మసూద్‌పై నిషేధానికి చైనా అడ్డంకి
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ బాంబు దాడుల సూత్రధారి మసూద్ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తించి, నిషేధం విధించాలని ఐక్యరాజ్యసమితి (ఐరాస)ని అమెరికా కోరింది. దీనికి మళ్లీ చైనా మోకాలడ్డింది. భారత్ పలు దఫాలుగా చేసిన ప్రయత్నాల అనంతరం ఈ ప్రతిపాదనను అమెరికా ఐరాస దృష్టికి తీసుకువెళ్లింది. దీనికి చైనా అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోంది.
అమెరికా సీనియర్ ప్రభుత్వాధికార వర్గాల సమాచారం మేరకు భారత్, అమెరికా పలు దఫాలు చర్చలు సాగించిన తర్వాత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్, దాని అధినేత మసూద్ అజర్‌పై నిషేధం విధించాలన్న ప్రతిపాదన రూపుదిద్దుకుంది. తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల మద్దతుతో అమెరికా ఐరాస అనుమతుల కమిటీ ముందు మసూద్‌పై నిషేధ ప్రతిపాదనను ప్రవేశపెట్టింది. అయితే చైనా దీన్ని వ్యతిరేకించి హోల్డ్‌లో పెట్టింది. అయితే చైనా తాజా చర్యపై భారత్ ప్రతిస్పందిస్తూ.. ‘చైనా నిర్ణయం వెనుక అంతరార్థాన్ని భారత్ గుర్తించింది’అని పేర్కొంది.