‘పతంజలి’కి తెలంగాణ ముడిసరుకు: కవిత
హైదరాబాద్: పతంజలి సంస్థ త్వరలో తెలంగాణ సర్కారుతో ఒప్పందం కుదుర్చుకోనుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ కేంద్రంలో తయారుచేసే ఉత్పత్తులకు అవసరమైన వ్యవసాయ సంబంధ ముడి సరుకును తెలంగాణ నుంచి కొనుగోలు చేసేందుకు మార్గం సుగమమవుతోంది. యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి సంస్థ ప్రతినిధులతో త్వరలోనే ఒక అంగీకారానికి రానున్నట్లు ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో పండే పంటలు, ఉత్పత్తులపై ఆ సంస్థ కోరిన సమాచారాన్ని అందించామన్నారు. త్వరలోనే ఆ సంస్థ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పండే పంటలు దొరికే ఉత్పత్తులను వివరించి ఒక స్పష్టతకు రానున్నట్లు వివరించారు.
నిజామాబాద్‌లో గనుక వారు ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకునే వీలు కల్పిస్తామన్నారు. వచ్చే నెలలో సంస్థ ప్రతినిధులతో జరిగే సమావేశంలో నిజామాబాద్ ప్లాంట్‌పై ఒక స్పష్టత వస్తుందన్నారు. ఆ జిల్లాలో ప్లాంట్ పెడితే వారికి అవసరమైన ముడి సరుకు అధిక మోతాదులో లభిస్తుందని, అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాకు నాగ్‌పూర్‌తో రైలు రవాణా సౌకర్యం కూడా ఉందని చెప్పారు. జిల్లాలోని పసుపు రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీ కవిత వివరించారు.