‘పతంగి’ సర్దుబాటు!
సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలతో మజ్లిస్ మంతనాలు..
తాము పోటీ చేయని చోట వేరే వారికి ‘పతంగి’ ఇస్తే అభ్యంతరం లేదని ఈసీకి లేఖ
సాక్షి, హైదరాబాద్: ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీకి ఈ సారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ‘పతంగి’ చిహ్నం సర్దుబాటు కానుంది. ఇటీవల రాష్ట్రంలోని 294 అసెంబ్లీ, 42 లోక్‌సభ స్థానాలకు పతంగి చిహ్నాన్ని పొందిన సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి.. తాము పోటీ చేయని స్థానాల్లో మజ్లిస్ పార్టీకి పతంగి గుర్తు కేటాయిస్తే అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్‌కు లేఖ అందించింది. దీంతో రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే మజ్లిస్ అభ్యర్థులకు ఈసారి ఎన్నికల్లో పతంగి చిహ్నాన్ని కేటాయించేందుకు ఎన్నికల కమిషన్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎంఐఎంకు ప్రతిఎన్నికల్లో ‘ఎవ్వరికీ కేటాయించని’ చిహ్నాల్లో (ఫ్రీ సింబల్స్) పతంగిని ఎన్నికల కమిషన్ కేటాయిస్తూ వచ్చేది.
సాధారణ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో ఆరు శాతం గానీ, లేదా అసెంబ్లీ స్థానాల్లో మూడు శాతం సీట్లను గానీ నెగ్గి ఉంటేనే.. ఒకసారి కేటాయించిన చిహ్నాన్ని శాశ్వతంగా ఆ పార్టీకే ఉంచుతారు. అయితే అసెంబ్లీ స్థానాల్లో మూడు శాతం సీట్లు అంటే.. కనీసం 9 అసెంబ్లీ స్థానాలు గెలిచి ఉండాలి. ఎంఐఎం ఏడు అసెంబ్లీ స్థానాలకే పరిమితమైనందున శాశ్వత చిహ్నం కేటాయించటానికి అవకాశం లేకపోయింది. ఈసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల విషయంలో మజ్లిస్ పార్టీకన్నా ముందుగా.. ఇటీవలే కొత్త పార్టీగా నమోదైన సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పతంగి ఎన్నికల చిహ్నంపై అసక్తి కనబరుస్తూ ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసుకుంది. దీంతో రాష్ట్రంలోని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ కోరిన చిహ్నాన్ని కేటాయిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ విషయం తెలిసిన మజ్లిస్ నేతలు సమైకాంధ్ర సమితి పార్టీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. సమైకాంధ్ర సమితి ప్రతినిధులు ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి తాము పోటీ చేయని స్థానాల్లో మజ్లిస్‌కు కూడా తమకు కేటాయించిన చిహ్నం కేటాయిస్తే అభ్యంతరం లేదని చెప్పారు.
అసద్‌తో సమితి నేతలు భేటీ: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఒకే గుర్తుపై పోటీ చేసే అవకాశం ఉన్న కారణంగా పరస్పర సహకారంపై చర్చించేందుకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ మరో ఇద్దరు బాధ్యులు శనివారం దారుస్సలాంలో భేటీ అయ్యారు. మజ్లిస్ పోటీ చేసే స్థానాల్లో పూర్తి సహకారం అందిస్తామని.. తాము బరిలో దిగే స్థానాల్లో కూడా సహకారం అందించాలని కోరారు. అందుకు అసద్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.