దారమే కదా అనుకుంటే.. పీక తెగ్గోస్తోంది!
ఇక్కడి మాంజా... కోల్‌కతాలో పంజా.. సిటీ నుంచి భారీగా స్మగ్లింగ్ తక్కువ ధరకు విక్రయిస్తున్న వ్యాపారులు.. పతంగ్‌లకు వాడుతున్న అక్కడి యువత ఎగరేస్తుండటంతో పలువురికి గాయాలు.. కట్టడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు
హైదరాబాద్‌లో తయారవుతున్న గాజు రజనుతో కూడిన మాంజా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పంజా విసురుతోంది. అక్కడి కరయ ప్రాంతంలో ఉన్న మా ఫ్లైఓవర్ వద్ద దీన్ని వినియోగించి అనేక మంది పతంగులు ఎగరేస్తున్నారు. ఫలితంగా ఫ్లైఓవర్ పై ప్రయాణిస్తున్న వాహనచోదకులు గాయపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 46 మంది మాంజా కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కరయ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మరోపక్క హైదరాబాద్ నుంచి అక్రమ రవాణా అవుతున్న మాంజాను అడ్డుకోవడానికీ దాడులు ప్రారంభించారు.
– సాక్షి, హైదరాబాద్
ఆ ఫ్లైఓవర్ వద్ద దారుణంగా..
ఈ అక్రమ మాంజా వినియోగిస్తుండటం కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్స్‌గా మార్చేసింది. ప్రధా నంగా కరయ–టాప్సియ ప్రాంతాల మధ్య ఉన్న మా ఫ్లైఓవర్ వద్ద పరిస్థితి మరీ దారుణం. ఈ ఫ్లైఓవర్ చుట్టు పక్కల ఉన్న నివాస ప్రాంతాల్లోని ఇళ్ల పైకి ఎక్కు తున్న యువత ప్రమాదకరమైన మాంజాతో గాలి పటాలు ఎగరేస్తున్నారు. అనేక సందర్భాల్లో దీనితో ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనచోదకులు క్షతగాత్రులుగా మారుతున్నారు. ఈ మధ్య ఓ వైద్యుడి పీక కోసుకుపోయినంత పనైంది. ఇలా దాదాపు 46 మంది తీవ్రంగా గాయపడటంతో కరయ పోలీసులు అప్రమత్తమయ్యారు. పతంగులను ఎగరవేసే వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృం దాలను రంగంలోకి దింపారు. ఒక్కోటీమ్‌లో ఏఎస్సై, కానిస్టేబుల్, వాలంటీర్ గ్రీన్ పోలీసు కూడా ఉంటున్నారు.
38 మందిని పట్టుకున్న బృందాలు..
ఈ ప్రత్యేక బృందాలు గడిచిన నెల రోజుల్లో మా ఫ్లైఓవర్ చుట్టు పక్కల పతంగులు ఎగరేస్తున్న 38 మందిని పట్టుకున్నారు. వీరంతా 13 నుంచి 20 ఏళ్ల మధ్య వయస్కులే కావడంతో వారిని గుర్తించినా ఎలాంటి కేసులూ నమోదు చేయలేదు. పోలీసుస్టేషన్లకు తరలించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు హెచ్చరికలు జారీ చేసి విడిచిపెట్టారు. మరోపక్క ఈ తరహా మాంజాలు విక్రయిస్తున్న దుకాణాల పైనా కోల్‌కతా పోలీసులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ తరహా మాంజా తయారీని ఆపాలని కోరుతూ కోల్‌కతా పోలీసులు లేఖ రాయాలనీ అక్కడి అధికారులు భావిస్తున్నారు.
ఇక్కడ తగ్గిన బెడద...
నగరంలో ఏటా జరిగే సంక్రాంతి వేడుకల్లో జరిగే పతంగుల ఎగురవేత పోటీలు ప్రతిష్టాత్మకంగా ఉంటాయి. దాదాపు ప్రతీ వ్యక్తీ తన పతంగే ఎక్కువ ఎత్తుకు వెళ్లాలని ఆశించడంతో పాటు ఎదుటి వారి గాలిపటాలకు చెందిన దారాలు తెంపాలని యత్నిస్తుంటారు. దీనికోసం గతంలో గాజు రజనుతో కూడిన మాంజాలు వాడేవారు. ఇవి కరెంటు వైర్లు, చెట్లకు చుట్టుకుపోవడంతో పాటు రోడ్ల పైనా ఎగురుతూ ఉండేవి. ఫలితంగా వాహనచోదకులు, పక్షులు తీవ్రంగా గాయపడిన ఉదంతాలు నమోదయ్యాయి.దీంతో పెద్ద స్థాయిలో దుమారం రేగి ప్రభుత్వ యంత్రాంగాలు, పోలీసులు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఫలితంగా ఇక్కడ ఈ మాంజా వాడకం గణనీయంగా తగ్గినా తయారీ మాత్రం ఆగలేదు.
ఈ మాంజాకే డిమాండ్ ఎక్కువ..
కోల్‌కతాలోని వివిధ ప్రాంతాల్లో లభిస్తున్న సురక్షిత మాంజా కంటే హైదరాబాద్ నుంచి తరలుతున్న మాంజాకే డిమాండ్ ఎక్కువ. అక్కడి మాంజా కట్ట ఖరీదు రూ.70 నుంచి రూ.100 వరకు ఉంటోంది. హైదరాబాద్ నుంచి అక్రమ రవాణా చేసింది కేవలం రూ.25 నుంచి రూ.35లకే విక్రయిస్తున్నారు. దీంతో యువత దీనిపైనే మక్కువ చూపుతున్నారు. కోల్‌కతాకు ఢిల్లీ, సూరత్, బెంగళూరుల నుంచీ మాంజా స్మగ్లింగ్ అవుతున్నప్పటికీ హైదరాబాద్ నుంచి వెళ్తున్నది నైలాన్ తాడుకు పై పూతగా గాజు, లోహపు రజను ఉంటోంది. ఫలితంగా ఇది అత్యంత ప్రమాదకరమైందిగా మారుతోంది. ఈ తరహా
మాంజాల క్రయవిక్రయాలపై కోల్‌కతాలో నిషేధం విధించినా రైళ్లు, బస్సులతో పాటు పార్సిళ్ల ద్వారా అక్రమంగా తరలి వెళ్తుండటంతో అక్కడ ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది.