'మంచివారంటూనే మమ్మల్ని పక్కన పెట్టారు'
విజయనగరం: విజయనగరంలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ఎమ్మెల్యే పత్తివాడ నారాయణస్వామి నాయుడు ఆదివారం చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మంచివారంటూనే మమ్మల్ని పక్కన పెట్టారని ఆయన పార్టీ అధినేత చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని ఆరోపించారు. విజయనగరం జిల్లా వెనకబడిన జిల్లా అని ఆయన తెలిపారు.
అలాంటి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మిస్తామని చెప్పి... ఇప్పుడు ప్రైవేట్ వైద్య కళాశాల అని ప్రభుత్వం చెబుతుందని ఆయన విమర్శించారు. ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాలనే ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎవరేమనుకున్న ఇది ప్రజల మాట అని నారాయణ స్వామి పేర్కొన్నారు.
అయితే కర్నూలు జిల్లాలో శనివారం జరిగిన టీడీపీ మినీ మహానాడులో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలకు తెర తీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చూపంతా పశ్చిమ గోదావరి జిల్లాపైనే అని ఆరోపించారు. కర్నూలు జిల్లాపై ఆయన దృష్టి సారించడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా మొత్తంలో కేవలం మూడు సీట్లు గెలుచుకుందని అప్పుడప్పుడు చంద్రబాబు తనకు గుర్తు చేస్తున్నారని... అయితే అందులో తన తప్పు లేదని చెప్పారు.
ఎన్నికల ముందు ప్రజా వ్యతిరేకత ఉన్న పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను టీడీపీలో చేర్చుకోవడం వల్లే... ఆ ఫలితాలు వచ్చాయని చంద్రబాబుకు ఈ సందర్భంగా తెలిపారు. కేఈ అసంతృప్తి వెళ్లగక్కిన మరునాడే పత్తివాడ నారాయణ స్వామి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.