వృద్ధుల మృతదేహాలు (ఫైల్)
పటాన్‌చెరు టౌన్ : ఇద్దరు గుర్తుతెలియని వృద్ధులు.. ఇద్దరూ 60 ఏళ్లు పైబడినవారే.. విగత జీవులుగా కనిపించారు. వారి కోసం బంధువుల ఆచూకీ కోసం ఎదురు చూసిన పోలీసులు చివరికి అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేశారు. రాంచంద్రాపురం మండలం వెలమెల్ల గ్రామ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఇద్దరు వృద్ధులు మృతదేహాలు ఈ నెల 5న వెలుగుచూసిన విషయం తెలిసిందే.
ఈ వృద్ధులు ఇద్దరు మృతిచెందిన చోటు కొల్లూరు సర్వీసు రోడ్డుకు కిలో మీటర్ దూరంలో, పటాన్‌చెరు మండలంలోని ముత్తంగి టోల్‌గేట్ నుండి రెండు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్రమంలో వృద్ధురాలి బోదకాలు ఉండటం, మరో వృద్ధుడు.. ఇద్దరు కలిసి కిలో మీటర్ల దూరం నడిచే అవకాశం లేదు.
దీంతో ఇద్దరు వృద్ధులు రింగ్‌రోడ్డు పైకి ఎలా వచ్చారు. వీరు హత్యకు గురయ్యారా, లేదా ఆత్మహత్య చేసుకున్నారా అనే విషయం తెలియరాలేదు. సంఘటన స్థలానికి క్లూస్ టీం వచ్చినా ఎలాంటి ఆధారాలు లభించలేదు.
మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఆచూకీకోసం యత్నించిన బీడీఎల్ పోలీసులు
వృద్ధురాలి మెడలో పుస్తెలను, నడుముకు మొలతాడు చూసి వీరు కర్ణాటక, మహారాష్ట్ర చెందిన వారై ఉండవచ్చని ఆ రాష్ట్రాల్లో సమాచారం కోసం ప్రయత్నించినా ఆచూకీ లభించలేదని బీడీఎల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్‌ఐ మహేశ్వర్ నాయుడు తెలిపారు.
ఇద్దరు గుర్తుతెలియని వృద్ధుల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ వస్తే వృద్ధులు ఎలా మృతిచెందారో తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.
ఐదు రోజులు వేచిచూసి..
ఈ నెల 5న కేసు నమోదు చేసిన బీడీఎల్ పోలీసులు వృద్ధుల మృతదేహాలకు పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు. వీరికి సంబంధించిన వారు ఎవరైనా వస్తారని 5 రోజుల పాటు చూసి 5వ రోజు ఇద్దరు గుర్తు తెలియని వృద్ధులకు బీడీఎల్ పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. రాంచంద్రాపురం మండలంలోని వెలమెల్ల గ్రామ శివారులో పంచాయతీ సిబ్బందితో కలిసి ఎస్‌ఐ మహేశ్వర్ నాయుడు వృద్ధుల మృతదేహాలను పూడ్చి పెట్టి అంత్యక్రియలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment