pathancheru
-
రాష్ట్రానికి మరో రైల్వే లైను
సాక్షి, హైదరాబాద్: కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తే మరో రైల్వే ప్రాజెక్టు కల సాకారం కానుంది. సగం నిధులు భరించేందుకు ముందుకొస్తే కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్రం రెండేళ్ల కిందటే సుముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న మనోహరాబాద్–పెద్దపల్లి ప్రాజెక్టు ఇలాగే పట్టాలెక్కుతోంది. ఇప్పుడు అదే తరహాలో మరో కీలక ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. పటాన్చెరు–సంగారెడ్డి–జోగిపేట–మెదక్ లైన్‌కు సంబంధించి తాజాగా దక్షిణ మధ్య రైల్వే రీకనైసెన్స్ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ సర్వే పూర్తి చేసి రూ.1,764.92 కోట్ల అంచనాతో రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపింది. దీనికి వచ్చే కేంద్ర బడ్జెట్లో చోటు దక్కితే ఫైనల్ లొకేషన్ సర్వేకు అవకాశం దక్కుతుంది. ఎంతో కీలకం.. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పరిశీలిస్తే రైల్వే లైన్లలో మెదక్ జిల్లా వెనుకబడి ఉంది. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడల్లో ఒకటైన పటాన్‌చెరుతో అనుసంధానిస్తూ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగారెడ్డిని కలుపుకొంటూ మెదక్ వరకు దీన్ని నిర్మిస్తే ఉత్తర–దక్షిణ భారత్‌లను జోడించే ప్రత్యామ్నాయ రైలు మార్గం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. దీంతో రైల్వే ట్రాఫిక్ కూడా తగ్గనుంది. ఇందుకోసం జోగిపేటకు చెందిన సీనియర్ నేత గంగా జోగినాథ్ రైల్వే లైన్ సాధన సమితి పేరిట ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ప్రధాని మొదలు దక్షిణ మధ్య రైల్వే జీఎం వరకు అందరినీ కలసి విజ్ఞప్తి చేశారు. చివరకు 2018–19 బడ్జెట్లో దీన్ని పరిశీలించేందుకు రైల్వే మంత్రి సమ్మతిస్తూ సర్వేకు ఆదేశించారు. నాటి రైల్వే బడ్జెట్ బ్లూ బుక్‌లో దీనికి చోటు దక్కింది. ఆమేరకు దక్షిణ మధ్య రైల్వే సర్వే పూర్తి చేసి గత డిసెంబర్ 31న రైల్వే బోర్డుకు ప్రతిపాదించింది. పింక్ బుక్‌లో చోటు దక్కితేనే.. రైల్వే బడ్జెట్ సమయంలో రెండు పుస్తకాలుంటాయి. ఫైనల్ అయిన ప్రాజెక్టుల వివరాలు పింక్ బుక్‌లో, తాత్కాలిక ప్రాజెక్టుల వివరాలు బ్లూ బుక్‌లో ఉంటాయి. పింక్ బుక్‌లో చోటు దక్కినవి ఆలస్యమైనా ఎప్పటికో అప్పటికి పట్టాలెక్కుతాయి. బ్లూ బుక్‌లోని ప్రాజెక్టులు రైల్వే బోర్డు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు పటాన్చెరు–మెదక్‌కు సంబంధించిన 95 కి.మీ. ప్రాజెక్టు బ్లూబుక్‌లో ఉంది. వచ్చే బడ్జెట్లో అది పింక్ బుక్‌లోకి మారాల్సి ఉంది. ఖర్చు భరించేందుకు ముందుకొస్తే.. రాష్ట్రప్రభుత్వం 50 శాతం ఖర్చు భరించేందుకు ముందుకొస్తే రైల్వే ముందడుగు వేస్తుంది. అది కూడా సాధ్యం అని భావిస్తేనే పట్టాలెక్కుతుంది. లేదంటే రాష్ట్రప్రభుత్వం మరింత ఖర్చు భరించేందుకు ఒప్పుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు రైల్వేకు సమాచారం ఇస్తే ఫలితం కూడా సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్రతిపాదిత లైను వట్టినాగులపల్లి – చేరియాల్ – సంగారెడ్డి – కోర్పోల్ – సాయిబాన్‌పేట – జోగిపేట – చిట్కుల్ – కోర్పాక్ – పొడ్చనపల్లి– ఘన్పూర్ – మెదక్‌ల మీదుగా కొనసాగుతుంది. -
రైతులను నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తా
సాక్షి, సంగారెడ్డి: రైతులకు సంబంధించిన భూముల రికార్డు పనుల్లో కాలయాపన చేసే వారిని సస్పెండ్ చేస్తానని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సోమవారం కంది మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఇయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందరర్భంగా కార్యాలయంలోని భూ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన పాసు పుస్తకాలు, రికార్డులను త్వరగా అందజేసేందుకు తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా తయారైన పాసు పుస్తకాలను తహసీల్దార్లే గ్రామాలకు వెళ్లి అందజేయాలన్నారు. కోర్టు కేసుల వివరాలను రిజిస్టర్లో పొందుపర్చాలని సూచించారు. వీఆర్ఓలు తమ వద్ద పట్టా పాసు పుస్తకాలను ఉంచుకోకూడన్నారు. మ్యుటేషన్లను పెండింగ్‌లో ఉంచొద్దని సూచించారు. అవసరమైన సరి్టఫికెట్లను 24 గంటల్లోగా అందజేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. శిఖం భూములు, ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే సహించేది లేదని, చట్టపరమైన కఠిన చర్యలతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు తమ పేరున ఉన్న భూములకు సంబంధించిన రికార్డులను అందజేసేందుకు వీఆర్ఓ కాలయాపన చేస్తున్నారని ఉత్తర్‌పల్లికి చెందిన ఓ రైతు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ రైతులను ఇబ్బంది పెడుతూ రికార్డులు అందజేయడంలో నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తానని వీఆర్ఓ శంకరయ్యను హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, నాయబ్ తహసీల్దార్ సల్ల మల్లయ్య, ఆర్ఐ సంతో‹Ùకుమార్, వీఆర్ఓలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ పటాన్చెరు టౌన్: ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ పనితీరును మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ హనుమంత రావు అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వైద్యం కోసం వచి్చన రోగులను, గర్భిణులను ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్ని కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారని, రికార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ప్రసవాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా మొత్తం కాన్పుల్లో 15 శాతం సాధారణమైనవి ఉంటేనే హెల్తీ ఇండెక్స్ కింద సూచిస్తుందని తెలిపారు. దాని ప్రకారంగా మన జిల్లాలో 25 శాతం వరకు ఉందన్నారు. రాష్ట్రంలో మనం బెస్ట్‌గా ఉన్నామని చెప్పారు. అయినప్పటికి 15 శాతానికి తీసుకురావాలన్నారు. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ పని తీరును మెరుగు పరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీను, పటాన్చెరు తహసీల్దార్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో పరిచయం: ఆపై తరచూ ఫోన్లో..
సాక్షి, పటాన్చెరు: లక్డారం శివారులో గుర్తు తెలియని మహిళ ఈ నెల 13న హత్యకు గురైన సంఘటన తెలిసిందే. ఈ క్రమంలో హత్యకు గురైన అంజిలమ్మపై చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదైంది. అంజిలమ్మ కూతురు మమత ఫిర్యాదు మేరకు పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో సీఐ నరేష్ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన రాములు బతుకుదెరువు కోసం హైదరాబాద్ గచ్చిబౌలి లో భార్య పిల్లలతో కలసి ఉంటున్నాడు. ఈ క్రమంలో గతంలో రాములు భార్య రాములుతో గొడవపడి యాసిడ్ తాగింది. దీంతో ఆమెను చికిత్స కోసం రాములు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లా నంచర్ల గ్రామానికి చెందిన అంజిలమ్మ అదే సమయంలో తన తల్లిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చింది. ఆ సమయంలో రాములు, అంజిలమ్మకు పరిచయం ఏర్పడింది. తర్వాత అంజిలమ్మ, రాములు తరుచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఈ నెల 12న రాములు అంజిలమ్మను చేవెళ్లలో కలసి మండల పరిధిలోని లక్డారం గ్రామానికి బైక్‌పై తీసుకువచ్చాడు. అక్కడ మద్యం కొనుగోలు చేసి లక్డారం గ్రామ శివారులోని నింగసానికుంట వద్ద ఉన్న నిర్మానుష ప్రదేశంలో మద్యం సేవించారు. అనంతరం శారీరకంగా కలిసే క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆమెను రాములు తన హెల్మెట్‌తో కొట్టి ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడుతో అంజిలమ్మ మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం అంజిలమ్మ పుస్తెలు తాడు, ఫోన్ తీసుకొని రాములు వెళ్లిపోయాడు. కేసు దర్యాప్తులో భాగంగా రాములును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తానే అంజిలమ్మను చంపిన్నట్లు ఒప్పుకున్నాడు. కాగా రాములుపై హైదరాబాద్, సైబరాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 హత్య కేసులు, 4 దొంగతనం కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడు మాయని రాములును పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
రెండోసారి ఆడపిల్ల పుట్టిందని ..
పటాన్చెరు టౌన్: రెండోసారి ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసిన సంఘటన పటాన్చెరు మం డల పరిధిలోని ఇస్నాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. పటాన్చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ గ్రామానికి చెందిన మల్లేశ్‌కు, ఇస్నాపూర్ చౌరస్తాకు చెందిన మాధవితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మొదట కూతురు పుట్టింది. అనంతరం రెండోసారి కూడా పాప పుట్టడంతో మల్లేశ్తన భార్య మాధవిని వదిలేసి వెళ్లాడు. ఈ క్రమంలో పాప అనారోగ్యంగా ఉండటంతో మాధవి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించగా మంగళవారం ఉదయం పాప మృతిచెందింది. దీంతో మాధవి, కుటుంబ సభ్యులు పాప మృతదేహంతో అత్తింటి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మాధవి భర్త మల్లేశ్, అత్తమామలు పరారీలో ఉన్నట్లు సమాచారం. మాధవి తండ్రి పటాన్చెరు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. -
దొరకని ఆచూకీ
పటాన్చెరు టౌన్ : ఇద్దరు గుర్తుతెలియని వృద్ధులు.. ఇద్దరూ 60 ఏళ్లు పైబడినవారే.. విగత జీవులుగా కనిపించారు. వారి కోసం బంధువుల ఆచూకీ కోసం ఎదురు చూసిన పోలీసులు చివరికి అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేశారు. రాంచంద్రాపురం మండలం వెలమెల్ల గ్రామ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఇద్దరు వృద్ధులు మృతదేహాలు ఈ నెల 5న వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ వృద్ధులు ఇద్దరు మృతిచెందిన చోటు కొల్లూరు సర్వీసు రోడ్డుకు కిలో మీటర్ దూరంలో, పటాన్చెరు మండలంలోని ముత్తంగి టోల్గేట్ నుండి రెండు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్రమంలో వృద్ధురాలి బోదకాలు ఉండటం, మరో వృద్ధుడు.. ఇద్దరు కలిసి కిలో మీటర్ల దూరం నడిచే అవకాశం లేదు. దీంతో ఇద్దరు వృద్ధులు రింగ్‌రోడ్డు పైకి ఎలా వచ్చారు. వీరు హత్యకు గురయ్యారా, లేదా ఆత్మహత్య చేసుకున్నారా అనే విషయం తెలియరాలేదు. సంఘటన స్థలానికి క్లూస్ టీం వచ్చినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఆచూకీకోసం యత్నించిన బీడీఎల్ పోలీసులు వృద్ధురాలి మెడలో పుస్తెలను, నడుముకు మొలతాడు చూసి వీరు కర్ణాటక, మహారాష్ట్ర చెందిన వారై ఉండవచ్చని ఆ రాష్ట్రాల్లో సమాచారం కోసం ప్రయత్నించినా ఆచూకీ లభించలేదని బీడీఎల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ మహేశ్వర్ నాయుడు తెలిపారు. ఇద్దరు గుర్తుతెలియని వృద్ధుల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే వృద్ధులు ఎలా మృతిచెందారో తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఐదు రోజులు వేచిచూసి.. ఈ నెల 5న కేసు నమోదు చేసిన బీడీఎల్ పోలీసులు వృద్ధుల మృతదేహాలకు పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు. వీరికి సంబంధించిన వారు ఎవరైనా వస్తారని 5 రోజుల పాటు చూసి 5వ రోజు ఇద్దరు గుర్తు తెలియని వృద్ధులకు బీడీఎల్ పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. రాంచంద్రాపురం మండలంలోని వెలమెల్ల గ్రామ శివారులో పంచాయతీ సిబ్బందితో కలిసి ఎస్ఐ మహేశ్వర్ నాయుడు వృద్ధుల మృతదేహాలను పూడ్చి పెట్టి అంత్యక్రియలు చేశారు. -
పగుళ్లు జాస్తి...నాణ్యత నాస్తి
పటాన్చెరు రూరల్, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రింగురోడ్డు పనుల్లో నాణ్యతాలోపాలు బయటపడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడడం...కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేయడంతో రింగ్‌రోడ్డుపై చాలా చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. పటాన్చెరు మండలంలో 8 గ్రామాల్లో విస్తరించి ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణమంటే వాహనదారులు హడలిపోతున్నారు. పనుల్లో నాణ్యత లోపించడంతో పోచారం వద్ద నక్కవాగుపై నిర్మించిన వంతెనకు అప్పుడే పగుళ్లు వచ్చాయి. సర్వీసు రోడ్డుపై నిర్మించిన వాకింగ్ ట్రాక్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉంది. సర్వీసు రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదు. ముత్తంగి గ్రామం వద్ద సర్వీసు రోడ్డు నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ వైపు తిరిగేందుకు సరైన రోడ్డు నిర్మాణం చేయకుండా వదిలేయడంతో భారీ వాహనాలు ముత్తంగి గ్రామం నుంచి రోడ్డు క్రాసింగ్ చేస్తున్నాయి. దీంతో అక్కడ ప్రతి రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. రింగు రోడ్డుపై నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్‌కు వెళ్లేందుకు నిర్మించిన వంతెనపై నుంచే సర్వీసు రోడ్డు వాహనాలను కూడా అనుమతిస్తే ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలను నివారించవచ్చు. కానీ అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోవడం లే దు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రింగురోడ్డు సర్వీసు రోడ్డును పూర్తిగా నిర్మించి, రోడ్డు క్రాసింగ్లను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకు టోల్ వసూళ్లను నిలిపివేయాలని వారు కోరుతున్నారు.