సాక్షి, హైదరాబాద్ : రీజినల్ రింగురోడ్డులో నాలుగు రకాల డిజైన్లలో ఇంటర్ ఛేంజ్ స్ట్రక్చర్లు రాబోతున్నాయి. జాతీయ రహదారులు, ప్రధాన రాష్ట్ర రహదారులను రింగురోడ్డు క్రాస్ చేసే చోట్ల భారీ ఇంటర్ ఛేంజ్‌లను నిర్మించనున్న విషయం తెలిసిందే. రింగురోడ్డు ఉత్తర భాగంలో 11 ప్రాంతాల్లో ఇలాంటి కూడళ్లు ఉండనున్నాయి. రింగురోడ్డు మీదుగా వెళ్లే వాహనాలు, ఇతర రోడ్ల మీదుగా వెళ్లే వాహనాలు పరస్పరం అడ్డు రాకుండా వేటికవే రోడ్లు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా క్రాస్ అవుతాయి.
ఒక రోడ్డు నుంచి మరో రోడ్డులోకి వాహనాలు మారేందుకు వీలుగా ఇంటర్‌ఛేంజ్ లూప్స్‌ను నిర్మిస్తారు. ఇప్పుడు ఈ స్ట్రక్చర్లకు సంబంధించి అధికారులు రూపొందించిన డిజైన్లు ఆసక్తి రేపుతున్నాయి. ఆయా క్రాసింగ్స్‌లో ఉండే ట్రాఫిక్ ఒత్తిడి, అనుసంధానమయ్యే రోడ్ల సంఖ్య ఆధారంగా లూప్స్ వైశాల్యం, సంఖ్య ఆధారపడి ఉంటాయి. ఇందుకోసం నాలుగు డిజైన్లను ఖరారు చేసి, ఆ ప్రాంతంలో ఉండే పరిస్థితికి తగ్గట్టుగా వాటిని ఎంపిక చేయబోతున్నారు.
ట్రంపెట్ ఆకృతిలో లూప్ నిర్మాణం
సాధారణంగా ప్రధాన రోడ్లను ఇతర రోడ్ల మీదుగా వచ్చే వాహనాలను అనుసంధానించేందుకు ట్రంపెట్ (సంగీత పరికరం) ఆకృతిలో లూప్ నిర్మిస్తారు. రోడ్ల సంఖ్య ఎక్కువగా ఉంటే రెండు ట్రంపెట్ల ఆకృతిలో నిర్మిస్తారు. క్లవర్ లీఫ్ (నాలుగు ఆకులతో కూడిన మొక్క భాగం) ఆకృతిలో కూడా విరివిగా నిర్మిస్తారు. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డులో ఈ రెండు ఆకృతుల్లో ఇంటర్‌ఛేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు వీటితోపాటు డంబెల్ (వ్యాయామ ఉపకరణ) ఆకృతితోపాటు రౌండ్ ఎ»ౌట్ (పూర్తి వృత్తం)లో కూడా నిర్మించాలని నిర్ణయించారు.
గిర్మాపూర్, చౌటుప్పల్ వద్ద డంబెల్ ఆకృతిలో నిర్మాణాలు
నాగ్‌పూర్ జాతీయ రహదారి, రాజీవ్ రహదారుల మీద రెండు ప్రాంతాల్లో క్లవర్ లీఫ్ నమూనాను ఎంపిక చేశారు. శివంపేట, రాయగిరిల వద్ద డబుల్ ట్రంపెట్ డిజైన్‌ను ఎంపిక చేశారు. రీజినల్‌రింగ్‌రోడ్డు ప్రారంభ ప్రాంతమైన గిర్మాపూర్, ముగింపు ప్రాంతమైన చౌటుప్పల్‌తోపాటు జాతీయ రహదారి 161ఏ మీద డంబెల్ ఆకృతిలో నిర్మించాలని భావిస్తున్నారు. మరో మూడు చోట్ల రౌండ్ ఎ»ౌట్‌లను ఎంపిక చేశారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయి.
కొన్ని ప్రాంతాల్లో ఇంటర్ ఛేంజ్ స్ట్రక్చర్లకు భారీగా స్థలాన్ని సేకరించే విషయంలో స్థానికులతో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో డిజైన్లలో కొన్ని మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉంది. రీజినల్ రింగురోడ్డుకు సంబంధించి భూసేకరణలో భాగంగా కీలక 3డీ గెజిట్ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ ఆందోల్–జోగిపేట, యాదాద్రి భువనగిరి, చౌటుప్పల్.. ఈ మూడు కాలా అథారిటీలో పూర్తయిన విషయం తెలిసిందే.
వీటి పరిధిలో త్వరలో టెండర్ల ప్రక్రియ కూడా మొదలుకానున్నందున ఇంటర్‌ఛేంజ్ స్ట్రక్చర్లపై త్వరలో నిర్ణయంతీసుకోనున్నారు. మిగతా కాలా అథారిటీల పరిధిలో 3డీ గెజిట్ నోటిఫికేషన్ జారీకి కొంత సమయం ఉన్నందున, మరో నెల రోజుల్లో ఆయా ప్రాంతాల్లోని స్ట్రక్చర్లను ఖరారు చేయనున్నారు.
120 ఎకరాల విస్తీర్ణంలో..
రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగంలో వాహనాల రద్దీ చాలా ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతాల్లో నిర్మించే ఇంటర్ ఛేంజ్ నిర్మాణాలు ఒక్కోటి దాదాపు 120 ఎకరాల విస్తీర్ణంలో ఉండనున్నట్టు తెలిసింది. వాహనాలు ఇంటర్‌ఛేంజ్ లూప్స్ మీదుగా, వాటికి నిర్మించే ర్యాంప్స్ మీదుగా కూడా గంటకు 50 కి.మీ. మించిన వేగంతో వెళ్లేందుకు వీలుగా వీటిని విశాలంగా నిర్మించాలని నిర్ణయించారు. తొలుత 70 ఎకరాల విస్తీర్ణంలోనే నిర్మించాలని అనుకున్నా.. వాహనాల వేగం గంటకు 30 కి.మీ.లోపే నియంత్రించాల్సిన పరిస్థితి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment