patients death
-
Telangana: మొన్న బాలింత.. నిన్న పసికందు.. నేడు మరొకరు
సాక్షి, నల్గొండ: మొన్న బాలింత, నిన్న నాలుగు రోజుల పసికందు, నేడు మరో వ్యక్తి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. పది రోజుల వ్యవధిలోనే ముగ్గురు మృతిచెందడం కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో మరణాలపై ఇటీవల డీఎంఈ రమేష్‌రెడ్డి విచారణ జరిపినా కూడా వైద్యుల తీరులో మార్పు కనిపించడం లేదని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అస్వస్థతతో బాధపడుతున్న వ్యక్తికి సకాలంలో సరైన చికిత్స అందించకపోవడంతోనే మృతిచెందాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. సకాలంలో వైద్యం అందలేదని.. నల్లగొండ పట్టణానికి చెందిన కంది బుచ్చిరాములు (50) తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి సిబ్బంది అతడిని అత్యవసర విభాగంలో చేర్చి చికిత్స అందించారు. నిమిషాల వ్యవధిలోనే బుచ్చిరాములు మృతిచెందడంతో బంధువులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. సకాలంలో వైద్యం అందకనే బుచ్చిరాములు మృతిచెందాడంటూ డ్యూటీలో ఉన్న డాక్టర్ శ్రీనాథ్‌తో వాగ్వాదం చేస్తూ అతడిపై చేయి చేసుకున్నారు. దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని డాక్టర్‌పై దాడిచేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విధులు బహిష్కరించి డాక్టర్ల ఆందోళన సేవాభావంతో విధులు నిర్వహిస్తున్నా తమపై రోగుల బంధువులు దాడి చేస్తున్నారంటూ జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో డాక్టర్ శ్రీనాథ్‌పై దాడి చేసిన ఓ వ్యక్తి అక్కడికి రాగా, పోలీసుల సమక్షంలోనే అతడిపై వైద్య సిబ్బంది ప్రతిదాడి చేశారు. అతడి వెంట ఉన్న మహిళలు కాళ్లు పట్టుకుంటామని వేడుకున్నా పట్టించుకోకుండా పిడిగుద్దులు కురిపించారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ప్రతిదాడి చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం నీలగిరి ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మూర్తి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనితారాణి, కోశాధికారి డాక్టర్ రమేష్, ఇతర వైద్యులు.. ఎస్పీ రెమా రాజేశ్వరిని కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరారు. -
కోవిడ్ ఆస్పత్రిలో అగ్నికీలలు
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 8 మంది కోవిడ్–19 బాధితులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.6 లక్షల పరిహారం ప్రకటించాయి. నగరంలోని నవ్‌రంగ్‌పురా ప్రాంతంలోని శ్రేయ్ ఆస్పత్రి చివరి, నాలుగో అంతస్తులో గురువారం వేకువజామున 3.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఆ అంతస్తులోని ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. ఘటన జరిగిన సమయానికి వార్డులో 11 మంది రోగులున్నారని, ముగ్గురు రోగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన వార్డ్బాయ్ చిరాగ్ పటేల్ తెలిపాడు. ఈ క్రమంలో ఇతనికి గాయాలు కాగా ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రి సిబ్బంది వెంటనే దిగువ జనరల్ వార్డుల్లో ఉన్న 41 మందిని సురక్షితంగా వేరే ఆస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా నాలుగో అంతస్తులో చెలరేగిన మంటలు, క్షణాల్లోనే వార్డును చుట్టుముట్టాయని అధికారులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రధాని సహాయ నిధి నుంచి కేంద్రం రూ.2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు.. క్షతగాత్రులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.50 వేల చొప్పున పరిహారంగా ప్రకటించాయి. అహ్మదాబాద్‌లో కోవిడ్ చికిత్సకు యంత్రాంగం గుర్తించిన 60 ప్రైవేట్ ఆస్పత్రుల్లో శ్రేయ్ ఒకటి. అహ్మదాబాద్ ఆస్పత్రిలో ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రూపానీకి ఫోన్ చేసి, ఘటన వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అన్ని విధాలా సాయం అందజేస్తామని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన శ్రేయ్ ఆస్పత్రిని సీజ్ చేయాలని సీఎం రూపానీ ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఇద్దరు ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆస్పత్రి ట్రస్టీల్లో ఒకరైన భరత్ మహంత్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
మదురై ఆస్పత్రిలో దారుణం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని మదురై ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు ఒకరి తరువాత మరొకరు ప్రాణాలు విడిచిన విషాదకర సంఘటన మంగళ, బుధవారాల్లో జరిగింది. మదురైలో మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా బలమైన గాలులు వీయడంతోపాటు భారీ స్థాయిలో వర్షం కురిసింది. దీంతో సుమారు రెండు గంటలపాటు ఆ ప్రాంతమంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆస్పత్రికి కూడా కరెంటు సరఫరా నిలిచిపోవడం, జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా ఆలస్యం కావడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రోగులు ఆక్సిజన్ అందకపోవడంతో విలవిల్లాడారు. ఈ నేపథ్యంలో మదురై జిల్లా మేలూరుకు చెందిన మల్లిక (55), దిండుగల్లు జిల్లా ఒట్టనసత్రంకు చెందిన పళనియమ్మాళ్ (60), విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన రవీంద్రన్ (52) ప్రాణాలు విడిచారు. బుధవారం ఉదయం మదురై సెల్లూరుకు చెందిన చెల్లత్తాయ్ (55), తిరుప్పూరు జిల్లా పల్లడంకు చెందిన ఆర్ముగం (48) కూడా మృతి చెందారు. అయితే వెంటిలేటర్ పనిచేయక పోవడం వల్ల కాదని, వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెంచారని ఆస్పత్రి డీన్ వనిత చెప్పారు. -
షాద్‌నగర్‌లో వైద్యురాలిపై దాడి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. కాన్పు కోసం రజిత అనే మహిళ స్థానిక ఆస్పత్రిలో చేరింది. శిశువుకు జన్మ ఇచ్చిన కొద్దిసేపటికే సదరు మహిళ మృతి చెందింది. శిశువు పరిస్థితి కూడా విషమంగా ఉందని వెంటనే హైదరాబాద్ తరలించాలని వైద్యులు మృతురాలి బంధువులకు సూచించారు. దీంతో మృతురాలి బంధువులకు ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. మీ నిర్లక్ష్యం వల్లే తల్లి చనిపోయిందని, శిశువు పరిస్థితి విషమంగా ఉందని ఆరోపిస్తున్న మృతురాలి బంధువులు వైద్యురాలిపై దాడి చేశారు. ఈ దాడిలో వైద్యురాలు డా. ఝాన్సీ తీవ్రంగా గాయపడింది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగంప్రవేశం చేసి మృతురాలి బంధువులను శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.