అయినా...తీరు మారలేదు!
జలమండలిలో అర్హతలేని కంపెనీకే ‘ఫెర్రిక్ ఆలం’ సరఫరా టెండర్?
సిటీబ్యూరో: జలమండలిలో పటాన్చెరు నిర్వహణ డివిజన్ పరిధిలో నీటి శుద్ధికి వినియోగించే రూ.1.23 కోట్ల విలువైన ఫెర్రిక్ఆలం సరఫరా టెండరును గతంలో సరఫరా చేసిన అనుభవం, అర్హత, పీసీబీ గుర్తింపు లేని కంపెనీకే కట్టబెట్టేందుకు అధికారులు యత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సదరు టెండరుకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలపై దుమారం చెలరేగడంతో ఆర్థిక బిడ్లు తెరిచే ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాము చేసిన పొరపాట్లు బయటికి పొక్కకుండా ఈ ప్రక్రియను వాయిదా వేసినట్లు సమాచారం.వివాదం సద్దుమణిగాక తాము అనుకున్న కంపెనీకే సరఫరా టెండరును కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం. ఈవిషయంలో లెక్కకు మిక్కిలి ఫిర్యాదులందినా అధికారులు వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.
టెండరు నిబంధనల ప్రకారం గతంలో 61.87 లక్షల విలువైన ఆలంను సరఫరా చేసిన కంపెనీకి మాత్రమే ఈ టెండరులో పాల్గొనే అర్హత ఉంటుంది. కానీ అధికారులు ఓ అర్హత లేని కంపెనీకి ఈ టెండరును కట్టబెట్టేందుకు ఈ నిబంధనను పక్కనబెట్టడం సంచలనం సష్టిస్తోంది. ఈవ్యవహారంలో బోర్డు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని అనుభవం,అర్హత గల కంపెనీకి మాత్రమే ఆలం సరఫరా టెండరును కట్టబెట్టాలని కార్మికసంఘాలు కోరుతున్నాయి.