Pathivada Narayana Swamy Naidu
-
సీనియర్‌ను గౌరవించే సంస్కారం ఇదేనా..
సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ వెంట నడిచిన నాయకుడు.. జిల్లా సీనియర్ నేతగా, ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న రాజకీయ కురువృద్ధుడు.. ఇప్పుడు టీడీపీకి అక్కరలేనివాడైపోయాడు. సీనియారిటీని, పార్టీకి ఆయన చేసిన సేవలను కనీసం పరిగణలోకి తీసుకోకుండా చిన్నాచితకా పదవులు, అందునా ఆయన గతంలో వద్దన్న వాటినే మళ్లీమళ్లీ బలవంతంగా రుద్దుతున్నారు. ఇది ముమ్మాటికీ పొమ్మనలేక పొగబెట్టడమే.’ అంటున్నారు నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలు. తమ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడుకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యం కల్పించడంలేదని, ఎథిక్స్ కమిటీ చైర్మన్ పదవితో సరిపెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సంతోషం లేని పదవి.. తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష కమిటీలను తాజాగా ప్రకటించింది. నెల్లిమర్ల ప్రస్తుత ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడుని ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. అయితే, ఆ పదవి వచ్చిన సంతోషం ఎమ్మెల్యేలోను, ఆయన అనుచరుల్లో కనిపించకపోవడం గమనార్హం. నిజానికి ఇదే పదవిని ఆయన గతంలో తిరస్కరించారు. తన స్థాయికి తగ్గ పదవి ఇవ్వాల్సిందిగా అప్పట్లో ఆయన కోరినా పట్టించుకోని అధిష్టానం నేటికీ తన పంథాను మార్చుకోకపోవడంతో పతివాడ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. బాబూ.. సీనియర్‌ను గౌరవించే సంస్కారం ఇదేనా.. 1983లో టీడీపీ ఆవిర్భావ సమయంలోనే పతివాడ పార్టీలో చేరారు. అంతకుముందు జనతా పార్టీలో కొంతకాలం ఉన్నారు. జనతాపార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌పార్టీకి చెందిన కొమ్మూరు అప్పలస్వామిపై ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. 1984లో మొట్టమొదటి సారిగా భోగాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి 2009 వరకు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో భోగాపురం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా భోగాపురం నియోజకవర్గం నెల్లిమర్ల నియోజకవర్గంలో విలీనమైంది. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడి చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2014లో పోటీచేసిన ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇలా ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2002 నుంచి 2004 వరకు రాష్ట్ర ఉద్యానవన, చక్కెర శాఖామంత్రిగా పనిచేశారు. 2014లో అసెంబ్లీ ప్రోటెమ్ట్ స్పీకర్‌గా వ్యవహరించిన పతివాడ కొద్ది కాలం మాత్రమే మంత్రిగా పనిచేసే అవకాశం రావడంతో మరోసారి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా అధినేత చంద్రబాబును అడిగారు. అయితే, 2014లో ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా పతివాడకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వలేదనే కోపంతో అప్పట్లో ఆ పదవిని ఆయన తిరస్కరించారు. తర్వాత ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా నియమించినప్పటికీ దానిని కూడా వద్దనుకున్నారు. మంత్రి వర్గ విస్తరణలోనైనా తనకు పదవి వస్తుందనే ఆశతో ఉన్న ఆయనకు మళ్లీ తాను ఏదైతే తిరస్కరించారో అదే పదవిని కట్టబెట్టారు. ఇక చేసేది లేక బలవంతంగా స్వీకరించినప్పటికీ ఆయనతో పాటు ఆయన వారసులు, అనుచరులు, కార్యకర్తలు కూడా ఈ విషయంలో అధిష్టానంపై నిప్పులు చెరుగుతున్నారు. పక్క జిల్లా మంత్రిని తీసుకువచ్చి జిల్లా నెత్తిన పెట్టిన చంద్రబాబు, ఇతర పార్టీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి కట్టబెట్టిన పార్టీ అధినేత స్థానిక సీనియర్లను నిర్లక్ష్యం చేయడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. -
'మంచివారంటూనే మమ్మల్ని పక్కన పెట్టారు'
విజయనగరం: విజయనగరంలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ఎమ్మెల్యే పత్తివాడ నారాయణస్వామి నాయుడు ఆదివారం చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మంచివారంటూనే మమ్మల్ని పక్కన పెట్టారని ఆయన పార్టీ అధినేత చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని ఆరోపించారు. విజయనగరం జిల్లా వెనకబడిన జిల్లా అని ఆయన తెలిపారు. అలాంటి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మిస్తామని చెప్పి... ఇప్పుడు ప్రైవేట్ వైద్య కళాశాల అని ప్రభుత్వం చెబుతుందని ఆయన విమర్శించారు. ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాలనే ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎవరేమనుకున్న ఇది ప్రజల మాట అని నారాయణ స్వామి పేర్కొన్నారు. అయితే కర్నూలు జిల్లాలో శనివారం జరిగిన టీడీపీ మినీ మహానాడులో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలకు తెర తీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చూపంతా పశ్చిమ గోదావరి జిల్లాపైనే అని ఆరోపించారు. కర్నూలు జిల్లాపై ఆయన దృష్టి సారించడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా మొత్తంలో కేవలం మూడు సీట్లు గెలుచుకుందని అప్పుడప్పుడు చంద్రబాబు తనకు గుర్తు చేస్తున్నారని... అయితే అందులో తన తప్పు లేదని చెప్పారు. ఎన్నికల ముందు ప్రజా వ్యతిరేకత ఉన్న పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను టీడీపీలో చేర్చుకోవడం వల్లే... ఆ ఫలితాలు వచ్చాయని చంద్రబాబుకు ఈ సందర్భంగా తెలిపారు. కేఈ అసంతృప్తి వెళ్లగక్కిన మరునాడే పత్తివాడ నారాయణ స్వామి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
మంత్రి పదవి ఆశలు గల్లంతైనట్టే
సాక్షి ప్రతినిధి, విజయనగరం : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పతివాడ నారాయణస్వామినాయుడికి మంత్రి పదవి ఆశలు గల్లంతైనట్టే. కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేసినా ఎనిమిది పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు తప్పకుండా చోటు దక్కుతుందని భావిం చినా... అధినేత కరుణించడం లేదు. మంత్రి పదవి రేసులో లేకుండా వ్యూహాత్మంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెగ్గొడుతున్నారు. టీటీడీ బోర్డు డెరైక్టర్ పదవితో సరిపుచ్చేసి చేతులు దులుపేసుకోవాలని చూస్తున్నారు. టీటీడీ పాలక మండలి కసరత్తులో ఓ డెరైక్టర్‌గా పతివాడ పేరును ప్రస్తావించినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పతివాడ నారాయణస్వామినాయుడికి తప్పకుండా మంత్రి పదవి వస్తుందని పార్టీ వర్గాలు భావించాయి. సీనియర్ నేతగా తనకే దక్కుతుందని ఆయన కూడా గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు అందరి అంచనాలను తలకిందలు చేశారు. సీనియార్టీని పక్కనపెట్టి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కిమిడి మృణాళినిని కేబినెట్లోకి తీసుకున్నారు. దీంతో పతివాడ కంగుతిన్నారు. ఎందుకిలా జరిగిందని పార్టీ వర్గాలు ఆరా తీసేసరికి ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. సిక్కోలులో సీనియర్ నేతగా ఉన్న కిమిడి కళా వెంకటరావుకు మంత్రి పదవి ఇస్తే తనను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న కింజరాపు అచ్చెన్నాయుడికి అన్యాయం చేసినట్టు అవుతుందని, ఇద్దరికీ ఇద్దామనుకుంటే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వారి మధ్య మరింత వైరం, గ్రూపులు పెంచి పోషినట్టు అవుతుందని వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. కళా వెంకటరావుకు అన్యాయం జరగకుండా ఆయన మరదలు మృణాళినికి విజయనగరం జిల్లా నుంచి, ఆద్యంతం తన వెంట ఉన్న అచ్చెన్నాయుడికి శ్రీకాకుళం జిల్లా కోటాలో మంత్రిగా ఇస్తే ఏ ఇబ్బందులుండవని పక్కా పథకం ప్రకారం మంత్రి పదవులు కేటాయించారు. మొత్తానికి చంద్రబాబు రాజకీయ ఎత్తుగడకు పతివాడ నారాయణస్వామినాయుడు కోలుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. పక్క జిల్లా నుంచి వచ్చిన నేతకు మంత్రి పదవి ఎలా ఇస్తారని, జిల్లాలో సీనియర్‌ను వదిలేసి ఎన్నికల ముందు జిల్లాకొచ్చిన నేతకు మంత్రి పదవి కట్టబెట్టడమేంటని పతివాడ వర్గీయులు ఎంత గొంతు చించుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈసారి రాకపోయినా కేబినెట్ విస్తరణలోనైనా వస్తుందని, అధైర్యపడొద్దని ఒకరికొకరు సముదాయించుకున్నారు. తన వర్గ నేతలతో కలిసి చంద్రబాబును కలిసి మొర పెట్టుకున్నారు. అవకాశం చిక్కినప్పుడుల్లా అధినేతను కలిసి తమ గోడు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలతో ఓ వర్గంగా కొనసాగుతున్నారు. జిల్లాలో తమకున్న పట్టును చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ పావులు కదుపుతున్నారు. కానీ, చంద్రబాబు ఆ దిశగా ఆలోచించలేదు. మంత్రి పదవి ఇస్తే గ్రూపులెక్కువవుతాయనో, కాంగ్రెస్ నేతలతో ఉన్న సత్సంబంధాల కారణంగా మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చోటు చేసుకుంటాయనో భయమో తెలియదు గాని టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమించి సరిపెట్టేయాలని చంద్రబాబు చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే పాలక మండలి కసరత్తులో పతివాడ పేరును చేర్చినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వయస్సు పైబడుతుండటం, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి వెరసీ సీనియర్ నేతకు మరోసారి అమాత్య యోగం లేనట్టే కనబడుతోంది.