పల్లెపల్లెనా పశుగ్రాస క్షేత్రాలు
- గ్రామాలు, మండలాల వారీగా వివరాలు సేకరించండి
- జేడీ డాక్టర్ సుదర్శన్కుమార్ ఆదేశం
- పశువైద్యుల డైరీ ఆవిష్కరణ
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో కరువు తీవ్రత ఎక్కువగా ఉందని, ఈ పరిస్థితుల సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పశు సంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుదర్శన్కుమార్ అన్నారు. గ్రాసం కొరత ఏర్పడకుండా చూడాలని, ఇందులో భాగంగా అన్ని గ్రామాల్లో అవసరమైన మేరకు పశుగ్రాసం క్షేత్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల వారీగా ఇచ్చిన లక్ష్యాలను అధిగమించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. శుక్రవారం గోకులం సమావేశ మందిరంలో కర్నూలు డివిజన్ పశువైద్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు నేపథ్యంలో గ్రాసం కొరత ఏర్పడకుండా సైలేజీ, మొలకగడ్డి, అజొల్లా పెంపకాన్ని ప్రోత్సహించాలన్నారు. దాణ, దాణామృతం అవసరాన్ని గుర్తించి వివరాలు అందించాలన్నారు. మండలాలు, గ్రామాల వారీగా పశుగ్రాసం కొరతను ఎదుర్కొనే రైతుల వివరాలు సేకరించాలన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద పాడి పశువుల పంపిణీకి అర్హలైన ఎస్సీలను గుర్తించాలన్నారు. అనంతరం వెటర్నేరియన్ 2017 ప్లానర్ డైరీని జేడీ ఆవిష్కరించారు. డీడీ చిన్నయ్య, కర్నూలు ఏడీ సీవీ రమణయ్య, ఏడీలు చంద్రశేఖర్, రాజశేఖర్, నారాయణస్వామి, రామిరెడ్డి, పశువైద్యుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆర్నాగరాజు, జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు.