ఎక్స్ కిరణాలను కనుగొన్న రాంట్జన్
ఆ నేడు
1895 నవంబర్ 8. ప్రపంచంలో వైద్యరంగంలో రోగనిర్ధారణకు ఎంతగానో తోడ్పడుతున్న ఎక్స్ కిరణాలను జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త విలియం రాంట్జెన్ కనుగొన్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీతో సహా పలు విఖ్యాత విశ్వవిద్యాలయాలలో భౌతికశాస్త్ర అధ్యాపకునిగా, ఆచార్యునిగా పని చేసిన రాంట్జెన్ నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉండేవారు. తన పరిశోధనలలో భాగంగా ఓ రోజున యాదృచ్ఛికంగా జరిగిన ఓ చర్య వల్ల ఈ కిరణాలను ఆయన కనుగొన్నారు.
మొదట్లో వాటిని అందరూ రాంట్జెన్ కిరణాలనే అనేవారు కానీ రాంట్జెనే స్వయంగా వాటికి ఎక్స్ కిరణాలని పేరు పెట్టడంతో అందరూ దానిని ఆమోదించక తప్పలేదు. ఈ మహావిష్కరణకి గుర్తుగా ఆయనకు 1901లో భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. బహుమతిగా వచ్చిన మొత్తాన్ని కూడా ఆయన తాను పని చేస్తున్న విశ్వవిద్యాలయానికే విరాళంగా ఇచ్చి, తన ఉదారతను చాటుకున్నారు. ఆయన పేరును చిరస్మరణీయం చేసేందుకుగానూ 2004లో కనుగొన్న 111వ మూలకానికి ఐయూపీఏసీ రాంట్జెనీయం అని పేరు పెట్టింది.