ఒప్పందం | Agreement for Patanjali Industries in Lakkapalli Sez | Sakshi
Sakshi News home page

ఒప్పందం

Published Thu, Nov 16 2017 10:01 AM | Last Updated on Thu, Nov 16 2017 10:52 AM

Agreement for Patanjali Industries in Lakkapalli Sez - Sakshi

నందిపేట మండలం లక్కంపల్లి సెజ్‌ భూముల్లో ప్రతిష్టాత్మకమైన పతంజలి గ్రూపు ఆహారశుద్ధి కేంద్రం ఏర్పాటుకు మరో అడుగు ముందుకు పడింది. బుధవారం ఎంపీ కవిత, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలు పతంజలి సీఎండీ రాందేవ్‌ బాబా, సీఈవో బాలకృష్ణతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. అనం తరం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పతంజలి గ్రూప్‌ బాధ్యులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో స్థానికంగా జిల్లా రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

పతంజలి గ్రూపు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు రైతులు తమ పంట ఉత్పత్తులన్నీ ఒకే చోట అమ్ముకునేందుకు వీలుంది. పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమంది యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. దళారుల చేతిలో మోసపోకుండా రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా పతంజలి కంపెనీవారికి అమ్ముకోవచ్చు. ముఖ్యంగా  పసుపు రైతులకు కష్టాలు తీరుతాయి.

ఆర్మూర్‌: దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న పతంజలి గ్రూప్‌ వారి ఆహారశుద్ధి కేంద్రాన్ని ఆర్మూర్‌ నియోజకవర్గం పరిధిలోని నందిపేట మండలం లక్కంపల్లి సెజ్‌ భూముల్లో ఏర్పాటు చేయడానికి సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గల పతంజలి కేంద్ర కార్యాలయంలో నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిలు పతంజలి సీఎండీ రామ్‌దేవ్‌ బాబా, సీఈవో ఆచార్య బాలకృష్ణతో బుధవారం సమావేశమయ్యారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించిన అనంతరం పతంజలి గ్రూప్‌ బాధ్యులతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం పసుపు ఉత్పత్తిలో దేశంలోనే మంచి స్థానంలో ఉండటంతో పాటు నాణ్యమైన పసుపు ఇక్కడ పండుతుండటంతో ఆయుర్వేద, ఆహార ఉత్పత్తులను పెద్దఎత్తున తయారు చేస్తున్న పతంజలి గ్రూప్‌ను ఇక్కడ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఎంపీ కవిత స్వయంగా రామ్‌దేవ్‌ బాబా వద్దకు వెళ్లి గతేడాది నవంబర్‌లో వినతి పత్రాన్ని అందజేశారు.

ఎంపీ కవిత ఆహ్వానంమేరకు గతేడాది నవంబర్‌ 15న జిల్లాకు వచ్చిన పతంజలి గ్రూప్‌ సీఈవో బాలకృష్ణ ఆర్మూర్‌ ప్రాంతంలో, నందిపేట మండలం లక్కంపల్లిలో పర్యటించి ఇక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం హరిద్వార్‌లోని రామ్‌దేవ్‌ బాబాతో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రాథమికంగా ఎంవోయూ చేసుకునేందుకు అధికారులతో రావాల్సిందిగా ఎంపీ కవితను కోరారు. దీంతో ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఎస్‌ ఐసీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఈవీ నర్సింహారెడ్డి, నందిపేట మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు హరిద్వార్‌కు వెళ్లారు. హరిద్వార్‌లో తమ పరిశ్రమలలో వస్తు ఉత్పత్తి కేంద్రాలు, ప్యాకింగ్‌ యూనిట్లు, పరిశోధన విభాగాలు, మందుల తయారీ కేంద్రాలను ఎంపీ కవితతో పాటు వచ్చిన బృందానికి చూపించారు. 

యువతకు ఉపాధి అవకాశాలు..
లక్కంపల్లిలో పతంజలి గ్రూప్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (ఆహార శుద్ధి కర్మాగారం)లో పసుపు, మిర్చి, మక్కలు, సోయాబీన్‌ తదితర సుగంధ ద్రవ్య, తృణ ధాన్యాలను సేకరించి శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన ధాన్యాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పతంజలి యూనిట్లకు సరఫరా చేస్తారు. లక్కంపల్లిలో పరిశ్రమ ఏర్పాటు చేయడంతో పతంజలి వారికి కావాల్సిన పసుపు, మిర్చి, సోయాబీన్, మక్కలు తదితర నాణ్యతతో కూడిన పంటలు పెద్దఎత్తున ఒకే చోట లభించనున్నాయి. అలాగే ఈ పరిశ్రమ ఏర్పాటుతో రైతులు కూడా లబ్ధి పొందనున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాంత రైతులు తాము పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోకుండా నేరుగా కంపెనీకి అమ్ముకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. 

పసుపు రైతులకు మంచిరోజులు..
జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో పసుపు పంటను పండిస్తున్నారు. వాణిజ్య పంట అయిన పసుపునకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఔషధాల తయారీ, కాస్మోటిక్స్‌ల తయారీలో పసుపును ఉపయోగిస్తుంటారు. జిల్లాలో రైతులు జూన్‌లో పసుపు పంటను విత్తుతారు. తొమ్మిది నెలల్లో పంట చేతికి వస్తుంది. రైతులు పాటించే మెరుగైన యాజమాన్య పద్ధతులను బట్టి ఎకరానికి 12 నుంచి 20 క్వింటాళ్ల పసుపు దిగుబడి వస్తుంది. రైతులు వ్యయ, ప్రయాసలకోర్చి పండించిన పంటను నిజామాబాద్‌తో పాటు మహారాష్ట్ర లోని సాంగ్లీ మార్కెట్‌లో పంటను అమ్ముతుంటారు. దీంతో రవాణా ఖర్చులు రైతులకు అదనంగా పడుతున్నాయి. పసుపు పంటను పండించిన రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఏటా ఆర్థికంగా నష్టపోతున్నారు. పతంజలి పరిశ్రమల ఏర్పాటుతో పసుపు రైతుల కష్టాలు తీరి మంచిరోజులు రానున్నాయి.

రైతులకు మేలు..ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో పసుపు రైతులకు మంచి రోజులు రానున్నాయి. ఎంపీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఇప్పటికే పసుపు పండించే నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాం. పతంజలి ఉత్పత్తుల కోసం పసుపు కొనుగోలు, పసుపు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఈ ప్రాంత యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సైతం లభించనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement