patanjali products
-
పతంజలి ప్రమోటర్ల వాటాలు సీజ్
న్యూఢిల్లీ: ప్రజల వాటా కనీసం 25 శాతం ఉండాలన్న నిబంధన అమలులో విఫలమైనందుకు పతంజలి ఫుడ్స్ ప్రమోటర్ల వాటాలను ఎన్ఎస్ఈ, బీఎస్ఈ స్తంభింప (ఫ్రీజ్) చేశాయి. ఈ చర్య కంపెనీ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపించదని పతంజలి ఫుడ్స్ పేర్కొంది. పతంజలి ఆయుర్వేద్ సహా 21 ప్రమోటర్ సంస్థల వాటాలను స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు ఫ్రీజ్ చేసినట్టు పతంజలి అంతకుముందు ప్రకటించింది. ‘డిస్క్లోజర్’ నిబంధనల కింద స్టాక్ ఎక్సేంజ్‌లకు తాజా విషయాన్ని తెలియజేసింది. కనీస ప్రజల వాటా నిబంధన అమలుకు కట్టుబడి ఉన్నట్టు ప్రమోటర్ల నుంచి తమకు సమాచారం అందినట్టు పతంజలి ఆయుర్వేద్ తెలిపింది. ప్రజల వాటాను పెంచేందుకు మెరుగైనది ఏదనే విషయమై వారు చర్చిస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే కొన్ని నెలల్లో ఈ నిబంధనను అమలు చేయనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం పతంజలి ఫుడ్స్‌లో ప్రమోటర్లకు 80.82 శాతం వాటా ఉంది. నిబంధనల ప్రకారం 75% మించకూడదు. అంటే మరో 5.82% వాటా విక్రయించాల్సి ఉంటుంది. నేపథ్యం..: రుచి సోయా ఇండస్ట్రీస్ (పతంజలి ఫుడ్స్ పూర్వపు పేరు)ని దివాలా పరిష్కార ప్రక్రియ కింద 2019 సెప్టెంబర్‌లో పతంజలి గ్రూప్ సొంతం చేసుకుంది. దీంతో సంస్థలో ప్రమోటర్లు, ప్రమోటర్ల సంస్థలకు 98.87 శాతం వాటా లభించింది. 2022 మార్చిలో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కు పతంజలి ఫుడ్స్ వచ్చింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ. 648 చొప్పున 6.61 కోట్ల షేర్లను విక్రయించింది. దీంతో ప్రజల వాటా 19.18 శాతానికి పెరిగింది. నిబంధనల ప్రకారం 2022 డిసెంబర్ 18 నాటికి ప్రజల వాటా 25%కి చేర్చాల్సి ఉంది. మరో ఎఫ్‌పీవో: బాబా రామ్‌దేవ్ ఏప్రిల్‌లో మరో విడత ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) చేపట్టనున్నట్టు పతంజలి ఫుడ్స్ ప్రకటించింది. తద్వారా ప్రజల వాటా కనీసం 25% ఉండాలన్న నిబంధనను అమలు చేస్తామని తెలిపింది. పతంజలి గ్రూప్ అధినేత బాబా రామ్‌దేవ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఇన్వెస్టర్లు ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదన్నారు. పతంజలి ఫుడ్స్ కార్యకలాపాలు, ఆర్థిక పనితీరుపై ఎక్సే్ఛంజ్‌ల చర్య ప్రభావం చూపించదని భరోసా ఇచ్చారు. తాము 6% వాటాలను తగ్గించుకుంటామని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడమే జాప్యానికి కారణమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిశాక ఏప్రిల్‌లో ఎఫ్‌పీవో చేపడతామన్నారు. -
ఒప్పందం
నందిపేట మండలం లక్కంపల్లి సెజ్ భూముల్లో ప్రతిష్టాత్మకమైన పతంజలి గ్రూపు ఆహారశుద్ధి కేంద్రం ఏర్పాటుకు మరో అడుగు ముందుకు పడింది. బుధవారం ఎంపీ కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలు పతంజలి సీఎండీ రాందేవ్ బాబా, సీఈవో బాలకృష్ణతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. అనం తరం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పతంజలి గ్రూప్ బాధ్యులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో స్థానికంగా జిల్లా రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పతంజలి గ్రూపు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు రైతులు తమ పంట ఉత్పత్తులన్నీ ఒకే చోట అమ్ముకునేందుకు వీలుంది. పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమంది యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. దళారుల చేతిలో మోసపోకుండా రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా పతంజలి కంపెనీవారికి అమ్ముకోవచ్చు. ముఖ్యంగా పసుపు రైతులకు కష్టాలు తీరుతాయి. ఆర్మూర్: దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న పతంజలి గ్రూప్ వారి ఆహారశుద్ధి కేంద్రాన్ని ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని నందిపేట మండలం లక్కంపల్లి సెజ్ భూముల్లో ఏర్పాటు చేయడానికి సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గల పతంజలి కేంద్ర కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిలు పతంజలి సీఎండీ రామ్‌దేవ్ బాబా, సీఈవో ఆచార్య బాలకృష్ణతో బుధవారం సమావేశమయ్యారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించిన అనంతరం పతంజలి గ్రూప్ బాధ్యులతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం పసుపు ఉత్పత్తిలో దేశంలోనే మంచి స్థానంలో ఉండటంతో పాటు నాణ్యమైన పసుపు ఇక్కడ పండుతుండటంతో ఆయుర్వేద, ఆహార ఉత్పత్తులను పెద్దఎత్తున తయారు చేస్తున్న పతంజలి గ్రూప్‌ను ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఎంపీ కవిత స్వయంగా రామ్‌దేవ్ బాబా వద్దకు వెళ్లి గతేడాది నవంబర్‌లో వినతి పత్రాన్ని అందజేశారు. ఎంపీ కవిత ఆహ్వానంమేరకు గతేడాది నవంబర్ 15న జిల్లాకు వచ్చిన పతంజలి గ్రూప్ సీఈవో బాలకృష్ణ ఆర్మూర్ ప్రాంతంలో, నందిపేట మండలం లక్కంపల్లిలో పర్యటించి ఇక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం హరిద్వార్‌లోని రామ్‌దేవ్ బాబాతో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రాథమికంగా ఎంవోయూ చేసుకునేందుకు అధికారులతో రావాల్సిందిగా ఎంపీ కవితను కోరారు. దీంతో ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఎస్ ఐసీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, నందిపేట మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు హరిద్వార్‌కు వెళ్లారు. హరిద్వార్‌లో తమ పరిశ్రమలలో వస్తు ఉత్పత్తి కేంద్రాలు, ప్యాకింగ్ యూనిట్లు, పరిశోధన విభాగాలు, మందుల తయారీ కేంద్రాలను ఎంపీ కవితతో పాటు వచ్చిన బృందానికి చూపించారు. యువతకు ఉపాధి అవకాశాలు.. లక్కంపల్లిలో పతంజలి గ్రూప్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ (ఆహార శుద్ధి కర్మాగారం)లో పసుపు, మిర్చి, మక్కలు, సోయాబీన్ తదితర సుగంధ ద్రవ్య, తృణ ధాన్యాలను సేకరించి శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన ధాన్యాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పతంజలి యూనిట్లకు సరఫరా చేస్తారు. లక్కంపల్లిలో పరిశ్రమ ఏర్పాటు చేయడంతో పతంజలి వారికి కావాల్సిన పసుపు, మిర్చి, సోయాబీన్, మక్కలు తదితర నాణ్యతతో కూడిన పంటలు పెద్దఎత్తున ఒకే చోట లభించనున్నాయి. అలాగే ఈ పరిశ్రమ ఏర్పాటుతో రైతులు కూడా లబ్ధి పొందనున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాంత రైతులు తాము పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోకుండా నేరుగా కంపెనీకి అమ్ముకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. పసుపు రైతులకు మంచిరోజులు.. జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో పసుపు పంటను పండిస్తున్నారు. వాణిజ్య పంట అయిన పసుపునకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఔషధాల తయారీ, కాస్మోటిక్స్‌ల తయారీలో పసుపును ఉపయోగిస్తుంటారు. జిల్లాలో రైతులు జూన్‌లో పసుపు పంటను విత్తుతారు. తొమ్మిది నెలల్లో పంట చేతికి వస్తుంది. రైతులు పాటించే మెరుగైన యాజమాన్య పద్ధతులను బట్టి ఎకరానికి 12 నుంచి 20 క్వింటాళ్ల పసుపు దిగుబడి వస్తుంది. రైతులు వ్యయ, ప్రయాసలకోర్చి పండించిన పంటను నిజామాబాద్‌తో పాటు మహారాష్ట్ర లోని సాంగ్లీ మార్కెట్లో పంటను అమ్ముతుంటారు. దీంతో రవాణా ఖర్చులు రైతులకు అదనంగా పడుతున్నాయి. పసుపు పంటను పండించిన రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఏటా ఆర్థికంగా నష్టపోతున్నారు. పతంజలి పరిశ్రమల ఏర్పాటుతో పసుపు రైతుల కష్టాలు తీరి మంచిరోజులు రానున్నాయి. రైతులకు మేలు.. – ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో పసుపు రైతులకు మంచి రోజులు రానున్నాయి. ఎంపీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఇప్పటికే పసుపు పండించే నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాం. పతంజలి ఉత్పత్తుల కోసం పసుపు కొనుగోలు, పసుపు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఈ ప్రాంత యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సైతం లభించనున్నాయి. -
పతంజలి ఉత్పత్తులు నాణ్యత పరీక్షల్లో ఫెయిల్!
బాబా రాందేవ్ స్థాపించిన పతంజలి సంస్థ ఉత్పత్తులు సహా దాదాపు 40 శాతం వరకు ఆయుర్వేద ఉత్పత్తులు నాణ్యత పరీక్షలలో విఫలం అయినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసింది. హరిద్వార్‌కు చెందిన ఆయుర్వేద, యునానీ కార్యాలయం ఈ పరీక్షలు చేసింది. 2013 నుంచి 2016 వరకు మొత్తం 82 శాంపిళ్లు సేకరించి పరీక్షించగా, వాటిలో 32 నాణ్యత పరక్షీలలో విఫలమయ్యాయి. పతంజలి సంస్థ వారి దివ్య ఆమ్లా జ్యూస్, శివలింగి బీజ్ లాంటి ఉత్పత్తులలో కూడా నాణ్యత తగినంతగా లేదని తేలింది. పశ్చిమబెంగాల్లోని పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ వాళ్లు నిర్వహించిన నాణ్యత పరీక్షలలో కూడా ఆమ్లా జ్యూస్ విఫలం కావడంతో గత నెలలో సైనిక దళాల క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ (సీఎస్డీ) నుంచి దాన్ని ఉపసంహరించుకున్నారు. నీళ్లలో కరిగే పదార్థాలలో ఉన్న క్షారతను పరీక్షించడానికి చూసే పీహెచ్ విలువ.. ఆమ్లా జ్యూస్‌లో ఉండాల్సిన దానికంటే తక్కువ ఉందని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ల్యాబ్ నివేదిక తెలిపింది. 7 కంటే తక్కువ పీహెచ్ విలువ ఉన్న ఉత్పత్తుల వల్ల ఎసిడిటీ, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శివలింగి బీజ్‌లో 31.68 శాతం వేరే పదార్థాలు ఉన్నాయన్నారు. అయితే ఈ ఆరోపణలను పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ ఖండించారు.శివలింగి బీజం అనేది సహజమైన విత్తనమని, అందులో కల్తీ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. పతంజలి సంస్థ పేరు ప్రతిష్ఠలను మంటగలిపేందుకు ఇలా తప్పుడు నివేదికలు ఇచ్చారన్నారు. ఇటీవలి కాలంలో ఉత్తరాఖండ్ ఆయుర్వేద ఉత్పత్తుల కేంద్రంగా మారింది. ప్రధానంగా హరిద్వార్, రిషికేశ్లలోనే వెయ్యిమందికి పైగా ఆయుర్వేద డీలర్లు, ఉత్పత్తిదారులు, సరఫరా దారులు ఉన్నారు. -
బీఎస్ఎఫ్ జవాన్లకు పతంజలి ఉత్పత్తులు
న్యూఢిల్లీ: ఇప్పటికే యోగా నైపుణ్యాన్ని ఒంటబట్టించుకున్న బీఎస్ఎఫ్ దళాలు ఇకపై పతంజలి ఉత్పత్తులను వినియోగించనున్నాయి. ఢిల్లీలోని బీఎస్ఎఫ్ క్యాంపులలో తొలి పతంజలి ఉత్పత్తుల దుకాణాన్ని ప్రారంభించిన సందర్భంగా బీఎస్ఎప్ భార్యల సంక్షేమ సంఘం.. పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న డజనుకుపైగా బీఎస్ఎఫ్ క్యాంటీన్లలో పతంజలి ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నారు. -
‘పతంజలి’కి తెలంగాణ ముడిసరుకు: కవిత
హైదరాబాద్: పతంజలి సంస్థ త్వరలో తెలంగాణ సర్కారుతో ఒప్పందం కుదుర్చుకోనుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ కేంద్రంలో తయారుచేసే ఉత్పత్తులకు అవసరమైన వ్యవసాయ సంబంధ ముడి సరుకును తెలంగాణ నుంచి కొనుగోలు చేసేందుకు మార్గం సుగమమవుతోంది. యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి సంస్థ ప్రతినిధులతో త్వరలోనే ఒక అంగీకారానికి రానున్నట్లు ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో పండే పంటలు, ఉత్పత్తులపై ఆ సంస్థ కోరిన సమాచారాన్ని అందించామన్నారు. త్వరలోనే ఆ సంస్థ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పండే పంటలు దొరికే ఉత్పత్తులను వివరించి ఒక స్పష్టతకు రానున్నట్లు వివరించారు. నిజామాబాద్‌లో గనుక వారు ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకునే వీలు కల్పిస్తామన్నారు. వచ్చే నెలలో సంస్థ ప్రతినిధులతో జరిగే సమావేశంలో నిజామాబాద్ ప్లాంట్‌పై ఒక స్పష్టత వస్తుందన్నారు. ఆ జిల్లాలో ప్లాంట్ పెడితే వారికి అవసరమైన ముడి సరుకు అధిక మోతాదులో లభిస్తుందని, అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాకు నాగ్‌పూర్‌తో రైలు రవాణా సౌకర్యం కూడా ఉందని చెప్పారు. జిల్లాలోని పసుపు రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీ కవిత వివరించారు. -
రామ్‌దేవ్ అంటే జనానికి కుళ్లు
న్యూఢిల్లీ: 'బొక్కల పొడి తింటే మనిషి బలంగా తయారవుతాడనుకుంటే దాన్ని తినడంలో తప్పేముంది? దేశానికి మేలు చేసే అలాంటి ఉత్పత్తులు తయారుచేస్తోన్న రామ్ దేవ్ గొప్పవాడు అనడంలో తప్పేముంది? అయినా జనం రామ్ దేవ్ పేరు చెబితే కుళ్లుకుంటారు. ఎందుకంటే ఆయన అత్యున్నత విజయాలు సాధించిన వ్యక్తి గనుక' ఈ మాటలు ఏ బీజేపీ నేతలో, ఆర్ఎస్ఎస్ వాదులో అనేదుంటే అసలిది వార్తకానేకాకపోయేది. అవును. ఒకప్పుడు రామ్ దేవ్ పేరు చెబితే అంతెత్తు ఎగిరపడ్డ బిహారీ నేత, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్.. యోగా గురు విషయంలో ఇప్పుడు పూర్తిగా మారుమనసు పొందారు. ప్రతిఫలంగా రామ్ దేవ్ లాలూ ముఖానికి క్రీమ్ రాశారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని రామ్ దేవ్ నివాసంలో ఈ దృశ్యాలు కనిపించాయి. ఏం పనిమీద వచ్చారో తెలియదుకాదీ, ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్ ఈ రోజు ఉదయాన్నే యోగా గురు రామ్ దేవ్ ఇంటికి వచ్చారు. సహజంగానే లాలూ చుట్టూ తచ్చాడే మీడియా మైకులతో సహా ఇద్దరినీ పలకరించింది. రామ్‌దేవ్ సైలెంట్ గానే ఉన్నారు. లాలూ మాత్రం తనదైన శైలిలో .. 'ఆయన (రామ్ దేవ్) ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. పతంజలి ప్రాడక్ట్స్ మీద ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు. నేనే మంటానంటే.. బొక్కలు తినడం ఆరోగ్యానికి మంచిదైతే, అలా చెయ్యడంలో తప్పేముంది? ఇదంతా ఆయన ఎదుగుదల గురించే. జనం రామ్ దేవ్ పేరుచెబితే కుళ్లుకునేది ఇందుకే' అంటూ యోగాగురును ఆకాశానికి ఎత్తేశారు లాలూ. ఈ సందర్భంగా రామ్ దేవ్ తాను రూపొందించిన ఫేస్ క్రీమ్ ను లాలూ ముఖానికి రాశారు. దీంతో అనధికారికంగా లాలూ రామ్ దేవ్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ అయినట్లయింది. 'ఇప్పటికే ఫుల్ గ్లామరస్ గా కనిపించే లాలూ ఇకపై మరింత గ్లామరస్ గా కనిపిస్తే చూడటం మనవల్ల అయ్యేపనేనా?' అని అనుకున్నారట అక్కడే ఉన్న ఇంకొందరు! ఏది ఏమైనా నచ్చితే కీర్తించడం, నచ్చకుంటే మోహమాటం లేకుండా నిందించడం ఒక్క లాలూకే చెల్లింది. గతంలో లాలూ.. రామ్ దేవ్ ను పెట్టుబడిదారునిగా, ఫక్తు వ్యాపారవేత్త అభివర్ణించిన సంగతి తెలిసిందే. రామ్ దేవ్ ఉత్పత్తుల్లో ఎముకల చూర్ణం కలుస్తుందని వార్తలు వచ్చినప్పుడు కూడా లాలూ వాటిని ఖండించిన విషయం విదితమే. -
నెస్లేను తరిమేస్తా, కోల్గేట్కు గేట్ పెడతా
న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబా ఇప్పుడు ఆహార పదార్థాల వ్యాపార రంగంలోనూ తిరుగులేని బిజినెస్ మ్యాన్‌గా దూసుకుపోతున్నారు. పతంజలి గ్రూప్ ప్రొడక్ట్స్‌తో ఇప్పటికే కోల్గేట్, నెస్లే వంటి బహుళ జాతి సంస్థలకు ఎసరు పెట్టిన ఆయన తాజాగా మరో శపథం చేశారు. దేశం నుంచి 'నెస్లే' పక్షిని తరిమేస్తానని, 'కోల్గేట్'కు దేశంలోకి రాకుండా గేటు పెట్టేస్తానని, వాటిని భారత్‌లో లేకుండా చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 10వేల కోట్ల టర్నవర్ సాధించడమే పతంజలి కంపెనీ లక్ష్యమని ఆయన మంగళవారం ప్రకటించారు. పతంజలి సంస్థ ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్ గా మారిందని ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో అన్నారు. రాందేవ్ 2012 మార్చి నుంచి పతంజలి కంపెనీ ద్వారా పలు ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) ప్రొడక్ట్స్‌ను దేశంలో మార్కెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. టూత్ పేస్ట్, న్యూడిల్స్, నెయ్యి వంటి పలు రకాల ఉత్పత్తులతో పతంజలి కంపెనీ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. ఈ కంపెనీ 2011-12లో రూ. 446 కోట్లు, 2012-13లో రూ. 850 కోట్లు, 2013-14లో రూ. 1200 కోట్లు, 2014-15లో రూ. 2006 కోట్ల టర్నోవర్ సాధించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 150 శాతం వృద్ధితో రూ. ఐదువేల కోట్ల టర్నోవర్‌ను పతంజలి గ్రూప్ సాధించనుంది.