ముదిరి పాకాన పడుతోంది. భీమవరంలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా టీడీపీ నేతలు కమల నాథులతో బుధవారం కయ్యానికి దిగారు. జిల్లాలో తొలినుంచీ బీజేపీ, టీడీపీ నేతల మధ్య విభేదాలు పొడసూపుతూనే ఉన్నాయి. ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వారు మిత్రపక్షాన్ని అవమానించే చర్యలకు పాల్పడుతున్నారు. ఫలితంగా టీడీపీ, బీజేపీ మధ్య అగాధాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బహిరంగంగా ఒకరినొకరు దుయ్యబట్టుకోవడంతోపాటు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి మరీ మిత్రపక్షాలు విమర్శలు చేసుకుం టుండటంతో ఇరుపార్టీల మధ్య కలహాల కాపురం నడుస్తోంది. జెడ్పీ చైర్మన్ తన అనుమతి లేకుండా గూడెం నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి మాణిక్యాలరావు నిరసన వ్యక్తంచేసి వారం గడవకుం డానే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి ఈ వివాదం బీజేపీకి చుట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీహెచ్.అయ్యన్నపాత్రుడు, జిల్లాకు చెందిన మంత్రి పీతల సుజాత పేర్లు శిలాఫల కంపై వేయకపోవడం, బీజేపీకి చెం దిన ఇతర జిల్లాల ఎంపీల పేర్లను వేయడం భీమవరంలో తాజా వివాదానికి కారణమైంది. తాజా వివాదం ఇలా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన పాస్‌పోర్ట్ లఘు సేవా కేంద్రాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి విజయకుమార్‌సింగ్ బుధవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ శిలాఫలకంపై తొలుత కేంద్ర మంత్రితోపాటు బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, ఎంపీలు గోకరాజు గంగరాజు, కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు పేర్లు వేయగా, టీడీపీకి చెందిన ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), మునిసిపల్ చైర్మన్ కొటికల పూడి గోవిందరావు పేర్లను మాత్రమే వేశారు. దీంతో టీడీపీ నేతలు భగ్గుమన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లాకు చెందిన రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత పేర్లు వేయలేదు. ఇన్చార్జి మంత్రి, జిల్లాకు చెందిన మంత్రి పేర్లు వేయకుండా అవమానించారంటూ టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. దీంతో ముందుగా తయారు చేసిన శిలాఫలకాన్ని హడావుడిగా మార్చి అయ్యన్నపాత్రుడు, పీతల సుజాత పేర్లను రాయించారు. ఉద్దేశపూర్వకంగానే తన పేరు వేయకుండా అవమానించారని భావించిన మంత్రి పీతల సుజాత బీమవరం నియోజకవర్గంలోనే ఉన్నా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. మరోవైపు ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ టీడీపీ నేతలకు అవమానం జరిగింది. పాస్‌పోర్ట్ కార్యాలయంలోకి మంత్రుల వెంట వెళ్లడానికి టీడీపీ రాష్ట్ర నాయకుడు మెంటే పార్థసారథి, కౌన్సిలర్లు మెంటే గోపి, నందమూరి ఆంజనేయులు, వీరవాసరం మండల టీడీపీ అధ్యక్షుడు వీరవల్లి చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీ పోలిశెట్టి సత్యనారాయణ (దాసు) తదితరులు ప్రయత్నించగా పోలీ సులు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీనితో కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయానికి స్థలం, భవనం ఇచ్చిన మమ్మల్ని అవమానిస్తారా? అని నిలదీశారు. ఆహ్వాన పత్రికలోనూ తమ నేతల పేర్లు వేయకుండా అవమానించారని, కార్యక్రమానికి వచ్చిన వారిని కూడా అడ్డుకోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నిస్తూ కార్యక్రమాన్ని బహిష్కరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ వారిని బుజ్జగించే ప్రయత్నం చేసినా వినలేదు. పదేపదే ఇరు పార్టీల వారు ఒకరినొకరు అవమానిం చుకునే విధంగా ప్రవర్తిస్తుండటంతో భవిష్యత్‌లో కలిసి పనిచేసే పరిస్థితులు సన్నగిల్లుతున్నాయి. ఇది లావుండగా.. కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన ప్రోటోకాల్ జాబితా ప్రకారం ఆహ్వాన పత్రిక, శిలాఫలకాలను అధికారులు తయారు చేయించారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇందులో తమకు సంబంధం లేకపోయినా.. టీడీపీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారనేది వారి వాదన. టీడీపీ నేతలు తొలినుంచీ తమను అడుగడుగునా అవమానాలకు గురి చేస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. వారేం చేసినా ఒప్పు.. మేం చేస్తే తప్పు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. శిలాఫలకంపై టీడీపీ నేతల పేర్లు వేయకపోవడాన్ని బీజేపీ నేతల ప్రతీకార చర్యగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మిత్రపక్షాల మధ్య చోటుచేసుకుంటున్న విభేదాలు చివరకు ఎటు దారి తీస్తాయనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. -
పాస్‌పోర్టు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి
- సుష్మకు మహమూద్ అలీ వినతి హైదరాబాద్: హైదరాబాద్‌లోని పాతబస్తీలో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో బుధవారం సుష్మాస్వరాజ్‌ను కలసి ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పిం చారు. అలాగే హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం కేంద్ర మైనార్టీ, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి అబ్బాస్ నఖ్వీని కలిసిన అలీ మైనార్టీల అభివృద్ధి కోసం అమలవుతున్న పథకాలకు చేయూత అందించాలని కోరారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ గురజాడ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్‌తో కలసి వివరాలు తెలిపారు. ఢిల్లీ టూర్లో సౌదీ అంబాసిడర్లతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశామన్నారు. -
‘జిల్లాకొక పాస్‌పోర్టు సేవా కేంద్రం’
వరంగల్: విద్యార్థులు, ఇతర రంగాల ప్రజలకు సేవలందించేందుకు త్వరలోనే ప్రతి జిల్లాలో ఒక పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ డిప్యూటీ రీజినల్ పాస్‌పోర్టు అధికారి మదన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం హన్మకొండలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29న మహబూబ్‌నగర్ జిల్లాలో పాస్‌పోర్టు మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నిట్ వరంగల్‌లో ఈ నెల 8, 9వ తేదీల్లో ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు మేళాకు 1,000 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇందులో 700 మంది నిట్ విద్యార్థులకు సంబంధించినవని చెప్పారు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి వెరిఫికేషన్‌కు పంపిస్తున్నామన్నారు. -
పాస్‌పోర్టులు 5 శాతమే
చీఫ్ పాస్‌పోర్ట్ అధికారి ముక్తేష్కుమార్ పర్దేశి, ఆర్పీవో డాక్టర్ శ్రీకర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రోజురోజుకీ విసృ్తతమవుతున్న విద్య, ఉపాధి అవకాశాల నేపథ్యంలో దేశంలో పాస్‌పోర్టుల కోసం గిరాకీ బాగా పెరిగినా వంద కోట్లకు పైగా ఉన్న భారతావనిలో ఐదు శాతం మందికి మాత్రమే పాస్‌పోర్ట్‌లు ఉన్నట్లు వెల్లడైంది. అందులోనూ దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి పాస్‌పోర్టులు పొందిన వారు 55 % వరకు ఉండటం గమనార్హం. పాస్‌పోర్ట్‌ల జారీ, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన, కరీంనగర్లో పాస్‌పోర్ట్ సేవా లఘు కేంద్రం ఏర్పాటుపై జాతీయ చీఫ్ పాస్‌పోర్ట్ అధికారి ముక్తేష్కుమార్ పర్దేశి, ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ శ్రీకర్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు తెలిపారు. ప్రస్తుతం దేశంలో చలామణిలో (వాల్యూడ్) ఉన్న పాస్‌పోర్ట్‌లు 5.19 కోట్లు మాత్రమేనని వివరించారు. అతి చిన్న వయసు వారిలో 2 రోజుల బిడ్డకు పాస్‌పోర్ట్ ఇవ్వగా పెద్ద వయసు వారిలో 116 ఏళ్ల వ్యక్తికి పాస్‌పోర్ట్ ఇచ్చినట్లు చెప్పారు. పాస్‌పోర్టు దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం నిబంధన వివరాలను స్థానిక భాషల్లోనూ త్వరలో వెబ్సైట్లో అందుబాటులోకి తేనున్నారు. కరీంనగర్లో పాస్‌పోర్ట్ సేవా లఘు కేంద్రం ఈనెల 8న ప్రారంభం కానుంది. జిల్లా వాసులు పాస్‌పోర్టు కోసం ఇక అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాదినుంచి ఈ-పాస్‌పోర్ట్ వచ్చే ఏడాది నుంచి దేశంలో ఈ-పాస్‌పోర్ట్ విధానం అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జారీ చేస్తున్న పాస్‌పోర్ట్‌లకే చివరి పేజీలో ఓ ఎలక్ట్రానిక్ చిప్‌ను అమరుస్తారు. పాస్పోర్ట్దారుడి ఫొటోలతోపాటు వేలిముద్రలు, సంతకం ఇందులో పొందుపరుస్తారు. నకిలీ పాస్‌పోర్ట్‌లకు ఆస్కారం ఉండదు. దీనికి సంబంధించి విదేశాంగ శాఖకు ఇప్పటికే ప్రతిపాదనలు అందాయి. కానిస్టేబుళ్లకు పామ్టాప్లు: ఇకపై పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ త్వరగా నిర్వహించేందుకు తనిఖీ కోసం వచ్చే కానిస్టేబుళ్లకు పామ్‌టాప్(ల్యాప్‌టాప్‌ల తరహా)లు అందిస్తారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ విధానం విజయవంతమైంది. ఇప్పటివరకు పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి పోలీస్ వెరిఫికేషన్ పత్రాలు పోస్ట్‌లో వెళుతున్నాయి. ఇకపై మెయిల్ ద్వారా పామ్టాప్కు పంపుతారు. సర్కిళ్ల వారీగా కానిస్టేబుళ్లు వీటిని అందుకుని విచారణ జరిపి ఎస్పీకి నివేదిక ఇస్తారు. అక్కడ వెరిఫికేషన్ తరువాత డిజిటల్ సంతకాలతో కూడిన పత్రాలను తిరిగి మెయిల్ ద్వారా పాస్‌పోర్ట్ కార్యాలయానికి చేరవేస్తారు. ఇదంతా 3 రోజుల్లో పూర్తవుతుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పైలట్ ప్రాతిపదికన ఈ విధానం ప్రారంభించనున్నట్టు శ్రీకర్‌రెడ్డి తెలిపారు. తొలి స్థానంలో హైదరాబాద్: పాస్‌పోర్ట్ కార్యాలయాల పరంగా హైదరాబాద్ పాస్‌పోర్ట్ ఆఫీసు 2013లో 6.4 లక్షల పాస్‌పోర్ట్‌లు జారీ చేసి దేశంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 4.6 లక్షల పాస్‌పోర్టుల జారీతో బెంగళూరు రెండో స్థానంలో ఉంది. రాష్ట్రాల పరంగా చూస్తే 7.84 లక్షల పాస్‌పోర్ట్‌లు జారీ చేసి ఆంధ్రప్రదేశ్ దేశంలో నాలుగో స్థానంలో ఉంది. కేరళలో 9.4 లక్షలు, తమిళనాడులో 8.5 లక్షలు, మహారాష్ట్రలో 8.2 లక్షల పాస్‌పోర్టులు జారీ చేశారు. రూ.30 కోట్లతో సికింద్రాబాద్‌లో కొత్త కార్యాలయం ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ఉన్న పాస్‌పోర్ట్ కార్యాలయం స్థానంలో కొత్త కార్యాలయాన్ని నిర్మించనున్నారు. దీనికోసం రూ.30 కోట్లు ఖర్చవుతుందని అంచనా. పాస్‌పోర్ట్ కార్యాలయంతోపాటు అధికారుల నివాస గృహాల సముదాయం కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. 2013లో పాస్‌పోర్ట్‌ల జారీ ఇలా - 2013లో జారీ చేసిన పాస్‌పోర్ట్‌లు 84.86 లక్షలు. ఇందులో భారత్‌లో 72.76 లక్షలు జారీ చేస్తే మిగతావి వివిధ దేశాల్లోని ఎంబసీలు, కాన్సులేట్‌ల్లో జారీ చేశారు. - పాస్‌పోర్ట్‌లు పొందుతున్న వారిలో 66% మంది పురుషులు కాగా 34 మంది మహిళలున్నారు. - 19% మంది విద్యార్థులు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. పట్టభద్రుల దరఖాస్తులు 29% పైనే. - సగటున పాస్‌పోర్టు దరఖాస్తుదారుల్లో 31 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఉన్నారు. - రాష్ట్రంలో తత్కాల్ దరఖాస్తుల సంఖ్య 30 శాతం నుంచి 5 శాతానికి పడిపోయింది. - దేశవ్యాప్తంగా 2013లో పాస్‌పోర్టుల జారీ ద్వారా రూ.వెయ్యి కోట్ల ఆదాయం లభించగా, హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం నుంచి రూ. 103 కోట్ల ఆదాయం సమకూరింది. -
ఆన్లైన్లో పాస్‌పోర్ట్ మేళా
సాక్షి, విశాఖపట్నం :పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు శుభవార్త. స్లాట్లు దొరకడం లేదని ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు కేంద్ర విదేశీ మంత్రిత్వశాఖ చల్లని వార్త మోసుకొచ్చింది. ‘మొబైల్ ఆన్లైన్ పాస్ పోర్ట్ సేవా క్యాంప్’ పేరిట ఈ నెల 8, 9 తేదీల్లో కాకినాడ జేఎన్టీయూ క్యాంపస్‌లోనూ, 8న విశాఖలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (పీఎస్కే)లోనూ ఓ కార్యక్రమం నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. కాకినాడలో రోజుకు 250 చొప్పున రెండు రోజుల్లో 500 మందికి, విశాఖలో జరిగే ఒక రోజు మేళాలో 600 మందికి (మొత్తం 1100) లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ పాస్‌పోర్ట్ సేవా మేళాను అభ్యర్థులు ఉపయోగించుకోవాలని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయ అధికారి ఎ.టి.మూర్తి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వాసులకు ఉపయోగపడేలా రెండు రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మేళా నిర్వహిస్తున్నారు. ఫ్రెష్/నార్మల్/రీ ఇష్యూ దరఖాస్తుల్ని ఆహ్వానిస్తారు. 8, 9 తేదీల్లో స్లాట్ కోసం అభ్యర్థులు ఆన్లైన్లో www.passportindia.com లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ రోజుకు స్లాట్ లభించే అభ్యర్థులు కాకినాడ జేఎన్టీయూ క్యాంపస్ అడ్మిన్ భవనం ఎదురుగా అలుమినీ ఆడిటోరియంలో అన్ని పత్రాల్నీ అందజేయాలి. ఇందుకు సంబంధించి ఈ నెల 5న సాయంత్రం 5.30 గంటలకు మాత్రమే స్లాట్ లభ్యమైనట్టు రూఢీ అవుతుంది. ఈ విషయాన్ని ఆన్లైన్లోనే అభ్యర్థులు పరిశీలించుకోవాలి. మేళాలో అభ్యర్థులే హాజరై బయోమెట్రిక్, ఫొటోలు తీసుకోవాలి. వీలుకాకపోతే అభ్యర్థులు రెండు కలర్ పాస్‌పోర్ట్ ఫొటోలు వెంట తీసుకెళ్లాలి. దరఖాస్తు రుసుంను వెబ్సైట్లో పేర్కొన్న విధంగా డెబిట్/క్రెడిట్, ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఎస్బీఐ చలాన్ల ద్వారా కట్టినా అనుమతిస్తారు. మేళాకు హాజరయ్యే ముందే ప్రింటవుట్‌ను తీసుకుని అన్ని వివరాలతో వెళ్లాలి. వాకిన్ (గతంలో దరఖాస్తు చేసుకున్నవారు), పీసీపీ, తత్కాల్, పెండింగ్ కేసులు, అపాయింట్మెంట్ దొరకని అభ్యర్థులు నిబంధనల ప్రకారం మేళాకు అనర్హులు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు 0891-2745746, 747 నెంబర్లలో కార్యాలయ పని వేళల్లో సంప్రదించవచ్చు. విశాఖలో నిర్వహించబోయే మేళాకు ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాల వాసులూ అర్హులే. పెండింగ్‌లో ఉన్న అభ్యర్థులు తమ పాత దరఖాస్తును రద్దు చేసుకుని మేళాలో పాల్గొనేవిధంగా (నిబంధనల ప్రకారం) దరఖాస్తు చేసుకోవచ్చు.