శాంసంగ్‌కు వ్యతిరేకంగా తీర్పివ్వండి
శాన్ఫ్రాన్సిస్కో : అమెరికా సుప్రీంకోర్టు గడపతొక్కిన పేటెంట్ దావా కేసులో స్మార్ట్‌ఫోన్ రారాజు శాంసంగ్‌కు వ్యతిరేకంగా తీర్పును వెలువరించాలని యాపిల్ ఇంక్ అభ్యర్థిస్తోంది. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ నుంచి ఏర్పడిన వందల మిలియన్ల నష్టాల నుంచి యాపిల్ కు ఉపశమనం కల్పించాలని సుప్రీంకోర్టును యాపిల్ ఇంక్ శుక్రవారం కోరింది. ఈ కేసుపై అదనపు వాదనలు వినిపించడానికి శాంసంగ్‌కు అనుమతించడానికి ఎలాంటి కారణాలు లేవని, డిజైన్ పేటెంట్ నష్టాలను వెంటనే క్లియర్ చేయాలని యాపిల్ ఇంక్ పేర్కొంటోంది. డిజైన్ పేటెంట్లను ఉల్లంఘించినప్పుడు మొత్తం ప్రొడక్ట్ లపైన కాకుండా కేవలం ఒక్క స్మార్ట్ ఫోన్ కాంపొనెంట్ పైనే నష్టపరిహారం విధించేలా ఆదేశించాలని శాంసంగ్ సుప్రీంను కోరింది. అయితే తన వాదనలకు సంబంధించి శాంసంగ్ ఎలాంటి ఆధారాలను సమర్పించలేదని యాపిల్ పేర్కొంటోంది. తదుపరి విచారణల కోసం ఈ కేసును కిందకోర్టుకూ సుప్రీం పంపాల్సినవసరం లేదని యాపిల్ వాదిస్తోంది.
2011 నుంచి స్మార్ట్ ఫోన్ పేటెంట్ లిటిగేషన్స్ పై ఈ రెండు దిగ్గజాల మధ్య వార్ నడుస్తోంది. ఐఫోన్ పేటెంట్లను, డిజైన్లను, ట్రేడ్ మార్క్ లను శామ్ సంగ్ ఉల్లఘించిందని ఆరోపణలు చేస్తూ.. శామ్ సంగ్ పై నార్తర్న్ కాలిఫోర్నియా కోర్టులోయాపిల్ పేటెంట్ దావా వేసింది. 2012లో తొలిసారి విచారణకు వచ్చిన ఈ దావా కేసులో, జ్యూరీ ట్రయల్ 9300లక్షల డాలర్లను యాపిల్‌కు శాంసంగ్ చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది. ఆ మొత్తాన్ని తగ్గించాలని అప్పటినుంచి శామ్ సంగ్ అమెరికా కోర్టులో తీవ్ర పోరాటం చేస్తోంది. శామ్ సంగ్ ప్రయత్నాలు కొంత అనుకూలించి 2015 మే లో ఈ మొత్తాన్ని 5480లక్షల డాలర్లకు, 3990లక్షల డాలర్లకు అమెరికా కోర్టు తగ్గించింది. అయితే పేటెంట్ డిజైన్ పైనా, అధికమొత్తంలో విధించిన పేటెంట్ దావా జరిమానపై పునఃవిచారణ చేపట్టాలని కోరుతూ శాంసంగ్ సుప్రీంకోర్టు గడపతొక్కింది. తదుపరి విచారణల నిమిత్తం ఈ కేసును కింద కోర్టుకు పంపించాలని అమెరికా సుప్రీంకోర్టును ఆ దేశ న్యాయశాఖ గత నెలలో కోరిన సంగతి తెలిసిందే.