కమలంతో కయ్యం
► భీమవరంలో పాస్‌పోర్ట్ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి సుజాత దూరం
► టీడీపీ మంత్రుల పేర్లు లేకుండా శిలాఫలకం
► తమ్ముళ్ల తీరుకు ప్రతీకారమే అంటున్న విశ్లేషకులు
► ఆదినుంచీ తమను దూరం పెడుతున్నారంటున్న బీజేపీ నేతలు
► మిత్రపక్షాల మధ్య పెరుగుతున్న అగాధం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/భీమవరం : మిత్రపక్షాల మధ్య వైరం ముదిరి పాకాన పడుతోంది. భీమవరంలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా టీడీపీ నేతలు కమల నాథులతో బుధవారం కయ్యానికి దిగారు. జిల్లాలో తొలినుంచీ బీజేపీ, టీడీపీ నేతల మధ్య విభేదాలు పొడసూపుతూనే ఉన్నాయి. ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వారు మిత్రపక్షాన్ని అవమానించే చర్యలకు పాల్పడుతున్నారు. ఫలితంగా టీడీపీ, బీజేపీ మధ్య అగాధాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బహిరంగంగా ఒకరినొకరు దుయ్యబట్టుకోవడంతోపాటు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి మరీ మిత్రపక్షాలు విమర్శలు చేసుకుం టుండటంతో ఇరుపార్టీల మధ్య కలహాల కాపురం నడుస్తోంది. జెడ్పీ చైర్మన్ తన అనుమతి లేకుండా గూడెం నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి మాణిక్యాలరావు నిరసన వ్యక్తంచేసి వారం గడవకుం డానే మరో వివాదం తెరపైకి వచ్చింది.
ఈసారి ఈ వివాదం బీజేపీకి చుట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీహెచ్.అయ్యన్నపాత్రుడు, జిల్లాకు చెందిన మంత్రి పీతల సుజాత పేర్లు శిలాఫల కంపై వేయకపోవడం, బీజేపీకి చెం దిన ఇతర జిల్లాల ఎంపీల పేర్లను వేయడం భీమవరంలో తాజా వివాదానికి కారణమైంది.
తాజా వివాదం ఇలా
భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన పాస్‌పోర్ట్ లఘు సేవా కేంద్రాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి విజయకుమార్‌సింగ్ బుధవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ శిలాఫలకంపై తొలుత కేంద్ర మంత్రితోపాటు బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, ఎంపీలు గోకరాజు గంగరాజు, కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు పేర్లు వేయగా, టీడీపీకి చెందిన ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), మునిసిపల్ చైర్మన్ కొటికల పూడి గోవిందరావు పేర్లను మాత్రమే వేశారు. దీంతో టీడీపీ నేతలు భగ్గుమన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లాకు చెందిన రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత పేర్లు వేయలేదు. ఇన్‌చార్జి మంత్రి, జిల్లాకు చెందిన మంత్రి పేర్లు వేయకుండా అవమానించారంటూ టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు.
దీంతో ముందుగా తయారు చేసిన శిలాఫలకాన్ని హడావుడిగా మార్చి అయ్యన్నపాత్రుడు, పీతల సుజాత పేర్లను రాయించారు. ఉద్దేశపూర్వకంగానే తన పేరు వేయకుండా అవమానించారని భావించిన మంత్రి పీతల సుజాత బీమవరం నియోజకవర్గంలోనే ఉన్నా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. మరోవైపు ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ టీడీపీ నేతలకు అవమానం జరిగింది. పాస్‌పోర్ట్ కార్యాలయంలోకి మంత్రుల వెంట వెళ్లడానికి టీడీపీ రాష్ట్ర నాయకుడు మెంటే పార్థసారథి, కౌన్సిలర్లు మెంటే గోపి, నందమూరి ఆంజనేయులు, వీరవాసరం మండల టీడీపీ అధ్యక్షుడు వీరవల్లి చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీ పోలిశెట్టి సత్యనారాయణ (దాసు) తదితరులు ప్రయత్నించగా పోలీ సులు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీనితో కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయానికి స్థలం, భవనం ఇచ్చిన మమ్మల్ని అవమానిస్తారా? అని నిలదీశారు.
ఆహ్వాన పత్రికలోనూ తమ నేతల పేర్లు వేయకుండా అవమానించారని, కార్యక్రమానికి వచ్చిన వారిని కూడా అడ్డుకోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నిస్తూ కార్యక్రమాన్ని బహిష్కరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ వారిని బుజ్జగించే ప్రయత్నం చేసినా వినలేదు. పదేపదే ఇరు పార్టీల వారు ఒకరినొకరు అవమానిం చుకునే విధంగా ప్రవర్తిస్తుండటంతో భవిష్యత్‌లో కలిసి పనిచేసే పరిస్థితులు సన్నగిల్లుతున్నాయి. ఇది లావుండగా.. కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన ప్రోటోకాల్ జాబితా ప్రకారం ఆహ్వాన పత్రిక, శిలాఫలకాలను అధికారులు తయారు చేయించారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇందులో తమకు సంబంధం లేకపోయినా.. టీడీపీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారనేది వారి వాదన.
టీడీపీ నేతలు తొలినుంచీ తమను అడుగడుగునా అవమానాలకు గురి చేస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. వారేం చేసినా ఒప్పు.. మేం చేస్తే తప్పు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. శిలాఫలకంపై టీడీపీ నేతల పేర్లు వేయకపోవడాన్ని బీజేపీ నేతల ప్రతీకార చర్యగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మిత్రపక్షాల మధ్య చోటుచేసుకుంటున్న విభేదాలు చివరకు ఎటు దారి తీస్తాయనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.