సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ వెంట నడిచిన నాయకుడు.. జిల్లా సీనియర్ నేతగా, ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న రాజకీయ కురువృద్ధుడు.. ఇప్పుడు టీడీపీకి అక్కరలేనివాడైపోయాడు. సీనియారిటీని, పార్టీకి ఆయన చేసిన సేవలను కనీసం పరిగణలోకి తీసుకోకుండా చిన్నాచితకా పదవులు, అందునా ఆయన గతంలో వద్దన్న వాటినే మళ్లీమళ్లీ బలవంతంగా రుద్దుతున్నారు. ఇది ముమ్మాటికీ పొమ్మనలేక పొగబెట్టడమే.’ అంటున్నారు నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలు. తమ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడుకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యం కల్పించడంలేదని, ఎథిక్స్ కమిటీ చైర్మన్ పదవితో సరిపెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సంతోషం లేని పదవి..
తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష కమిటీలను తాజాగా ప్రకటించింది. నెల్లిమర్ల ప్రస్తుత ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడుని ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. అయితే, ఆ పదవి వచ్చిన సంతోషం ఎమ్మెల్యేలోను, ఆయన అనుచరుల్లో కనిపించకపోవడం గమనార్హం. నిజానికి ఇదే పదవిని ఆయన గతంలో తిరస్కరించారు. తన స్థాయికి తగ్గ పదవి ఇవ్వాల్సిందిగా అప్పట్లో ఆయన కోరినా పట్టించుకోని అధిష్టానం నేటికీ తన పంథాను మార్చుకోకపోవడంతో పతివాడ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.
బాబూ.. సీనియర్‌ను గౌరవించే సంస్కారం ఇదేనా..
1983లో టీడీపీ ఆవిర్భావ సమయంలోనే పతివాడ పార్టీలో చేరారు. అంతకుముందు జనతా పార్టీలో కొంతకాలం ఉన్నారు. జనతాపార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌పార్టీకి చెందిన కొమ్మూరు అప్పలస్వామిపై ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. 1984లో మొట్టమొదటి సారిగా భోగాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి 2009 వరకు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో భోగాపురం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా భోగాపురం నియోజకవర్గం నెల్లిమర్ల నియోజకవర్గంలో విలీనమైంది. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడి చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2014లో పోటీచేసిన ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇలా ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2002 నుంచి 2004 వరకు రాష్ట్ర ఉద్యానవన, చక్కెర శాఖామంత్రిగా పనిచేశారు.
2014లో అసెంబ్లీ ప్రోటెమ్ట్ స్పీకర్‌గా వ్యవహరించిన పతివాడ కొద్ది కాలం మాత్రమే మంత్రిగా పనిచేసే అవకాశం రావడంతో మరోసారి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా అధినేత చంద్రబాబును అడిగారు. అయితే, 2014లో ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా పతివాడకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వలేదనే కోపంతో అప్పట్లో ఆ పదవిని ఆయన తిరస్కరించారు. తర్వాత ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా నియమించినప్పటికీ దానిని కూడా వద్దనుకున్నారు. మంత్రి వర్గ విస్తరణలోనైనా తనకు పదవి వస్తుందనే ఆశతో ఉన్న ఆయనకు మళ్లీ తాను ఏదైతే తిరస్కరించారో అదే పదవిని కట్టబెట్టారు. ఇక చేసేది లేక బలవంతంగా స్వీకరించినప్పటికీ ఆయనతో పాటు ఆయన వారసులు, అనుచరులు, కార్యకర్తలు కూడా ఈ విషయంలో అధిష్టానంపై నిప్పులు చెరుగుతున్నారు. పక్క జిల్లా మంత్రిని తీసుకువచ్చి జిల్లా నెత్తిన పెట్టిన చంద్రబాబు, ఇతర పార్టీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి కట్టబెట్టిన పార్టీ అధినేత స్థానిక సీనియర్లను నిర్లక్ష్యం చేయడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment