పగుళ్లు జాస్తి...నాణ్యత నాస్తి | Quality error in ring road works | Sakshi
Sakshi News home page

పగుళ్లు జాస్తి...నాణ్యత నాస్తి

Published Tue, Feb 18 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM

Quality error in ring road works

పటాన్‌చెరు రూరల్, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రింగురోడ్డు పనుల్లో నాణ్యతాలోపాలు బయటపడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడడం...కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేయడంతో రింగ్‌రోడ్డుపై చాలా చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. పటాన్‌చెరు మండలంలో 8 గ్రామాల్లో విస్తరించి ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణమంటే వాహనదారులు హడలిపోతున్నారు. పనుల్లో నాణ్యత లోపించడంతో పోచారం వద్ద నక్కవాగుపై నిర్మించిన వంతెనకు అప్పుడే పగుళ్లు వచ్చాయి.

 సర్వీసు రోడ్డుపై నిర్మించిన వాకింగ్ ట్రాక్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉంది. సర్వీసు రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి   చూడటంలేదు. ముత్తంగి గ్రామం వద్ద సర్వీసు రోడ్డు నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ వైపు తిరిగేందుకు సరైన రోడ్డు నిర్మాణం చేయకుండా వదిలేయడంతో భారీ వాహనాలు ముత్తంగి గ్రామం నుంచి రోడ్డు క్రాసింగ్ చేస్తున్నాయి.

దీంతో అక్కడ ప్రతి రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. రింగు రోడ్డుపై నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్‌కు వెళ్లేందుకు నిర్మించిన వంతెనపై నుంచే సర్వీసు రోడ్డు వాహనాలను కూడా అనుమతిస్తే ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలను నివారించవచ్చు. కానీ అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోవడం లే దు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రింగురోడ్డు సర్వీసు రోడ్డును పూర్తిగా నిర్మించి, రోడ్డు క్రాసింగ్‌లను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకు టోల్ వసూళ్లను నిలిపివేయాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement