pastor killed
-
పాస్టర్ హత్య గర్హనీయం
గుంటూరు కల్చరల్, న్యూస్‌లైన్ : వికారాబాద్‌లోని చర్చి పాస్టర్‌పై దాడి చేసి హత్య చేయడాన్ని బిషప్ గాలిబాలి తీవ్రంగా ఖండించారు. స్థానిక రింగ్‌రోడ్డులోని బిషప్ హౌస్‌లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాలిబాలి మాట్లాడుతూ వికారాబాద్‌లోని ఇవాంజిలికల్ పాస్టర్ సంజీవులుపై ఈనెల 11న నలుగురు వ్యక్తులు దాడి చేశారని, అనంతరం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న పాస్టర్ సోమవారం మరణించారని చెప్పారు. క్రైస్తవ సంఘాలన్నీ ఈ దుర్ఘటనను ఖండిస్తున్నాయన్నారు. పాస్టర్లకు ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు దాటినా ఇప్పటికీ నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదని ఆరోపించారు. పాస్టర్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆంధ్రప్రదేశ్ మైనార్టీ కమిషన్ ఉపాధ్యక్షులు రెవరెండ్ చంద్రబోస్ మాట్లాడుతూ క్రైస్తవ సంఘాల నాయకులు ఈ సంఘటనపై ముఖ్యమంత్రిని కలిసి దోషులపై చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. సెక్యులర్ భావాలు ఉన్న అందరూ ఇటువంటి ఘటనలను ఖండించాలన్నారు. సమావేశంలో రెవరెండ్ ఫాదర్ రాయప్ప, రెవరెండ్ ఉదయ్‌కుమార్, రెవరెండ్ రాజేష్, రెవరెండ్ జ్ఞానరత్నం, బిషప్ పీఆర్వో కనపాల జోసఫ్ పాల్గొన్నారు. -
మిస్టరీగా పాస్టర్ హత్య కేసు!
సాక్షి, రంగారెడ్డి న్యూస్‌లైన్ ప్రతినిధి: పాస్టర్ హత్య కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ఛేదించేందుకు పోలీసులకు ఎలాంటి క్లూ లభించకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదు. వికారాబాద్ పట్టణంలోని చర్చిలో గత శుక్రవారం దుండగుల చేతిలో గాయపడి ఆస్పతిలో చికిత్స పొందుతూ పాస్టర్ సంజీవులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన క్రైస్తవ సమాజాన్ని ఆందోళనకు గురిచేసింది. ఈ కేసును ఛేదించేందుకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించింది. హత్య జరిగిన తీరును పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు.. ఇది ప్రొఫెషనల్స్ పనేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆయనను హతమార్చిన వైనం.. వాడిన ఆయుధాలు.. పోలీసుల అనుమానాలను పెంచుతున్నాయి. లోపలి గదిలోంచి భార్య బయటకు వచ్చేలోగానే కొంచెంకూడా అలికిడి కాకుండా పాస్టర్‌పై దాడి చేసి తప్పించుకోవడం చూస్తుంటే ఇది సుపారీ ముఠా పనేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యలో ముగ్గురు పాల్గొని ఉంటారని.. పాస్టర్ భార్య చూసిన ఓ నిందితుడి ఊహాచిత్రం రూపొందించి దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. వివిధ కోణాల్లో విచారణ సాగిస్తున్న పోలీస్ యంత్రాంగం గతంలో పాస్టర్ పనిచేసిన చోట్ల శత్రువులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తును సాగిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో ఆయన పనిచేసిన ఆదిలాబాద్ జిల్లా మందమర్రి ప్రాంతానికి ఓ దర్యాప్తు బృందాన్ని పంపారు. -
చర్చిలో పాస్టర్ కాల్చివేత
బ్రెజిల్ లోని బెలో హారిజాంట్ నగరంలోని ఓ చర్చిలో దారుణం జరిగింది. అక్కడ ఓ ప్రొటెస్టెంటు పాస్టర్‌ను తలలో కాల్చి చంపేశారు. చార్లెస్ విడల్ డిసౌజా (34)కు అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స చేశారు. సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి కూడా ఆయన సజీవంగానే ఉన్నారు. కానీ తలలో బుల్లెట్ గాయం కావడంతో వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. యూనివర్సల్ చర్చ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వద్ద ఈ సంఘటన జరిగింది. డిసౌజా తన కార్యాలయంలో నెత్తుటి మడుగులో పడి ఉండగా చుట్టుపక్కల వారు చూశారు. అక్కడ గొడవ జరిగినట్లు కూడా కనిపించడంతో వెంటనే పోలీసులకు తెలిపారు. ఇద్దరు సాయుధులు చర్చిలోకి ప్రవేశించి కాల్పులు జరిపి, తర్వాత గుమ్మం బయట ఉంచిన కారులో పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.